
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) యుద్ధం ముగిసేలా కనిపించట్లేదు. శాంతి చర్చలు, దౌత్యంతో పెద్దగా ఫలితాలు వచ్చేలా లేవు. ఆర్థిక ఆంక్షలూ రష్యాను కట్టడి చేసేలా లేవు. ఎందుకంటే.. ఆర్థిక ఆంక్షలు విధించిన యూరప్ దేశాల(Europe Countries)నే రష్యా నేరుగా హెచ్చరించింది. తాము గ్యాస్ సప్లై ఆపేస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తన వైఖరి నుంచి ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేసే అవకాశమే లేదని రష్యా మొండికేసినట్టుగానే నడుచుకుంటున్నది. అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకతను కొంతలో కొంత తగ్గించుకోవడానికి ప్రముఖ నగరాలపై బాంబులు వేయడానికి ముందు పౌరుల తరలింపునకు కొంత విరామం ఇస్తున్నది.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ దేశం రష్యాను ఎదుర్కోవడంలో ఎక్కువగా పశ్చిమ దేశాలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఆయుధాలు, దౌత్యం, అంతర్జాతీయంగా రష్యాపై ఒత్తిడి తేవడానికి పశ్చిమ దేశాలు, అమెరికానే ఉక్రెయిన్‌కు అవసరం అవుతున్నాయి. అసలు యుద్ధ మూలాలే పశ్చిమ దేశాల్లో ఉన్నాయి. అంటే అమెరికా సారథ్యంలోని నాటో సైనిక కూటమిలో ఉక్రెయిన్ చేరవద్దని రష్యా గట్టిగా డిమాండ్ చేసింది. పశ్చిమ దేశాలపై ఉక్రెయిన్ తరలివెళ్లిపోవడం రష్యాకు రుచించలేదు. ఈ డిమాండ్లు సాధ్యం కానప్పుడే ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’ ప్రకటించింది.
కానీ, ఉక్రెయిన్ మాత్రం అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల వైపే మొగ్గు చూపారు. ఆ దేశాలతో దగ్గరి సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. రష్యా దాడి ప్రారంభించిన తర్వాత కూడా హడావిడిగా యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. పశ్చిమ దేశాల వైపు తాము వెళ్లడాన్ని ఎవరూ అడ్డుకోలేరు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. పశ్చిమ దేశాలు, అమెరికా కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. భారీ మొత్తంలో ఆయుధాలను ఉక్రెయిన్‌కు సహాయంగా(తమ వ్యాపారంలో భాగంగా!) తరలించాయి. రష్యాకు ముకుతాడు వేయడానికి ఎన్నో ఆర్థిక ఆంక్షలనూ విధించాయి. కానీ, రష్యాను అడ్డుకోవడం ఆ దేశాలకు సాధ్యపడలేదు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నప్పటికీ రష్యా దాని సన్నిహిత మిత్ర దేశాలనూ కోల్పోయి ఒంటరిగా మారలేదు. వాటి అండ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉండనే ఉంటుంది.
కానీ, ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) రూటు మార్చాడా? పశ్చిమ దేశాలపై తన వైఖరిని సవరించుకున్నాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు, పశ్చిమ దేశాలు సైతం రష్యా హెచ్చరికలను ఆలోచించి తమ వైఖరిని సవరించుకున్నాయా? అనే సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇందుకు పశ్చిమ దేశాలపై జెలెన్‌స్కీ నిప్పులు కురిపించడం ఒక కారణం అయితే.. రష్యా భాగస్వామ్యం లేనిదే ప్రపంచంలో శాంతి స్థాపితం కాదని, అందుకే వారిని గౌరవపూర్వకంగా ట్రీట్ చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ పేర్కొనడం మరో కారణంగా ఉన్నది.
రష్యా వైమానిక దళాలు తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా నాటో కూటమి నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఉక్రెయిన్ కోరింది. ఈ విజ్ఞప్తిపై నాటో కూటమి సభ్యులు అత్యవసరంగా సమావేశమై దాన్ని తోసిపుచ్చాయి. ఒక వేళ తాము ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించినా.. రష్యా యుద్ధ విమానాలు ప్రవేశిస్తే, వాటిని తామే కూల్చేయాల్సి వస్తుందని, తద్వారా ఆ యుద్ధాన్ని ఉక్రెయిన్ నుంచి మరిన్ని దేశాలకు విస్తరించినట్టు అవుతుందని నాటో పేర్కొంది.
ఈ నిర్ణయంపై అదే రోజు అంటే ఈ నెల 5వ తేదీన జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూరప్ ఫ్రీడమ్ నెంబర్ వన్ గోల్ ఉండాలనే వాదనతో చాలా మంది యూరప్ నేతలు భావించడం లేదని తేలిపోయిందని వివరించారు. ఈ రోజు నాటో కూటమి నాయకత్వం ఉక్రెయిన్ గగనతలాన్ని నాన్ ఫ్లై జోన్‌గా ప్రకటించలేదని తద్వారా ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరింత అధికంగా బాంబులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయిందని పేర్కొన్నారు. ఇకపై మరణించే ఉక్రెయిన్ పౌరులకు నాటో కూటమి కూడా బాధ్యత వహించాలని అన్నారు. ఈ రోజు నుంచి మరణిస్తున్నవారు కేవలం మీ వల్లే మరణించినట్టు అవుతుందని, మీ బలహీనతల వల్ల, మీలో ఐకమత్యం లేకపోవడం వల్ల మరణించినట్టేనని కటువుగా మాట్లాడారు.
తాజాగా, ఆయన మరోసారి పశ్చిమ దేశాలపై విరుచుకపడ్డారు. ఉక్రెయిన్ పౌరుల మరణాలకు రష్యాను తప్పుపడితే... వాటిని నివారించే అవకాశం ఉండి కూడా ఆ పని చేయలేని పశ్చిమ దేశాల కార్యాలయాలూ ఈ మరణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తాము సహాయం రాలేదంటే.. ఉక్రెయిన్ పౌరులను క్రమంగా అంతమొందించడానికి పశ్చిమ దేశాలూ పూనుకున్నట్టేనని నిప్పులు చెరిగారు.
రష్యా వార్నింగ్‌లను పక్కనపెట్టి పశ్చిమ దేశాల వైపు పరుగులు పెట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఇప్పుడు ఆ దేశాలపై తరుచూ విమర్శలు చేస్తుండటం ఆలోచించదగ్గ పరిణామంగా మారింది. దీనికి తోడు రష్యా కూడా ఆయిల్ సప్లైలను నిలిపేస్తామని యూరప్ దేశాలకు వార్నింగ్ ఇవ్వడం.. మెల్లగా ఆ యూరప్ దేశాలూ రష్యా వైపు కదులుతున్నట్టు కనిపిస్తుండటం చర్చను తీవ్రతరం చేస్తున్నది. ఉక్రెయిన్ రాజీ పడితే.. యుద్ధం నిలిచిపోతుందనుకోవడం అతిశయం ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు.