న్యూయార్క్ నగరంలో కరోనా బారినపడి కోలుకున్న పోలీసులు తిరిగి విధులకు హాజరవుతుండడం విశేషం. రాష్ట్రాల్లో మళ్లీ మునుపటి పరిస్థితిని తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు పోటీపడుతున్నారు.
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. గత రెండు వారాలతో పోలిస్తే.. కూసింత ఊరటనిచ్చే వార్త వచ్చింది. నిన్నటి వరకు.. అమెరికాలో అత్యధికంగా న్యూయార్క్ లో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు కాస్త అక్కడ కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
న్యూయార్క్‌లో నిన్న 550 కంటే తక్కువ సంఖ్యలోనే మరణాలు సంభవించడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు వారాలుగా వేలల్లో నమోదవుతున్న మరణాల సంఖ్య ఆదివారం వందల్లోకి మారడంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలకు ఊరట లభించినట్టు అయింది. అంతేకాదు, ఐసీయూలో చేరుతున్న రోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
న్యూయార్క్ నగరంలో కరోనా బారినపడి కోలుకున్న పోలీసులు తిరిగి విధులకు హాజరవుతుండడం విశేషం. రాష్ట్రాల్లో మళ్లీ మునుపటి పరిస్థితిని తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు పోటీపడుతున్నారు.
ఇందులో భాగంగా టెక్సాస్‌లో త్వరలోనే దుకాణాలు తెరుచుకోనుండగా, ఫ్లోరిడా బీచ్‌లు, పార్కుల్లో సందర్శకుల జాడ కనిపిస్తోంది. మరోవైపు, లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ జరుగుతున్న ప్రదర్శనలు ఎక్కువవుతున్నాయి. టెక్సాస్‌లో వందలాదిమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.