సొంత పార్టీ నుంచే తిరుగుబాటు.. పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం

Published : Mar 19, 2022, 12:59 PM IST
సొంత పార్టీ నుంచే తిరుగుబాటు.. పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం

సారాంశం

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీగండం ఎదురైంది. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం అదుపుదాటి పోవడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వమే కారణం అని విపక్షాలు ఆరోపిస్తూ.. ఇమ్రాన్ ఖాన్‌పై నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ నెల 28న దీనిపై ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాల తీర్మానానికి అధికారపార్టీకి చెందిన సుమారు 24 మంది చట్టసభ్యులూ ఓటేస్తామని చెప్పడం ఇమ్రాన్ ఖాన్ పార్టీలో కలకలం రేపింది.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సొంత పార్టీ నుంచే తీవ్ర అసంతృప్తి ఎదురవుతున్నది. ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ నుంచే రెబల్స్‌ను ఎదుర్కోవలసి వస్తున్నది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ పార్లమెంటులో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానం అధికార పార్టీ నేతల్లో కలవరం కలిగిస్తున్నది. ఇమ్రాన్ ఖాన్‌కు అసలైన షాక్ సొంతపార్టీ నుంచే ఎదురవుతున్నది. సొంత పార్టీ పీటీఐకి చెందిన 24 చట్టసభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తామని తేల్చడం గమనార్హం.

దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ ప్రభుత్వమే కారణం అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలతోనే ఈ నెల 8వ తేదీన నేషనల్ అసెంబ్లీ సెక్రెటేరియట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు సమర్పించాయి. పీఎంఎల్-ఎన్, పీపీపీలకు చెందిన సుమారు 100 మంది చట్టసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నెల 21న నేషనల్ అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించనున్నారు. కాగా, 28వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నది.

సంయుక్త విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ, సొంత పార్టీకి చెందిన 24 చట్టసభ్యులూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చడంలో పాలుపంచుకుంటామని గురువారం చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ షాక్‌కు గురయ్యారు. 

ఇమ్రాన్ ఖాన్ పార్టీ చట్టసభ్యుడు రజా రియాజ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. కాగా, తాను చేసిన ఎన్నో విజ్ఞప్తులను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మరో చట్టసభ్యుడు నూర్ ఆలం ఖాన్ వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న సుమారు రెండు డజన్ల అధికార పార్టీ చట్టసభ్యుల్లో తాను భాగంగా ఉన్నారని రియాజ్ చెప్పారు.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ చట్ట సభ్యులు ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారంలోని సింధ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ నియంత్రణలోని సింధ్ హౌజ్‌లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వారిని కిడ్నాప్ చేస్తారనే భయంతో ఇక్కడ సింధ్ హౌజ్‌లో మకాం వేశారని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి సయీద్ ఘనీ తెలిపారు. కాగా, సింధ్ ప్రభుత్వం తమ చట్టసభ్యులను నిర్బంధించిందని పీటీఐ ఆరోపిస్తున్నది.

కానీ, సింధ్ హౌజ్‌లోని అధికార పార్టీ నేతలు అక్కడ తమ మనస్ఫూర్తిగానే, తమ ఇష్టం మేరకే ఉంటున్నట్టు చెబుతున్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి చేయకుంటే.. తమ అంతరాత్మ చెప్పినట్టుగా నడుచుకుని ఓట్లు వేస్తామని వివరించారు.

ఇదిలా ఉండగా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీ నేతలతో గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ సింధ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ అసెంబ్లీ సభ్యులను సంధ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, కాబట్టి, వెంటనే సింధ్‌లో గవర్నర్ రూల్‌ను విధించాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SuperShe Island : పురుషులకు బ్యాన్.. ఆ ఐలాండ్ రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Eiffel Tower : ఈఫిల్ టవర్ లోపల ఎలా ఉంటుందో తెలుసా? టాప్ ఫ్లోర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!