
Heavy Rains Alert : వర్షాకాలం మొదలై దాదాపు రెండునెలల కావస్తోంది.. అయినా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో తగిన వర్షాలు లేవు. సాధారణంగా అయితే జూలైలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తూ వరద పరిస్థితులు ఉండాలి... నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాలి. కానీ వర్షాభావంతో ఈసారి ఆ పరిస్థితి లేదు... రైతులు వర్షాలకోసం ఆకాశంవైపు ధీనంగా చూసే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఇటీవలే వర్షాలు జోరందుకోవడం ఊరటనిస్తోంది... రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ నిపుణుల ప్రకటన తెలుగు ప్రజల్లో ముఖాల్లో ఆనందాన్ని నింపుతోంది.
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం... రాబోయే నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి... వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారడం తోడయ్యింది. వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జూన్ 28 నుండి 30 వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. అలాగే తూర్పు, పశ్చిమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయట... ఏకంగా 100 నుండి 120 మి.మీ వర్షం కురుస్తుందట. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
రెడ్ అలర్ట్ జిల్లాలు (భారీ నుండి అతిభారీ వర్షాలు)
ఆదిలాబాద్, కోమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్.
మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెధర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ లో కూడా ఈ నాలుగు రోజులు మంచి వర్షపాతమే ఉంటుందట. కేవలం యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ వర్షాలు తెలంగాణ వ్యవసాయానికి ఊతం ఇస్తాయని... రైతులకు పంట భరోసాను కల్పిస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
DEPRESSION IMPACT ON TELANGANA
HEAVY RAIN ALERT - JULY 27-30, 2026 ⚠️🌧️
Due to SECONDARY CONVERGENCE associated with DEPRESSION in Central India, HEAVY RAINS ahead in various parts of North, West, East TG districts (RED MARKED areas) where cumulative rainfall next 4days can… pic.twitter.com/PRPtFZlTbZ— Telangana Weatherman (@balaji25_t) July 27, 2026
ఈ నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ కూడా చెబుతోంది. రేపు (జూలై 28, మంగళవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని... రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 27, 2026
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా... తూర్పు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడటంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకున్నాయి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీ పై స్పష్టంగా ఉంటుందట విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా రేపు (జూలై 28, మంగళవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని విపత్తు సంస్థ సూచించింది. తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. ముఖ్యంగా 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవల వినియోగం సురక్షితం కాదని సూచించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది.