
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఇండియన్స్‌ను తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఈ ప్రయత్నాల్లో పురోగతి సాధించినట్టుగా భారత ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్‌కు నుంచి రొమేనియాకు చేరుకున్న 219 మంది భారతీయులతో కూడిన విమానం ముంబైకి బయలుదేరింది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానం.. ఈరోజు రాత్రికి ముంబైకి చేరుకోనుంది.
భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు. భారతీయులను ఎయిర్ ఇండియా విమానంలో స్వదేశానికి తీసుకొస్తున్న ఫొటోలను షేర్ చేసిన జైశంకర్.. ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరుల తరలింపుకు సంబంధించి పురోగతి సాధిస్తున్నామని చెప్పారు.
తమ బృందాలు 24 గంటలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయని.. తాను వ్యక్తిగతంగా భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. 219 మంది భారతీయ పౌరులతో రొమేనియా నుంచి ముంబైకి తొలి విమానం బయలుదేరిందని వెల్లడించారు. భారతీయుల తరలింపుకు సహకరించినందుకు రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి Bogdan Aurescuకు జైశంకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా.. బుకారెస్ట్‌కు, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌లకు మరిన్ని విమానాలను నడపనుంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం రొమేనియా, హంగేరియాలతో చర్చలు జరిపింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను వారి వెంట ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.ఇప్పటికే ఒక విమానం భారతీయులతో ఈరోజు అర్దరాత్రికి ముంబైకి చేరుకోనుండగా.. మరో విమానం రేపు ఉదయం ఢిల్లీకి చేరుకోనుందని సమాచారం.
ఇప్పటికే పలువురు భారత విద్యార్థులు రోడ్డు మార్గంలో ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న సంగతి తెలిసిందే. వారిని అక్కడి నుంచి బుకారెస్ట్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించనున్నారు. అయితే రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ నుంచి బుకారెస్ట్ దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.. రోడ్డు మార్గంలో ఈ దూరాన్ని చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది. మరోవైపు కైవ్ నుంచి హంగేరియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది.. దానిని రోడ్డు మార్గంలో కవర్ చేయడానికి 12-13 గంటలు పడుతుంది.
సూచనలు లేనిదే సరిహద్దులకు వెళ్లొద్దని కేంద్రం ప్రకటన..
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను తీసుకురావడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని భారత పౌరులకు సంబంధించి కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని భారతీయులు ఎలాంటి సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులందరూ సరిహద్దు పోస్టుల వద్ద భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. వారికి సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయబడ్డాయనీ, దీని కోసం అధికారులను సంప్రదించాలని పేర్కొంది. భారత రాయబార కార్యాలయం, కైవ్ ఎమర్జెన్సీ నంబర్లును పేర్కొంటూ భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లో తాజా ప్రకటనలో పేర్కొంది.