ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో రూ.15 లక్షలు టోకరా : హైదరాబాదీకి వల వేసిన చైనా, హాంకాంగ్ నేరగాళ్లు

By Siva KodatiFirst Published Jul 16, 2020, 7:41 PM IST
Highlights

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరంలో ఈ తరహా నేరాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరంలో ఈ తరహా నేరాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

ట్రేడింగ్‌లో పెట్టుబడులు అంటూ వ్యాపారవేత్త దగ్గరి నుంచి ఓ ముఠా భారీగా నగదును కొట్టేసింది. ఈ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

చైనాకు చెందిన మైక్, హాంకాంగ్‌కు చెందిన మీనా పరారీలు ఉన్నారు. ఈ ముఠా టిండర్ అనే అప్లికేషన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీ చాట్ ద్వారా పరిచయాలు పెంచుకుంటున్న ముఠా సభ్యులు.. తక్కువ పెట్టుబడితో ఫారెక్స్ ట్రేడింగ్‌లో భారీగా డబ్బు సంపాదించవచ్చని వల విసురుతోంది.

ఇలాంటి మాయ మాటల ద్వారానే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.15 లక్షలకు పైగా టోకరా వేసింది. ఈ ముఠాకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన రాజేశ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాంకాంగ్‌కు చెందిన మైనాతో హైదరాబాద్ వాసి ఉమాకాంత్‌కు వీ ఛాట్‌లో పరిచయమైంది.

ఆమె ఫారెక్స్ ట్రేడ్‌లో పెట్టుబడులు పెడితే భారీగా సంపాదించవచ్చని చెప్పడంతో ఉమాకాంత్ సరేనన్నాడు. చాటింగ్‌లో మరో నిందితుడు మైక్‌ను సంప్రదించగా.. ట్రేడ్‌ ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

అతను చెప్పినట్లుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొటక్ మహేంద్ర బ్యాంక్‌లోని ఇర్ఫాన్ అనే వ్యక్తికి సంబంధించిన ఖాతాలో ఉమాకాంత్ రూ.2.30 వేల నగదును డిపాజిట్ చేశాడు. దీనికి అనుగుణంగానే మైక్ లాభాలు చూపించాడు.

దీంతో ఇర్ఫాన్ ఖాతాలో ఉమాకాంత్ మరో రూ.15 లక్షలకు పైగా నగదు డిపాజిట్ చేశాడు. అయితే నిందితులు విడతల వారీగా డబ్బును డ్రా చేసి ముఖం చాటేశారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఉమాకాంత్ గత నెల 30న సైబరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన రాజేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో పలువురిని మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. 

click me!