
న్యూఢిల్లీ: ఒక్కో కారు కోట్ల రూపాయల ఖరీదు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పేరున్న లగ్జరీ కార్లు(Luxury Cars). తయారీ కేంద్రం నుంచి కస్టమర్ల కోసం ఆయా దేశాల్లోని షోరూమ్‌లకు పంపిణీ చేయడానికి భారీ షిప్‌లో పంపారు. ఒకటి రెండు కాదు.. సుమారు నాలుగు వేల లగ్జరీ కార్లను మోసుకుంటూ ఆ భారీ షిప్(Cargo Ship) ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ, ప్రమాదవశాత్తు సముద్రం మధ్యలో ఆ షిప్‌లో మంటలు(Fire Accident) అంటుకున్నాయి. కార్లను తీరానికి చేర్చడం కాదు కదా.. షిప్‌లోని సిబ్బంది బతికే అవకాశాలే స్వల్పంగా ఉన్నాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న సమీప దేశం వెంటనే బలగాలను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపింది. ఎలాగోలా షిప్‌లోని 22 మంది సిబ్బందిని అయితే వారు రక్షించగలిగారు. కానీ, ఆ 3,965 లగ్జీర కార్లను ఒడ్డుకు చేర్చలేకపోయారు. మంటలు అలుముకున్న ఆ షిప్‌ను అలాగే వదిలిపెట్టారు. దీంతో లంబోర్ఘిని, పోర్షె, ఆడి వంటి లగ్జరీ కార్లు ఎవరికీ దక్కకుండా నీటిపాలు అయ్యాయి.
జర్మనీలో హెడ్‌క్వార్టర్ ఉన్న వోక్స్ వ్యాగన్ గ్రూప్ ఈ లగ్జరీ కార్లను తయారు చేస్తున్నది. లంబోర్ఘిని, పోర్షె, ఆడి వంటి కార్లను ఈ గ్రూప్ తయారు చేస్తున్నది. ఈ గ్రూప్‌కు చెందిన 3,965 లంబోర్ఘిని, పోర్షె, ఆడి కార్లను ది ఫెలిసిటీ ఏస్ అనే భారీ కార్గో షిప్‌లో ఎక్కించారు. కెనడాలోని డావిస్విల్‌కు ప్రయాణించాల్సి ఉన్నది. ఆ షిప్‌లోని వంద కార్లు అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హుస్టన్‌కు చేరవేయాల్సి ఉన్నది. కానీ, ఈ భారీ షిప్‌లో బుధవారం మధ్యాహ్నం అజోర్స్ దీవుల సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో మంటలు వ్యాపించాయి.
అమెరికాలోని వోక్స్‌వ్యాగన్ అంతర్గత ఈమెయిల్ ద్వారా ఆ షిప్‌లో 3,965 లగ్జరీ కార్లు వెళ్తున్నట్టు తెలిసింది. పోర్షె అధికార ప్రతినిధి ల్యూక్ వాండెజండె మాట్లాడుతూ, షిప్‌లో మంటలు అంటుకున్నప్పుడు తమ కంపెనీకి చెందిన సుమారు 1,100 కార్లు ఆ షిప్‌లో ఉన్నాయని వివరించారు. ఈ షిప్‌లో మంటల వల్ల కొందరు తమ కస్టమర్లు ప్రభావితం అవుతున్నారని, వారికి సంబంధిత షోరూమ్‌లు కాంటాక్ట్ చేసి వివరణ ఇస్తాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం గురించి తమకు తెలియగానే మొదటగా.. ఆ షిప్‌లోని 22 మంది సిబ్బంది గురించి ఆలోచించామని వివరించారు. ఈ ప్రమాదం నుంచి సిబ్బందిని కాపాడటానికి పోర్చుగీస్ నేవీ, వైమానిక దళాలు సహాయక చర్యల్లోకి దిగారు. ది ఫెలిసిటీ ఏస్ షిప్.. మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల వైశాల్యంతో ఉన్నది.
గతేడాది నవంబర్‌లో గుజరాత్ సమీపంలో సముద్రంలో రెండు విదేశీ కార్గో షిప్‌లు ఢీకొన్నాయి. ద్వారకా జిల్లా ఒఖా నుంచి పది మైళ్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎంవీఎస్ ఏవియేటర్, అట్లాంటిక్ గ్రేస్ నౌకలు గల్ఫ్ ఆఫ్ కచ్‌లో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన వివరాలు తెలియగానే కోస్ట్ గార్డ్ టీమ్ అప్రమత్తమైంది. ఒక పెట్రోలింగ్ షిప్‌తోపాటు ఓ హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపించారు. ఈ ఘటనలో ప్రాణ హాని జరగలేదని తెలిసింది. కాగా, ఈ రెండు నౌకల నుంచి చమురు కూడా లీక్ అయినట్టు తెలిసింది. అయితే, పొల్యూషన్ కంట్రోల్ పడవ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌వో పేర్కొంది. సముద్రంలో రసాయనాలు కలిస్తే వాటిని తొలగించడానికి ఈ నౌక పని చేస్తుంది. ఆ రెండు నౌకల పై ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు.