మహిళలను టార్గెట్ చేసిన పోలీసు కానిస్టేబుల్: లిఫ్ట్ అడిగి మరీ...

By telugu teamFirst Published Jul 13, 2020, 6:33 AM IST
Highlights

మహిళలను లిఫ్ట్ అడిగి వారి వాహనాల్లో ప్రయాణించి వారి ఫోన్లు నెంబర్లు తీసుకుని వేధిస్తున్న కానిస్టేబుల్ ను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంఘటనపై సీపీ అంజనీకుమార్ స్పందించారు.

హైదరాబాద్: మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్ ను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. హైదరాబాదుకు చెందిన ఓ మహిళ తన కారులో రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆమె శ్రీనగర్ కాలనీ మీదుగా వస్తుండగా వీరబాబు అనే కానిస్టేబుల్ లిఫ్ట్ అడిగాడు. 

తాను కానిస్టేబుల్ ను అని, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దించాలని చెప్పాడు. లిఫ్టు ఇచ్చిన మహిళ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఏదైనా ఇబ్బంది తనకు ఫోన్ చేయాలని చెప్పాడు. సీఎం క్యాంపు కార్యాలయం రెండో గేటు వద్ద కారు దిగిపోయాడు. 

మహిళ ఇంటికి వచ్చిన తర్వాత అతను ఆమెకు పదే పదే ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఆమె పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత ఫొటో పంపించాలని వాట్సప్ మెసేజ్ పెట్టాడు. ఆమె వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేసింది. అయినా అతను పదే పదే ఫోన్ చేస్తుండడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాంతో పోలీసులు వీరబాబుపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. వీరబాబు రాష్ట్ర ప్రత్యేక పోలీసు 12వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ గా విచారణలో తేలింది. ఈ నెల 9వ తేదీిన ఓ వైద్యురాలిని సైతం అలాగే వేధించినట్లు తేలింది. వైద్యురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ చర్యతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఎవరూ చట్టానికి అతీతులు కారని, అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించామని ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పారు. 

click me!