
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి అవార్డుల నామినేషన్ ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఈ అవార్డులను ఈ యేడాది అక్టోబర్ లో ప్రధానం చేస్తారు. అయితే ఈ శాంతి పురస్కారాల రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నోబెల్ అవార్డు నామినేషన్ లు ఆసక్తిని రేపుతున్నాయి.
ఈ నామినేషన్స్ మీద ఇప్పటికి నోబెల్ కమిటీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే ట్రంప్ తో పాటు ఈ నామినేషన్లలో స్వీడన్ కు చెందిన పద్దెనిమిదేళ్ల అమ్మాయి, పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా ఉన్నాయి.
బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రెటా చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగాలు చేస్తోంది. అంతేకాదు పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గొంతు విప్పుతోంది.
అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకున్న అవగాహన, మిగతా వారిని పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న కృషికి గానూ ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది.
ఇక ఇందులో వినిపిస్తున్న మరో పేరు రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ. ఈయన కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వామ్యం కోసం ఎన్నో యేళ్లుగా కృషి చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విష ప్రయోగం కూడా జరిగిన విషయం తెలిసిందే. దీంతో నావల్నీ అయిదు నెలలు జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
చికిత్స అనంతరం ఇటీవల రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేశారు. దీంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి వారితో పాటు ఈసారి నోబెల్ శాంతి అవార్డుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండటం విశేషం.
అంతేగాక డబ్ల్యూహెచ్‌ఓతో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవాగ్జిన్ ప్రోగ్రామ్ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.