‘ఈ రహస్యం నన్ను పీక్కుతింటున్నది’.. 15 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో నేరాన్ని ఏడుస్తూ అంగీకరించిన నిందితుడు

By Mahesh KFirst Published Jun 5, 2023, 6:00 PM IST
Highlights

మెక్సోకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి యజమానిని చంపేశాడు. శవాన్ని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. 15 ఏళ్ల తర్వాత స్వయంగా ఆ నిందితుడు బోరున విలపిస్తూ ఈ నేరం అంగీకరించని జీవితం తనకు వద్దని, ఈ రహస్యం తనను తినేస్తున్నదని పోలీసులను ఆశ్రయించి చెప్పాడు. తానే హత్య చేశానని అంగీకరించాడు.
 

న్యూఢిల్లీ: ఆ వ్యక్తి అద్దెకు ఉంటున్న ఇంటి యజమానిని చంపేశాడు. స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. స్పాట్‌కు వచ్చిన పోలీసులకు ఈ హత్యకు సంబంధించి ఏ ఆధారాలూ లభించలేవు. చంపేసిన శవాన్నీ కూడా పోలీసులకు దొరకకుండా పాతిపెట్టిన నిందితుడినీ వారు పట్టుకోలేకపోయారు. 15 ఏళ్లు గడిచాయి, కానీ, కేసులో పురోగతి లేదు. ఈ 15 ఏళ్లు నిందితుడు శిక్ష నుంచి అయితే తప్పించుకున్నాడు. కానీ, మనస్సాక్షి అతన్ని నిత్యం శిక్షిస్తూనే ఉన్నది. దినదినం అతని మనసు భారమైంది. మానసికంగా దుర్భలుడయ్యాడు. ఇలా జీవించి వ్యర్థం, ఈ అబద్ధపు జీవితం వద్దు అని ఆ నిందితుడు అనుకున్నాడు. నేరాన్ని అంగీకరించి మనస్సును తేలిక పరుచుకోవడమే ముఖ్యం అని తలచి ఆయనే పోలీసులకు ఫోన్చేసి మరీ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. పశ్చాత్తాపంతో బోరున విలపిస్తూ.. ఆ మర్డర్ చేసింది తానే అని ఒప్పుకున్నాడు. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.

మెక్సికోకు చెందిన టోనీ పెరాల్టా 15 ఏళ్ల క్రితం 2008 డిసెంబర్‌లో తన ఇంటి యజమాని విలియం బిల్ బ్లాడ్జెట్‌ను స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. ఇప్పుడు రోస్‌వెల్ పోలీసు డిపార్ట్‌మెంట్ అధికారులను ఆశ్రయించి ఈ సీక్రెట్ నన్ను నిలువున దహించి వేస్తున్నదని, కొంచెం కొంచెం నన్ను తినేస్తున్నదని అశ్రు నయనాలతో చెప్పాడు.

ఇంటి యజమాని హత్యా నేరాన్ని అంగీకరిస్తున్న పెరాల్టా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. హత్య చేయడానికి చాలా మందికి ఎన్నో కారణాలు, సాకులు ఉండొచ్చు.. కానీ, తనకు ఏ సాకూ లేదని చెప్పాడు. ఆ శవాన్ని ఎక్కడ పాతిపెట్టాడో.. చంపడానికి ఉపయోగించిన స్క్రూడ్రైవర్‌నూ ఎక్కడ ఉంచాడో కూడా వెల్లడించాడు.

ఆ వీడియోలో పెరాల్టా మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ‘ఈ అబద్ధాలను కవర్ చేసి చేసి అలసిపోయాడను. నా జీవితం జీవించలేకున్నాను. ఔను, నేను ఒక వ్యక్తిని చంపేశాను. నేను ఆయనను స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపేశాను’ అంటూ పెరాల్టా వివరించాడు. ఇలా మాట్లాడుతూ పెరాల్టా కన్నీరు పెడుతూనే ఉన్నాడు.

ఇంటి యజమాని విలియం బ్లాడ్జెట్ 2009 జనవరి 3 నుంచి మిస్సింగ్‌గా రిపోర్ట్ అయింది. పది రోజుల వరకూ ఆయన ఆచూకీని కుటుంబ సభ్యులు కనిపెట్టలేకపోయారు. అయితే, ఆయన వద్ద అద్దెకు ఉంటున్న వ్యక్తితో కొన్ని ఇష్యూలు విలియంకు ఉన్నాయని ఆ తర్వాత పోలీసులకు తెలిసింది. ఓ డిటెక్టివ్ పెరాల్టాను ఇంటర్వ్యూ చేశాడు. కానీ, కొత్త విషయాలేమీ లేవని డిటెక్టివ్ అనుకున్నాడు.

Also Read: Odisha: బాలాసోర్ రైలు పట్టాలపై ప్రేమ కవితలు.. డైరీలోనే ఆ ప్రేమ శిథిలం

తాను కొన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నాడని, కొంత మద్యం సేవించిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసినట్టు పెరాల్టా చెప్పాడు. చివరకు తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టు వివరించాడు. 

‘నేను నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఇలా నేరాన్ని అంగీకరించకుండా జీవించడం నాకు ఇష్టం లేదు. ఆ జీవితం నాకు వద్దు’ అని పెరాల్టా అన్నాడు. ‘ఆ మనిషి చాలా మంచివాడు. నేను అతన్ని చంపేయకుండా ఉండాల్సింది. ఆయన నాతో ఎప్పుడూ మంచిగా మెలిగాడు. అసలే కారణమూ లేకుండానే ఆయన ప్రాణాన్ని తీశా..’ అని పెరాల్టా అన్నాడు.

పెరాల్టా వివరాలు అందించిన తర్వాత ఓ పుఱ్ఱె, పలు ఎముకలు లభించినట్టు అధికారులు ఓ అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆగస్టు 21న పెరాల్టా కోర్టులో విచారణ ఎదుర్కోబోతున్నట్టు సమాచారం.

click me!