
Hyderabad : కాలం మారిపోయింది... ఒకప్పుడు ఆదర్శ భావాలుండేవారికి సమాజంలో గౌరవం దక్కేది... కానీ ఇప్పుడు కాసులుండేవారికే మర్యాద దక్కుతోంది. దీంతో ఒకప్పుడు రూపాయి ఆశించనకుండా ప్రజలకోసం పనిచేసిన నాయకులకు అవమానాలు తప్పడంలేదు. గతంలో ప్రజా యుద్దనౌక గద్దర్ ను ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా అవమానించారో అందరికీ తెలిసిందే. అప్పుడు గద్దర్ కు జరిగిన అవమానాన్ని తప్పుబట్టిన ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కాక కేసీఆర్ లాగే వ్యవహరిస్తున్నారు. ఆనాడు గద్దర్ కు జరిగిన అవమానమే ఇప్పుడు గుమ్మడి నర్సయ్యకు జరిగింది.
గుమ్మడి నర్సయ్యకు అవమానం...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆనాటి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరపున పోటీచేసి వరుస విజయాలు సాధించాడు. ఇలా 1983-1994 మధ్య ఇల్లందు ఎమ్మెల్యేగా చేసారు. మధ్యలో ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 1999 నుండి 2009 వరకు ఎమ్మెల్యేగా చేసారు. ఇలా ఐదుసార్లు విజయం సాధించి రెండు దశబ్దాలకు పైగా ఓ నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారు.
ఇలా సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన ఇప్పటి ఎమ్మెల్యేల్లా వందలు, వేలకోట్లు సంపాదించలేదు. కమ్యూనిస్ట్ భావాలను వదులుకోకుండా ప్రతినిత్యం ప్రజలకోసమే పనిచేసారు... ప్రభుత్వ సొమ్మును నియోజకవర్గ అభివృద్ది, ప్రజా సంక్షేమానికి మాత్రమే ఖర్చుచేసారు. చివరకు హైదరాబాద్ లో సొంతిళ్లు కూడా సంపాదించుకోలేదు... అసెంబ్లీ సమావేశాలకు వచ్చినపుడు కూడా పార్టీ కార్యాలయంలోనే బస చేసేవారు.
ఇలా 2009 లో ఓటమిపాలై రాజకీయాల దూరమయ్యేనాటికి ఆయనవద్ద చిన్న ఇళ్లు, కొంత భూమి మాత్రమే ఉంది. ఇరవై ఏళ్లకుపైగా ఎమ్మెల్యేగా చేసిన ఆయనకు కనీసం సొంతకారు కూడా లేదు... ఇప్పుడు కూడా ఆయన సైకిల్ పై తిరుగుతుంటారు. ఇలా నేటి ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచే ప్రజామనిషి గుమ్మడి నర్సయ్యకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇప్పటికే అనేకసార్లు ప్రయత్నించారు నర్సయ్య... కానీ ఆయనకు అపాయింట్ మెంట్ మాత్రం లభించడంలేదు. తనకు పరిచయం ఉన్న నాయకులు, అధికారుల సహాయంతో సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇలా సెక్రటేరియట్ తో పాటు సీఎం నివాసం వద్ద ఎదురుచూసినా ఆయనకు రేవంత్ దర్శనభాగ్యం మాత్రం దక్కడంలేదు.
అయితే ఆయన ఏదో సొంత పనులపై సీఎంను కలవాలని అనుకోవడం లేదట... ప్రజా సమస్యలపైనే కలిసేందుకు తిరుగుతున్నారట. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని, రైతు భరోసా సాయం వారికి అందేలా చూడాలని విన్నవించుకునేందుకు సీఎంను కలవాలని మాజీ ఎమ్మెల్యే నర్సయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిన్న(గురవారం) గుమ్మడి నర్సయ్య సీఎం రవంత్ ఇంటివద్ద ఎండలో ఎదురుచూస్తున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కాన్వాయ్ వెళుతుంటే అక్కడే రోడ్డుపక్కన ఆయన దీనంగా నిలబడ్డారు... అయితే సీఎం ఆయనను చూసారో లేదో తెలీదుగానీ నర్సయ్యకు మాత్రం అనుమతి లభించలేదు. ఇలా ఈ వయసులో ఆయన మండుటెండలో నిలబడటం అందరినీ కదిలిస్తోంది... పెద్దమనిషిని ఇలా అవమానిస్తారా అంటూ బిఆర్ఎస్, బిజెపి నాయకులు మండిపడుతున్నారు.
రేవంత్ తీరుపై బిఆర్ఎస్ ఆగ్రహం :
మాజీఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారంటూ ప్రతిపక్ష బిఆర్ఎస్ తెగ ప్రచారం చేస్తోంది. భారతీయ రాష్ట్ర సమితి నాయకులు రేవంత్ ఇంటిబయట నర్సయ్య ఎదురుచూస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో గద్దర్ ను ప్రగతిభవన్ బయట నిలబెట్టి అవమానించారంటూ మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని గుర్తుచేస్తున్నారు.
''సీఎం రేవంత్, దుష్ప్రచారం చేస్తే ఒకరోజు అది మీకే తిప్పి కొడుతుంది...ముందస్తు సమాచారం లేకుండా కనీసం అపాయింట్మెంట్ లేకుండా గద్దర్ గత ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయం ఎదుట నిలబడిన చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంతో వాడుకుంది. ఈ చిత్రం నేడు మీ నివాసం వద్ద కొన్ని గంటలు వేచి చూసి అవమానంతో వెనుతిరిగిన 5 సార్లు గెలిచిన రికార్డ్ గిరిజన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారిది...బిఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ పార్టీ లాగా ఈ చిత్రాన్ని రాజకీయం లబ్ధి కోసం ఉపయోగించే వారిని కాదు మా ప్రార్థన వీలైనంత త్వరగా నరసయ్య గారికి సమయమిచ్చి కలవాల్సిందిగా మనవి'' అంటూ బిఆర్ఎస్ నేత క్రిషాంక్ సోషల్ మీడియా వేదిక కోరారు.
అయితే కాంగ్రెస్ నాయకులు గుమ్మడి నర్సయ్యకు ఎలాంటి అవమానం జరగలేదని అంటున్నారు. ఆయన వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వచ్చారని... ఈ క్రమంలో తీసిన ఫోటోను పట్టుకుని కాావాలనే బిఆర్ఎస్ నాయకులు దుష్ఫ్రచారం చేస్తున్నారని అంటున్నారు. మందకృష్ణ మాదిగ లాంటి నాయకులను స్వయంగా ముఖ్యమంత్రే పిలిపించుకుని మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. నిజంగానే మాజీ ఎమ్మెల్యే నర్సయ్యకు ఏదయినా సమస్య ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరాలని... తప్పకుండా లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.