బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్నిప్రమాదం: 52 మంది మృతి

By narsimha lodeFirst Published Jul 9, 2021, 4:05 PM IST
Highlights

బంగ్లాదేశ్ లో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకొంది. ఓ ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో 52 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 

ఢాకా:బంగ్లాదేశ్ లో ని ఓఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 52 మంది మృతి చెందారు. ఈ ఫ్యాక్టరీలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.  ఈ ప్రమాదంలో సుమారు 30 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే  ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల కుటుంబసభ్యలు, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని  ఆతృతగా ఎదురు చూశారు.

పారిశ్రామిక వాడలు, బహుళ అంతస్తుల్లో  వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.2013లో రాణా ప్లాజా విపత్తు చోటు చేసుకొంది. ఈ  సమయంలో 9 అంతస్తుల భవనం  కూలి 1100 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ప్రమాదాలు చోటు చేసుకోకుండా అనేక సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చింది.

2019 ఫిబ్రవరిలో చట్టవిరుద్దంగా కెమికల్స్ ను నిల్వ ఉంచడం వల్ల  జరిగిన ప్రమాదంలో 70 మంది మరణించారు.గురువారం నాడు మధ్యాహ్నం పారిశ్రామిక పట్టణమైన రుప్‌గంజ్ ‌లోని హాషేమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. 24 గంటల తర్వాత కూడ మంటలు వ్యాపించి ఉన్నాయి.సాధారణంగా మధ్యాహ్నం సమయంలో ఈ ఫ్యాక్టరీలో 1000 మందికిపైగా కార్మికులు పనిచేస్తారు. అయితే అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన కార్మికులు ఫ్యాక్టరీ బయటకు పరిగెత్తారు. 

అగ్నిమాపక సిబ్బంది మూడో అంతస్తులో 49 ఇవాళ మృతదేహాలను  కనుగొన్నారు. గురువారం నాడు రాత్రి మరో మూడు మృతదేహాలను గుర్తించారు. అగ్నిప్రమాదంతో మంటలు అన్నిబ్లాక్ లకు త్వరగా వ్యాప్తి చెందాయని ఫైర్ సేప్టీ అధికారులు చెప్పారు. పై అంతస్తుకు వెళ్లే మార్గంతో పాటు కిందకు వెళ్లే మార్గంలో కూడ మంటలు వ్యాప్తి చెందాయని ఫైర్ సేఫ్టీ అధికారి దేబాషిష్ బర్దన్ చెప్పారు.

కాలిన మృతదేహాలను ఫ్యాక్టరీ నుండి అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో  స్థానికులు కన్నీళ్లు పెట్టుకొన్నారు.  అగ్ని ప్రమాదం విషయం తెలుసుకొన్న స్థానికులు రోడ్లపై నిరసనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసులతో స్థానికులు గొడవకు దిగారు.ఆరు అంతస్థుల భవనంలో మంటలు వ్యాప్తి చెందడంతో ప్రాణాలు దక్కించుకోవడం కోసం కొందరు భవనం పై అంతస్తు నుండి కిందకు దూకడంతో గాయపడ్డారని  పోలీసు అధికారి షేక్ కబీరుల్ ఇస్లాం చెప్పారు.

ఐదు, ఆరో అంతస్తులో మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు ప్రయత్నిస్తున్నారు. నూడుల్స్, పండ్ల రసాలు మిఠాయిలు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ పై కప్పు నుండి తాడులను ఉపయోగించి 25 మందిని రక్షించారు.మూడో అంతస్తులో రెండు మెట్ల మీద గేట్లు మూసివేసి ఉన్నాయి. ఇక్కడ 48 మంది ఉన్నారని సహచర కార్మికులు చెబుతున్నారు. వారి పరిస్థితి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో తనతో పాటు మరో 13 మంది కార్మికులం పైకప్పు వైపు పరిగెత్తామని మమున్ అనే కార్మికుడు చెప్పారు.

click me!