
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (ukraine russia crisis) ప్రకటించడంతో.. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ (pakistan) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (imran khan) మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా బాధ్యలు చేపట్టిన తర్వాత మొదటిసారి రష్యాలో పర్యటిస్తోన్న ఆయన.. తాను చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటన పెట్టుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పాకిస్థాన్ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. రెండు దశాబ్దాల కాలంలో పాక్ ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు.
ఇమ్రాన్ విమానాశ్రయంలో దిగగానే.. రష్యా ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆ దేశ అధికారితో మాట్లాడుతూ.. ‘ఏం టైమింగ్‌లో వచ్చాను. చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక గురువారం తెల్లవారుజామున పుతిన్ (putin) తన ప్రకటనలో రష్యా.. సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేస్తోందనీ, జనాభా ఉన్న ప్రాంతాలను కాదని పేర్కొన్నారు. కానీ, అప్పటికే భారీ ప్రాణనష్టం జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దళం ఉత్తరాన ఉన్న తమ పోస్ట్‌లు రష్యన్ మరియు బెలారస్ దళాల నుండి దాడికి గురయ్యాయని పేర్కొంది. అంటే, రష్యా ఒక్కవైపు నుంచే కాకుండా అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్నదని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.
బెలారస్ వైపు నుంచి కొనసాగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్ లు వైరల్ అవుతున్నాయి. కీవ్‌కు 120 మైళ్ల దూరంలో ఉన్న బెలారస్ సరిహద్దుపై కూడా రష్యా దాడి చేసిందని ఉక్రేనియన్ ప్రభుత్వ ప్రతినిధి ధృవీకరించారు. "ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు రష్యా మరియు బెలారస్ నుండి వచ్చిన దళాలచే దాడి చేయబడింది. ఉదయం 5 గంటలకు, ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు, రష్యన్ ఫెడరేషన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ ఉన్న ప్రాంతంలో, బెలారస్ మద్దతు ఉన్న రష్యన్ దళాలు దాడి చేశాయి" అని తెలిపారు.
ఇదిలావుండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐరాస ఈ యుద్ధం ఆపాలని ఇప్పటికే రష్యాను కోరింది. దీని కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక ప్రపంచంలోని అగ్ర దేశాధినేతలు సైతం రష్యా తీరు మార్చుకోవాలని పిలుపునిస్తున్నారు. అమెరికా అయితే, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామనీ, దీనికి పూర్తి బాధ్యత వహించేలా రష్యాపై చర్యలు తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేసింది.