ఆఫ్ఘాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు: విద్యార్ధులే టార్గెట్‌గా బాంబు దాడి, 25 మంది దుర్మరణం

By Siva KodatiFirst Published May 8, 2021, 9:57 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లోని ఓ స్కూలు సమీపంలో జరిగిన బాంబు పేలుడులో 25 మంది దుర్మరణం పాలవ్వగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది విద్యార్థులేనని ఆఫ్ఘాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు

ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లోని ఓ స్కూలు సమీపంలో జరిగిన బాంబు పేలుడులో 25 మంది దుర్మరణం పాలవ్వగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది విద్యార్థులేనని ఆఫ్ఘాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

సయ్యద్ అల్-షాదా స్కూలు వద్ద ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు. వచ్చే వారం ఈద్ పండుగ కావడంతో బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతంలోని దుకాణాలు కిటకిటలాడాయి. 

ఘటన జరిగిన ప్రాంతంలో షియాల ప్రాబల్యం ఎక్కువని అంతర్గత వ్యవహారాల మంత్రి తారిక్ అరియన్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించాయి.

అయితే బాంబు పేలుడుతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు అంబులెన్స్‌లపై దాడిచేసి అందులోని ఆరోగ్య సిబ్బందిని చితకబాదారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గులామ్ దస్తిగర్ నజరి పేర్కొన్నారు. మృతదేహాలు, క్షతగాత్రులతో సమీపంలోని ఆసుపత్రులు నిండిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ దాడిపై బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్‌ను వీడుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.  

click me!