Russia Ukraine War: ‘నేను పారిపోలేదు, ఎవరికీ భయపడను’: సోషల్ మీడియాలో లొకేషన్ షేర్ చేసిన జెలెన్‌స్కీ

Published : Mar 08, 2022, 01:04 PM ISTUpdated : Mar 08, 2022, 01:33 PM IST
Russia Ukraine War: ‘నేను పారిపోలేదు, ఎవరికీ భయపడను’: సోషల్ మీడియాలో లొకేషన్ షేర్ చేసిన  జెలెన్‌స్కీ

సారాంశం

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఏకంగా తన లొకేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను ఎక్కడికి పారిపోయి దాక్కోలేదని, తాను ఎవరికీ భయపడట్లేదని స్పష్టం చేశారు. తన సెల్ఫీ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. రష్యా సేనలను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ జవాన్లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

న్యూఢిల్లీ: రష్యా (Russia) దాడులతో ఉక్రెయిన్ (Ukraine) భీతిల్లిపోతున్నది. ఏ క్షణంలో ఎక్కడ క్షిపణులు పడేది తెలియకున్నది. ఈ నేపథ్యంలో  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన తీరుతో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ..  రష్యా సేనలను ప్రతిఘటించడంలోనూ ఆయన సఫలం కాగలిగారు. కాగా, ఆయన ప్రాణాలను హానీ ఉన్నదని, రష్యా  అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఆయనపై కనీసం మూడు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని కథనాలు వచ్చాయి. రష్యా కూడా పలుమార్లు ఆయన పరారీలో ఉన్నారని  ఆరోపించింది. జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) దేశం దాటి పోయాడని చేసిన ఆరోపణలను ఇది వరకే ఆయన ఖండించారు. తాజాగా, ఆయన తన లొకేషన్‌ (Location)ను సోషల్ మీడియాలోనే షేర్ చేసి సంచలనం సృష్టించారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ తన లొకేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని బంకోవా వీధిలో ఉన్నారని వివరించారు. తాను దాక్కోలేదని, తాను ఎవరికీ భయపడట్లేదని స్పష్టం చేశారు. ఎలాగైనా.. తాము ఈ యుద్ధంలో గెలిచి తీరుతామని అన్నారు. తన సెల్ఫీ వీడియోలో జెలెన్‌స్కీ బయట వీధులను చూపిస్తూ.. తన డెస్క్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఉక్రెయిన్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అక్కడ కూర్చుని యుద్ధం మొదలై ఇది 12వ రోజు అని, ఇప్పుడు సాయంత్రం అవుతున్నదని వివరించారు. తాను కీవ్ నగరంలోనే ఉన్నారని తెలిపారు. తాను, తన టీమ్ కూడా ఇక్కడే ఉన్నామని, ఇక్కడి నుంచి తాము పనిచేస్తున్నామని వివరించారు. రష్యాను ఎదుర్కోవడంలో ముందుండి పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తప్పక గెలుస్తుందని విశ్వాసాన్ని ప్రకటించారు.

రష్యా యుద్ధంతో ముప్పు ఉన్నదని జెలెన్‌స్కీని దేశం వదిలిరమ్మని, తరలించడానికి తాము సిద్ధం అని అమెరికా ప్రకటించింది. కానీ, ఆ సహాయాన్నీ ఆయన తోసిపుచ్చారు. తనకు కావాల్సింది తరలింపు కాదని, ఆయుధాలు పంపండి ఈ రణభూమిలో తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ ధైర్య సాహసాలు రష్యా వంటి పెద్ద దేశం ముందు నిలబడి ప్రదర్శిస్తుండటం ఆశ్చర్యకరంగా ఉన్నది.

ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపాలని మూడు సార్లు హత్యా ప్రయత్నాలూ జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ, చివరి నిమిషంలో అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది జెలెన్‌స్కీని కాపాడగలిగారు. చెచెన్ రెబెల్స్, వాగ్నర్ గ్రూపులు జెలెన్‌స్కీని అంతమొందించాలనే లక్ష్యంతో రష్యా సూచనల మేరకు బయల్దేరినట్టు ఆరోపణలు వచ్చాయి. 

అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ జెలెన్‌స్కీ గురించి స్పందించారు. ఆయన మరణం గురించీ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్‌స్కీని ఒక వేళ రష్యా చంపేసినా.. ఉక్రెయిన్ ప్రభుత్వం కొనసాగడానికి సర్వం సిద్ధంగా ఉన్నదని వివరించారు. తాను మొన్న ఉక్రెయిన్ వెళ్లారని, అక్కడ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబాతో సమావేశం అయినట్టు తెలిపారు. అయితే, దాని గురించి మాట్లాడుతూ, ఒక వేళ జెలెన్‌స్కీ మరణించినా ప్రభుత్వం నడవడానికి అన్ని రకాల ప్రణాళికలు ఉక్రెయిన్‌లో సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారని వివరించారు. అదే సమయంలో రష్యాను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ, ఆయన ప్రభుత్వం చూపిస్తున్న తెగువ అమోఘం అని ప్రశంసించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే