Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒకరోజు ముందు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐసీసీ నిబంధనల నుంచి విముక్తి లభించింది. 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు అతను టీమ్ ఇండియా ఎంపికకు అర్హత సాధించాడు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మార్చి 27, 2026 ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది. ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ప్రారంభానికి సరిగ్గా ఒకరోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు కేవలం వేడుక మాత్రమే కాదు, అతని కెరీర్‌లో ఒక పెద్ద మలుపును తీసుకొచ్చింది. 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, వైభవ్ ఇప్పుడు భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యేందుకు అధికారికంగా అర్హత సాధించారు. ఇన్నాళ్లూ అతని ఎంపికకు అడ్డుగా ఉన్న ఐసీసీ వయోపరిమితి నిబంధన ఇప్పుడు తొలిగిపోయింది.
25
వైభవ్ కు అడ్డంకిగా మారిన ఐసీసీ నిబంధన ఏమిటి?
వైభవ్ సూర్యవంశీ గత ఏడాది ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, టీమిండియా సెలెక్టర్లు అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఐసీసీ (ICC) 2020 నవంబర్‌లో ప్రవేశపెట్టిన ఒక నిబంధన. అంతర్జాతీయ క్రికెట్ (పురుషులు, మహిళలు లేదా అండర్-19) ఆడే ఏ ఆటగాడైనా కనీసం 15 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది.
ఆటగాళ్ల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు వైభవ్ వయస్సు 14 ఏళ్లే కావడంతో, అతని ఆట ఎంత అద్భుతంగా ఉన్నా భారత జట్టు తలుపులు తట్టలేకపోయారు. కానీ నేడు 15వ పడిలోకి అడుగుపెట్టడంతో ఆ అడ్డంకి తొలగిపోయింది.
35
ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
బీహార్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించారు. కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్, తన మొదటి మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటుకున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ లోకాన్ని విస్మయానికి గురిచేశారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా రికార్డు సాధించాడు.
వైభవ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌లు ఆడి 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత కూడా తన జోరును కొనసాగించారు. భారత అండర్-19 జట్టు తరపున ఆడుతూ పరుగుల వరద పారించారు. ఇప్పటివరకు వైభవ్ కెరీర్ గణాంకాలను పరిశీలిస్తే..
• టీ20 క్రికెట్: 18 మ్యాచ్‌ల్లో 701 పరుగులు (3 సెంచరీలు).
• లిస్ట్ ఏ (వన్డే): 8 మ్యాచ్‌ల్లో 353 పరుగులు (1 సెంచరీ).
• ఫస్ట్ క్లాస్: 8 మ్యాచ్‌ల్లో 207 పరుగులు.
ఏ ఫార్మాట్‌లో ఆడినా భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల పని పట్టడం వైభవ్ శైలి.
55
క్రికెట్ యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ
మార్చి 28 నుండి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో కూడా వైభవ్ తన బ్యాట్‌తో గర్జించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వయోపరిమితి అడ్డంకి తొలగిపోవడంతో, ఈ ఐపీఎల్‌లో అతను రాణిస్తే నేరుగా టీమ్ ఇండియా బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఉంది. సెలెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా వైభవ్ భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. భారత క్రికెట్‌లో మరో సంచలన యుగం మొదలైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.