కవితకు ఊరట: అరవింద్ కు పసుపు రైతుల సెగ

First Published | Jul 19, 2019, 11:41 AM IST

నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ కు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని  రైతులు ఈ నెల 24వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చారు.

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంతో పాటు అరవింద్ ఇంటి ముందు కూడ ధర్నాకు దిగాలని పసుపు రైతుల అసోసియేషన్ పిలుపుఇచ్చింది.తమ డిమాండ్లను పరిష్కరించడంలో అరవింద్ వైఫల్యం చెందారని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో బీజేపీని బహిష్కరిస్తామని పసుపు రైతులు తేల్చి చెప్పారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర తమ సమస్యలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లలేదని పసుపు రైతుల అసోసియేషన్ నేత తిరుపతి రెడ్డి చెప్పారు. కనీసం తమ సమస్యలను అరవింద్ పార్లమెంట్‌లో కూడ ప్రస్తావించలేదన్నారు.
నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, బాల్కొండ మున్పిపాలిటీల్లో బీజేపీని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పసుపుకు క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ. 3500ల నుండి రూ. 15వేలకు పెంచాలని కోరుతున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సుమారు 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అరవింద్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతులకు అరవింద్ బాండ్ పేపర్ రాసి హామీని ఇచ్చాడు. పసుపు రైతుల సమస్యలను నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పార్లమెంట్ లో ప్రస్తావించిన విషయాన్ని కొందరు పసుపు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు ప్రధానమంత్రి మోడీని కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని కూడ ఆమె కోరిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పసుపు పండించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఆ మేరకు ఆదాయం రావడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారు.
నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్‌ ఉంది. ఎన్నికల సమయంలో ఈ డిమాండ్‌ పార్టీలకు ఓట్లను కురిపించే అస్త్రంగా మారింది.
దీంతో ఈ దఫా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి కూడ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ పసుపు రైతులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ఎంపీ ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Latest Videos

click me!