విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌ .. అమెరికా సంచలన ప్రకటన, అలా అయితేనే అనుమతి

By Siva KodatiFirst Published Dec 5, 2021, 3:03 PM IST
Highlights

అందరూ హెచ్చరించినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ (omicron) కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశాలన్నీ సరిహద్దులకు తాళం వేసేసినా ఈ మహమ్మారి ఏదో ఒక రూపంలో విస్తరిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా (america) సంచలన నిర్ణయం తీసుకుంది

అందరూ హెచ్చరించినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ (omicron) కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశాలన్నీ సరిహద్దులకు తాళం వేసేసినా ఈ మహమ్మారి ఏదో ఒక రూపంలో విస్తరిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా (america) సంచలన నిర్ణయం తీసుకుంది.  భారత్‌తో సహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ (covid) నెగెటివ్‌ రిపోర్టు లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు వుంటేనే తమ దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్‌ఎస్)లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) (us cdc) వెల్లడించింది.  

రెండేళ్లు, ఆపై వయసున్న ప్రయాణికులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. నెగెటివ్‌ రిపోర్టు సైతం.. ప్రయాణానికి ఒకరోజు ముందు చేయించుకున్న పరీక్షకు సంబంధించినదై ఉండాలని వారు తెలిపారు. దీంతోపాటు ప్రయాణికులు తాము సమర్పించిన వివరాలు సరైనవే అని ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్‌లోనే (newyork) ఇప్పటి వరకు ఎనిమిది ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. 

Omicron: గుడ్ న్యూస్.. ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు లేవు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

కాగా..  కరోనా వైరస్(Corona Virus) ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 30కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దాని లక్షణాలు, తీవ్రత, సంక్రమణ వేగం వంటి అంశాలపై ఇంకా సమగ్ర విషయాలు వెల్లడి కాకపోవడంతో ఈ ఆందోళనలు మరింత అధికం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) రెండు రోజుల క్రితం కీలక విషయాన్ని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తిస్తున్న దేశాల జాబితా పెరుగుతూనే ఉన్నది. కానీ, ఈ వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు ఒక్కరూ మరణించినట్టు తమకు రిపోర్టులు రాలేవని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ గురించిన సమాచారాన్ని ఆ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాలన్నింటి నుంచి సేకరిస్తున్నట్టు ఆ సంస్థ వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పోక్స్‌మన్ క్రిస్టియన్ లిండ్‌మెయిర్ జెనీవాలో విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణించినట్టు తాను ఒక్క రిపోర్టునూ ఇప్పటి వరకు చూడలేదని ఆయన అన్నారు. ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు కలిగిస్తున్నదని తెలిపారు. అయితే, 60 రోజుల నుంచి అందిన సమాచారం ప్రకారం 99.8శాతం జీనోమ్ సీక్వెన్స్ వివరాలు కేవలం డెల్టా వేరియంట్ కేసులనే వెల్లడించాయని అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండవచ్చనని, వేగంగా ఇప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాప్తి చెందుతూ ఉండవచ్చునని తెలిపారు. ఒక దశలో ఇప్పుడు ప్రబలంగా ఉన్న వేరియంట్‌నూ దాటి పోవచ్చునని అన్నారు. కానీ, ఇప్పుడైతే అధిక తీవ్రత, ప్రభావం చూపిస్తున్న వేరియంట్ మాత్రం డెల్టానే అని వెల్లడించారు.
 

click me!