
జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేల్ మీద అది 6.2గా నమోదైంది. శుక్రవారం సంభవించిన ఈ భూకంపంలో ఏడుగురు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.
భూకంపంతో భయకంపితులైన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. మజెనే నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దీని భూకంప కేంద్రం నమోదైంది. పది కిలోమీటర్ల లోతులో ఇది చోటు చేసుకుంది.
ఇండోనేషియా అదికార వర్గాల సమాచారం ప్రకారం - మజెనే నగరంలో నలుగురు మరణించగా, 637 మంది గాయపడ్డారు. పొరుగున ఉన్న మముజులో ముగ్గురు మరణించారు, రెండు డజన్ల మంది దాకా గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భూకంపం సంభవించింది. వేలాది మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. దాదాపు ఏడు సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే, సునామీ సూచనలేవీ లేవు.
మోటారు సైకిళ్లపై చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు, చెత్తకుప్పల కింద చిక్కుకుపోయిన పిల్లలను వెలికి తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోల్లో కనిపిస్తున్నాయి.