ఇరాన్‌లో పెరుగుతున్న మరణ శిక్షలు.. ఒక్క రోజులో ముగ్గురు మహిళలకు ఉరి.. వారు చేసిన నేరం ఏంటంటే?

Published : Jul 30, 2022, 05:24 AM IST
ఇరాన్‌లో పెరుగుతున్న మరణ శిక్షలు.. ఒక్క రోజులో ముగ్గురు మహిళలకు ఉరి.. వారు చేసిన నేరం ఏంటంటే?

సారాంశం

ఇరాన్‌లో మరణ శిక్షలు పెరుగుతున్నాయి. అందులోనూ మహిళలకు ఎక్కువగా ఈ శిక్షలు అమలు అవుతున్నాయి. ఈ నెల 27న ఒకే రోజున ముగ్గురు మహిళలకు మరణ శిక్షను ఇరాన్ అమలు చేసింది.  

న్యూఢిల్లీ: ఇరాన్‌లో మరణ శిక్షలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ తీరుపై ఆందోళన చెందుతున్నది. ఇరాన్‌లో మరణ శిక్షల పై కన్నేసిన స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాయి. మరణ శిక్షలు పెరగడమే కాదు.. చాలా వరకు మహిళలనే ఉరి వేసి చంపేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇది మానవాళి ఇప్పటి వరకు సాధించుకున్న అభివృద్ధికి అర్థం లేకుండా చేస్తున్నదని పేర్కొంటున్నాయి. తాజాగా, ముగ్గురు మహిళలను ఒకే రోజులో ఉరి తీసినట్టు తెలిసింది.

మహిళలకు హక్కులు దాదాపు లేకపోవడం.. పెళ్లయ్యాక గృహ హింస ఎదుర్కొన్నా విడాకులు ఇచ్చే హక్కు లేదు. కానీ, చిన్న వయసులోనే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తలను భార్యలు చంపేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేరాల కింద మహిళలకు ఎక్కువగా మరణ శిక్షలు పడుతున్నాయి.

ఈ వారంలో ముగ్గురు మహిళలకు ఒకే రోజు మరణ శిక్ష అమలు చేశాయని ఓ ఎన్జీవో చెప్పింది. ఈ ముగ్గురూ భర్తలను చంపేసిన నేరం కింద ఇన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు మరణ శిక్ష వేశారు. మూడు వేర్వేరు కేసుల్లో జులై 27న ముగ్గురు మహిళలకు మరణ శిక్ష అమలు చేశారని నార్వేలోని ఇరాన్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. తాజా ఉరి శిక్షలతో ఈ ఏడాది ఇరాన్ ఇప్పటి వరకు 10 మంది మహిళల ప్రాణాలు తీసినట్టయిందని వివరించింది. టెహ్రాన్ వెలుపలి ఓ జైలులో జెనోబర్ జలాలీ అనే అఫ్ఘాన్ పౌరురాలికి ఉరి శిక్ష అమలు చేశారు. 15 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన సొహెలా అబేదీకి భర్తను చంపేసిన కేసులో పశ్చిమ ఇరాన్, సనందాజ్ నగరంలో ఉరి శిక్ష అమలైంది. ఈమె తనకు పెళ్లయిన పదేళ్లకు భర్తను చంపేసింది. 2015లో ఆమె దోషిగా తేలింది. భర్తను చంపినట్టుగా ఐదేళ్ల క్రితం నిర్ధారణ అయిన ఫరనాక్ బెహెస్తీని వాయవ్య ఇరాన్‌లోని ఉర్మియా నగరంలో ఉరి తీశారు. 

ఇరాన్‌లో మరణ శిక్షలు పెరగడమే కాదు.. అందులోనూ మహిళలకు ఉరి పోయడాలు ఎక్కువ అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వారు భర్తలను చంపేస్తున్నారనే అభియోగాలే. భర్తలను చంపేయడానికి కూడా పలు కారణాలను స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్‌ చట్టాలు మహిళల హక్కులను పరిగణనలోకి తీసుకోవడం లేవని, మహిళలకు వ్యతిరేకంగానే చట్టాలు ఉన్నాయని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే