Janmashtami
krishna janmashtami 2023 : కృష్ణ జన్మాష్టమి పండుగ సమీపిస్తోంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదో రోజు శ్రీకృష్ణుని జయంతిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7 న జరుపుకోబోతున్నాం. ఈ రోజు శ్రీకృష్ణుడిని నిష్టగా పూజిస్తారు. కంసుడి దురాగతాలకు అంతం పలకడానికి జన్మాష్టమి రోజున విష్ణువు కృష్ణుడి రూపంలో ఎనిమిదో అవతారం ఎత్తాడని నమ్ముతారు. శ్రీ కృష్ణుడు తన జీవితంలోని అన్ని సంబంధాలను చాలా నిజాయితీగా నిర్వర్తించాడు. శ్రీకృష్ణుడి జీవితంలోని ఇలాంటి విశేషాలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. అవి మనల్ని జీవితాంతం సంతోషంగా ఉంచుతాయి.
Janmashtami 2023
పోరాటమే జీవితం
మొదటి నుంచి శ్రీకృష్ణుడి జీవితం పోరాటాలతోనే నిండిపోయింది. మేనమామ అయిన కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ఎన్నో కుట్రలు పన్నుతారు. కానీ కృష్ణుడు ఈ అడ్డంకుల నుంచి ఎప్పుడూ తప్పుకోలేదు. ఈ పోరాటాలను ఎంతో సహనంతో ఎదుర్కొన్నారు. అలాగే ప్రతి వ్యక్తి ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూనే ఉండాలి. చేసే పనుల గురించి చింతించకుండా తన కర్తవ్యాన్ని కొనసాగించాలి. చివరికి గెలుపు నీదే అవుతుంది.
నిజమైన స్నేహం
కృష్ణుడు, సుధామ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ భగవానుడు స్నేహానికి అవధులు పెట్టేవాడు కాదు. ఉన్నత, దిగువ, ధనిక, పేద, చిన్న, పెద్ద పరిమితులకు కన్నయ్య దూరంగా ఉంటాడు. వారి స్నేహాన్ని చూసి.. ప్రతి వ్యక్తి వారి సంబంధానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.
నిజమైన ప్రేమ
బృందావనంలో రాధతో పాటు శ్రీకృష్ణుడిని అమితంగా ప్రేమించే గోపికలు చాలా మందే ఉన్నారు. కానీ కృష్ణుడు మాత్రం ఆ గోపికలందరినీ ఎంతో గౌరవించేవాడు. కాని రాధపై అతని ప్రేమ అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. శ్రీకృష్ణుని ప్రేమ, స్నేహితురాళ్ల పట్ల ఉన్న గౌరవం నుంచి నేటి ప్రేమికులు ఎంతో నేర్చుకోవాలి.
తల్లిదండ్రులు
శ్రీకృష్ణుడు దేవకి, వసుదేవుని కుమారుడు. కాని ఈయనను పెంచింది మాత్రం యశోద, నందుడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు తన జీవితంలో తన తల్లి దేవకి, యశోద ఇద్దరికీ సమాన స్థానం ఇచ్చాడు. వారిద్దరి పట్ల తన కర్తవ్యాన్ని ఎంతో చక్కగా నిర్వర్తించాడు. తల్లిదండ్రుల స్థానం మన జీవితంలో అత్యున్నతంగా ఉండాలని కృష్ణుడు ఈ ప్రకృతి ద్వారా ప్రపంచానికి బోధించాడు.