బీజేపీలోకి కోమటిరెడ్డి: కాంగ్రెస్ నిర్ణయం తర్వాతే స్టెప్

First Published 16, Jun 2019, 12:46 PM

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చిచ్చుపెట్టాయి. పీసీసీ చీఫ్ పదవి దక్కదని తెలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీ చేరాలని  భావిస్తున్నాడని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకొంది. రేపు క్రమశిక్షణ సంఘం సమావేశం కానుంది.
నాలుగైదు రోజుల క్రితం బీజేపీ నేత రామ్ మాధవ్‌‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బలోపేతం కావడానికి బీజేపీ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. ఈ ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో జోష్‌ను నింపింది.
ఇదే తరుణంలోనే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపుకు ఆకర్షించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. బీజేపీ జాతీయ నేత రాం మాధవ్‌ కొందరు నేతలతో చర్చించినట్టుగా సమాచారం.
తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఆయా పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడ కోరారు. అయితే కొత్త పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు ఆశిస్తున్నారని సమాచారం.
పీసీసీ చీఫ్ పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించారు. కానీ పీసీసీ చీఫ్ పదవి తనకు దక్కదని బావించి బీజేపీ వైపుకు వెళ్లాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం‌ ఏ రకంగా స్పందిస్తోందోననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు.
అయితే పార్టీని వీడాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు.ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటున్న విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆయన వివరణ ఇచ్చారు.
ఆ తర్వాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. మునుగోడు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు నల్గొండ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నుండి ఎంపీగా విజయం సాధించారు.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ వల వేసిందని ప్రచారం సాగుతోంది. తమ ప్లాన్ సక్సెస్ అయిందని బీజేపీ వర్గాలు నమ్ముతున్నాయి.
ఇటీవల జరిగిన నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్ష్మి ఓటమి పాలైంది. గతంలో ఇదే స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. తన భార్య ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు కారణమని కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందనే ప్రచారం సాగుతోంది.పార్టీ నుండి బహిష్కరణకు గురి కావాలనే ఉద్దేశ్యంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహత్మకంగా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేశారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైతే అసెంబ్లీలో బీజేపీ అనుబంధ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.