
2026 అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత యంగ్ ప్లేయర్లు అద్భుతం చేశారు. ఒమన్ లో శనివారం జరిగిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా చివరి బంతికి సంచలన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్సీలోని భారత జట్టుకు ఇక ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 18 ఏళ్ల పేస్ ఆల్‌రౌండర్ మోహిత్ ఉల్వా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచే మోహిత్ ఉల్వా ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న మనల్ చౌహాన్‌తో కలిసి 9వ వికెట్‌కు కీలకమైన 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 48వ ఓవర్‌లో మనల్ చౌహాన్ 47 పరుగుల వద్ద అవుట్ అయినా మోహిత్ ఒత్తిడికి గురికాలేదు.
చివరి ఓవర్‌లో విజయానికి 3 పరుగులు కావాల్సిన స్థితిలో ఆఖరి బంతి వరకు క్రీజులోనే నిలబడ్డాడు. విపరీతమైన ఒత్తిడి మధ్య చివరి బంతిని వైడ్ లాంగ్-ఆఫ్ దిశగా బౌండరీకి తరలించి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. మోహిత్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత ఆటగాళ్లంతా మైదానంలోకి పరుగెత్తుకొచ్చి సంబరాలు చేసుకున్నారు.
సౌరాష్ట్రకు చెందిన మోహిత్ ఉల్వా రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో ధాటిగా ఆడే బ్యాటర్. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన మోహిత్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్‌లో ఆఫ్ స్పిన్నర్‌గా తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తన తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా రాజ్‌కోట్‌కు మారాడు.
అక్కడ జామ్‌నగర్‌లోని క్రికెట్ బంగ్లాలో కోచ్ మహేంద్రసింగ్ చౌహాన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చిన్ననాటి కోచ్ కూడా మహేంద్రసింగ్ చౌహానే కావడం విశేషం. ఆయనే మోహిత్‌ను ఫాస్ట్ బౌలర్‌గా మార్చారు.
ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత మోహిత్ ఉల్వా స్పందించాడు. "నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది, దేవుడిపై భారం వేశాను. నేను ఈ మ్యాచ్‌ను గెలిపించగలనని నాకు తెలుసు. ఈ ఆసియా కప్‌లో బౌలర్‌గా నాకు అంతగా కలిసిరాలేదు, ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు. కానీ అవకాశం వస్తే సత్తా చాటగలనని నమ్మాను" అని చెప్పాడు. అలాగే మనల్ చౌహాన్ అందించిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని, అతను వేసిన పునాదిపై తాను మ్యాచ్‌ను ఫినిష్ చేశానని మోహిత్ తెలిపాడు.
అండర్-19 జట్టుకు ఎంపిక కాకముందు మోహిత్ సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో అన్మోల్ కింగ్స్ హలార్ తరఫున జయదేవ్ ఉనద్కత్‌తో కలిసి ఆడాడు. అంతకుముందు రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో 37 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా 84 బంతుల్లో 92 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక శనివారం జరిగిన ఫైనల్ విషయానికొస్తే, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (107), ఫర్హాన్ యూసుఫ్ (63) రాణించడంతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ తరఫున ఆర్యవీర్ సెహ్వాగ్ (58), కెప్టెన్ లక్ష్య (80) మంచి ఆరంభాన్ని ఇచ్చినా మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. చివర్లో మోహిత్ ఉల్వా అసాధారణ పోరాటంతో భారత్ ట్రోఫీని ముద్దాడింది.