
బీచ్‌లో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దసంఖ్యలో పర్యాటకులు ఒడ్డున సేదతీరుతున్నారు. కొందరు నీళ్లలో స్విమ్ చేస్తూ జాలిగా గడుపుతున్నారు. అయితే అందరూ చూస్తుండగా.. ఒక్కసారిగా హెలికాఫ్టర్ బీచ్‌లో కుప్పకూలింది. దీంతో అక్కడున్నవారు షాక్ తిన్నారు. ఈ ఘటన అమెరికాలోని మియామీ బీచ్‌లో (Miami Beach) చోటుచేసుకుంది. హెలికఫ్టర్‌లో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉండగా.. వారిలో ఇద్దరికి ప్రస్తుతం ఆస్పత్రిలో చకిత్స కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
రాబిన్సన్ R44 హెలికాప్టర్ మధ్యాహ్నం రద్దీగా ఉండే బీచ్‌కు సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.
ప్రమాదానికి సంబంధిచిన వీడియోను Miami Beach Police అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మధ్యాహ్నం 1.10 గంటలకు 10 స్ట్రీట్ సమీపంలోని సముద్రంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు మియామీ బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్టుగా పేర్కొంది. స్ట్రీట్ 9, 11ల మధ్య ప్రాంతాన్ని ప్రస్తుతానికి మూసివేసిట్టుగా తెలిపారు.