
Jaahnavi Kandula death: అమెరికాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు మరణానంత డిగ్రీ అందనుంది. ఈ మేరకు అక్కడి యూనివర్సీటీ ఒక ప్రకటన చేసింది. జాహ్నవి చదివిన నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
వివరాల్లోకెళ్తే.. అమెరికాలో వేగంగా వచ్చిన పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు మరణానంతరం డిగ్రీ ప్రదానం చేసి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. విద్యార్థి మృతిపై ఓ పోలీసు అధికారి సరదాగా, నవ్వుతూ ఉన్న బాడీక్యామ్ వీడియో బయటకు రావడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని భారత్ డిమాండ్ చేసింది.
నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ ఛాన్సలర్ కార్యాలయం ఒక ప్రకటనలో.. జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోవడం దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో తమ క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారని అన్నారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీని ప్రదానం చేసి ఆమె కుటుంబానికి అందించాలని విశ్వవిద్యాలయం యోచిస్తోందని ఛాన్సలర్ చెప్పారు.
నార్త్‌ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న జాహ్నవి కందుల ఈ ఏడాది జనవరి 23 రాత్రి పాదచారుల క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురైంది. పోలీసు అధికారి వాహనం ఢీకొని ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే, సియాటెల్ పోలీసు అధికారి డేనియల్ ఆడెరర్ బాడీక్యామ్ వీడియో బయటకు వచ్చింది. ఇందులో అతను ప్రాణాంతక ప్రమాదం గురించి చర్చిస్తున్నాడు. అందులో నవ్వడం, విద్యార్థి మరణంపై తక్కువచేసి మాట్లాడటం కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా, కర్నూలు లోని ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు.