వచ్చే నెలలో రాజీనామా చేస్తున్నాను.. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన

By Sumanth KanukulaFirst Published Jan 19, 2023, 10:42 AM IST
Highlights

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ తాను రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. వచ్చే నెలలో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు.

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ తాను రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. వచ్చే నెలలో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. తనకు ఇదే సరైన సమయం అని జసిండా తన లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో అన్నారు. 2017లో సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా జసిండా అర్డెర్న్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలలో ఆమె సారథ్యంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జసిండా.. మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. దేశంలో కోవిడ్ నియంత్రణకు జసిండ్ చేసిన కృషిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

అయితే ఇటీవలి కాలంలో జసిండా పార్టీపై, ఆమెపై ప్రజాదరణ తగ్గిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆమె లేబర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంటు వేసవి విరామ సమయంలో తాను నాయకురాలిగా కొనసాగడానికి శక్తిని పొందాలని ఆశించానని, కానీ అలా చేయలేకపోయానని చెప్పారు. మరోవైపు కొన్ని రిపోర్ట్స్ కూడా ఆమెకు ప్రజల్లో ఆదరణ తగ్గినట్టుగా నివేదిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే ఆమె ప్రధాని పదవికి రాజీనామాను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 7 తన కార్యాలయంలో చివరి రోజు అని జసిండా చెప్పారు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు జరగనున్న అక్టోబర్ 14 వరకు తాను ఎంపీగా కొనసాగుతానని చెప్పారు. జనవరి 22న లేబర్ పార్టీ కొత్త నాయకుడికి కోసం ఎన్నిక నిర్వహించనున్నట్టుగా జసిండా తెలిపారు.

‘‘నేను వదలడం లేదు. వచ్చే ఎన్నికల్లో మనం గెలవలేమని నేను నమ్ముతున్నానని ఇలా చేయడం లేదు. అలాగని ఎవరూ భావించొద్దు. మనం గెలవగలం. గెలుస్తామని నేను నమ్ముతున్నాను’’ అని  అన్నారు.  తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని జసిండా అన్నారు. ఈ నిర్ణయం తాను సొంతంగా తీసుకున్నదేనని చెప్పారు. 

‘‘దేశానికి నాయకత్వం వహించడం అనేది ఎవరైనా పొందగలిగే అత్యంత విశేషమైన పని. అయితే చాలా సవాలుతో కూడుకున్నది. మీకు పూర్తి సామర్థ్యం ఉంటే తప్ప మీరు పని చేయలేరు.. అలా లేకపోతే  చేయకూడదు’’ అని జసిండా అన్నారు. 

click me!