(Review By--- సూర్య ప్రకాష్ జోశ్యుల) రజనీకాంత్ తో ఇంక కొత్తగా చేసేదేముంటుంది...దాదాపు అన్ని రకాల కథలూ,గెటప్ లు ఆయన చేసేసాడు. ఏది చేసినా పాత అనిపిస్తుంది. మరీ కొత్తగా వెళ్తే రజనీ సినిమాలాగ లేదంటారు. అలాగని ఆయన రెగ్యులర్ మేనరింజంలు, స్టైల్స్ తో చేస్తే మరీ పాతగా ఉందంటారు. రజనీతో చేసే ఈ తరం దర్శకులకు అదే పెద్ద టాస్క్. అప్పటి ఫ్యాన్స్ ని అలరించాలి..ఈ జనరేషన్ వాళ్లను ఆకట్టుకోవాలి. పేట అంటూ ఓ పూట అడితే ఫలితం లేదు. ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా మురుగదాస్ ముందు నిలబడే ఉంటాయి. వాటికి సమాధానం ఇస్తూ కొత్తగా ఏం చెప్పటానికి ప్రయత్నించాడు. ఎలాంటి కథ అల్లుకున్నాడు. రజనీని ఒప్పించి ఆయన అభిమానులను ఒప్పించేందేకు తీసుకున్న పాయింట్ ఏమిటి, రజనీ మార్క్ సంక్రాంతి ముందే వచ్చేసిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మనస్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.
ఈ క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ గా ఆదిత్యను మీడియా ముద్ర వేస్తుంది. మానవ హక్కుల సంఘం సమన్లు పంపించినా.. సమస్యే లేదు లొంగనని వాళ్లనే బెదిరించి, తనపై పాజిటివ్ రిపోర్ట్ లు సుపీరియర్స్ కు పంపించమంటాడు. ఆదిత్య ఇంతలా ముంబై ని క్లీన్ చేసే పోగ్రాం పెట్టుకోవటానికి కారణం ఏమిటి..
సుపీరియర్స్ ఆదిత్యను పిలిచి ముంబైలో చైల్డ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ బిజినెస్ ఇంకా నేరాల సంఖ్య పెరిగిపోయిందని చెప్పి, సిటీని క్లీన్ చేయమంటే దిగి, ఇలా రెచ్చిపోతున్నాడన్నమాట. ఈ క్రమంలో అతని చేతికి డ్రగ్ మాఫియా హెడ్ అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్) చిక్కుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ లార్డ్ హరి చోప్రా (సునీల్ శెట్టి) రంగంలోకి దిగుతాడు. అక్కడ నుంచీ హరి చోప్రానే ఆదిత్య నెక్ట్స్ టార్గెట్ అవుతాడు. హరికి, ఆదిత్యకు మధ్య యుద్దం మొదలవుతుంది.
ఆ క్రమంలో హరి...రెచ్చిపోయి ఆదిత్యకు పర్శనల్ లాస్ చేస్తాడు. ఆ లాస్ ఏమిటి..అసలే తిక్క,మెంటల్ పోలీస్ అయిన ఆదిత్య అప్పుడు ఏం చేసి ఆదిత్యని, అతని డ్రగ్ సామ్రాజ్యాన్ని అంతం చేసాడు? హరిచోప్రాకు, అజయ్ కు ఉన్న సంభంధం ఏమిటి....అలాగే కథలో మరో కీలకమైన పాత్ర అయిన నివేదాథామస్‌కు, ఆదిత్య అరుణాచలంకు ఉన్న రిలేషన్ ఏంటి? ఆమె ఆదిత్య అరుణాచలంకు ఏమౌతుంది? కథలో లిల్లీ (నయనతార) పాత్ర ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..? ఈ మధ్యకాలంలో రజనీతో చేసే ప్రతీ డైరక్టరూ..కొత్తదనం కంటే..పాత రజనీని చూపించటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రజనీ ఫ్యాన్స్ కు ఆ పాత మేనరిజమ్స్..స్టైల్స్ నచ్చుతాయని వారి నమ్మకం. ఆ క్రమంలో కొత్తగా ట్రై చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. 'పేట' సినిమాలో మొదలెడితే.. 'దర్బార్' లో పూర్తిగా అమలు చేసారు. అయితే పేటలో పాత రజనీతో పాటు ఆయన పాత కథనే ఒకటి తీసుకొచ్చి మన ముందు పెట్టి ఎంజాయ్ చేయమన్నారు. ఈ మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా చూడటం ఎందుకు..పాత రజనీ సినిమానే టీవిలో మరోసారి చూస్తాం అని ఫిక్సైన జనం బై చెప్పేసారు. ఈ విషయం అబ్జర్వ్ చేసి జనాలు 'గజని'లు కాదని గమనించిన మురగదాస్...రజనీని పాత రజనీలాగే ఉంచేసి...తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని అప్లై చేసి వదిలాడు.
రజనీ స్టైల్స్, మేనరిజమ్స్, డైలాగ్స్ కుప్పగా పోసుకుని కథగా మార్చి,దానికి తనదైన శైలి స్క్రీన్ ప్లే జతకూర్చి తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. అదే ప్లస్సైంది. అదే మైనస్ అయ్యింది. అలాగే తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ని చర్చించే మురగదాస్ ఈ సారి మహిళలపై వేధింపులు, హెరాస్మెంట్ ని ప్రధానంగా తీసుకున్నారు. ఎక్కడైతో నేరం జరిగిందో అక్కడే ఫనిష్ చేయాలనే పరిష్కారం ఇచ్చాడు. అదీ జనాలకు నచ్చే విషయమే. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి రొటీన్ గా, చాలా ప్రెడిక్టుబల్ గా ఉండటేమే ఇబ్బంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే తండ్రి, కూతుళ్లు హై డోస్ సెంటిమెంట్ సీన్స్ కూడా తెలుగుకు కాస్త అతి అనిపిస్తాయి.
సినిమా ఫస్టాఫ్ రజనీ స్టైల్స్,మేనరిజంలతో అదరకొడితే..సెకండాఫ్ మురగదాస్ తన స్టైల్ స్క్రీన్ ప్లే తో నడిపారు. ఇంట్రవెల్ బ్యాంగ్ ఫెరఫెక్ట్ . కానీ క్లైమాక్స్ ఫైటే ...సినిమాకు తగ్గ స్దాయిలో లేదు. అలాగే సెకండాఫ్ లో ఎక్కువ షూట్ అవుట్ లు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి.
ఎవరు ఎలా..? (టెక్నికల్...) ఈ సినిమా ఫలానా జానర్ సినిమా అని విడతీసి చెప్పలేం. ఇదో సూపర్ స్టార్ జానర్ ఫిలిం. ఎన్ని సార్లు విజిల్స్ వేయించగలిగితే అంత సక్సెస్ అయ్యినట్లు. ఈ విషయం అర్దం చేసుకున్న మరుగదాస్ అందుకు తగ్గట్లే సీన్స్ చేసుకున్నాడు. కథ కన్నా కమర్షియాలిటీకే ప్రయారిటీ ఇచ్చారు. అందుకు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాయిం తీసుకున్నాడు. కొన్ని చోట్ల నిశ్శబ్దాన్ని వాడటం కూడా నిస్సందేహంగా కలిసి వచ్చింది.
ఇక సంతోష్ శివన్ (గతంలో మణిరత్నం దళపతి టైమ్ లో రజనీతో చేసారు) కూడా తన మ్యాజిక్ ని ఈ సినిమాకు అందించారు. రజనీ ఇంట్రడక్షన్ సీన్ లో లైటింగ్, ఫ్రేమింగ్ ఒక్కటి చాలు బ్రిలియన్సీని చెప్పటానికి. మిగతా విభాగాలు అన్ని టెక్నికల్ గా సాలిడ్ గానే ఉన్నాయి. అయితే నయనతార, రజనీల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్, వెడ్డింగ్ సాంగ్ ని కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోవాల్సింది ఫైట్ సీక్వెన్స్ లు. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చే యాక్షన్ ఎపిసోడ్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
రజనీ ఈ కాలం హీరోలకు ఛాలెంజ్ విసిరేలా కొన్ని సీన్స్ లో కనిపించారు. ఇక నయనతార బాగుంది కానీ ఆమె పాత్ర చాలా చిన్నది. నివేదిత థామస్ తన పాత్రకు న్యాయంచేసింది. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ జస్ట్ ఓకే. ఈ మధ్య ప్రతీ తమిళ డబ్బింగ్ సినిమాలోనూ కనిపిస్తున్న యోగిబాబు కామెడీ బాగుంది.
ఫైనల్ థాట్ : ఇది రజనీ 'దర్బార్' బత్తి...అభిమానికి,ఆరాధ్య దైవానికి అనుసంధానమైనది.