అమరావతి: ఆదాయం పన్ను (ఐటి) దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేస్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడినట్లే. చిక్కుల్లో పడకున్నా ఆత్మరక్షణలోనైనా పడినట్లే. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో చేసిన సోదాల్లో ఓ ప్రముఖుడికి సంబంధించిన సాక్ష్యాలు దొరికినట్లు ఐటి శాఖ ప్రకటించడం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మూకుమ్మడిగా, విడివిడిగా చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
undefined
శ్రీనివాస్ ఇంట్లో దాదాపు ఐదు రోజుల పాటు సాగిన ఐటి దాడుల్లో పలు కీలకమైన పత్రాలు ఐటి శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ పై ఐటి దాడులను చంద్రబాబుకు అంటగడుతూ వైసీపీ దాడికి దిగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎంతగా ఖండించినా వైసీపీ దూకుడు ముందు అవి పనిచేయడం లేదు
undefined
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంటున్నారు. వారి మధ్య చంద్రబాబు విషయం చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైఎస్ జగన్ ఎంత దూరమైనా వెళ్తారనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
undefined
నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించడం లేదు. ఇరు పార్టీల మధ్య శత్రుపూరితమైన వైఖరే ఉంది. జగన్, చంద్రబాబు మధ్య వ్యక్తిగత శత్రుపూరిత వైరుధ్యం ఉందనేది వారి వ్యవహారాలను చూస్తేనే అర్థమవుతుంది.
undefined
వైఎస్ జగన్ మోడీతో మూడు రాజధానుల వ్యవహారాన్ని, శాసన మండలి రద్దు విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ప్రత్యేక హోదా, పోలవరం వంటి వాటితో 11 అంశాలతో ఆయన మోడీకి వినతిపత్రం సమర్పించారు. ఇవే విషయాలపై ఆయన శుక్రవారం అమిత్ షాతో చర్చిస్తారని అంటున్నారు. అయితే, ఇంతకు మించిన ఎజెండా ఏమీ లేదా అంటే మీడియా మాత్రం ఎన్డీఎలోకి వైసీపీ వెళ్తుందనే ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. పనిలో పనిగా విజయసాయి రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా లభిస్తుందని అంటోంది.
undefined
వైఎస్ జగన్ ఎన్డీఎలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తారని చెప్పడానికి తగిన ఆధారాలు ఏవీ లేవు. ఆయన బిజెపికి అనుకూలంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే కానీ నేరుగా ఎన్డీఎలో చేరడానికి అంగీకరించకపోవచ్చు. గత ఎన్నికల సమయంలోనే అందుకు జగన్ నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో బిజెపితో కలిసి పనిచేయడానికి ఆయన అంగీకరించరనేది స్పష్టం.
undefined
మరో విషయం ఏమిటంటే, బిజెపితో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పొత్తు పెట్టుకుంది. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమిడే పరిస్థితి ఉండదు. అందువల్ల పవన్ కల్యాణ్ ఉండగా జగన్ ఎన్డీఎలోకి వెళ్లే అవకాశం లేదు. బిజెపి సన్నిహితంగా ఉంటూనే తాను విడిగా ఉండడానికే జగన్ మొగ్గు చూపుతారు.
undefined
అయితే, తాజాగా ఐటీ సోదాల నేపథ్యంలో చంద్రబాబు విషయంపై వైఎస్ జగన్ ప్రధానితో మాట్లాడి ఉంటారని ఊహించడానికి అవకాశం ఉంది. అదే విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడవచ్చు. అయితే, చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి అమిత్ షా పెట్టే షరతులకు జగన్ అంగీకరించినా అంగీకరించవచ్చుననేది మరో అంశం. ఇది ఊహ మాత్రమే. అందువల్ల చంద్రబాబు వ్యవహారం ప్రధానాంశంగా జగన్ ఢిల్లీ పర్యటన జరుగుతుండవచ్చు కూడా.
undefined
చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టడానికి అమిత్ షా అంగీకరిస్తారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి బిజెపి ప్రత్యామ్నాయంగా మారాలని అనుకుంటోంది. చంద్రబాబును పక్కకు నెట్టి బిజెపి ముందుకు రావడానికి తగిన వ్యూహాలను బిజెపి ఎంచుకోవచ్చు. చంద్రబాబును పక్కకు నెట్టి రెండో స్థానంలోకి వస్తే ఆ తర్వాత జగన్ విషయం చూసుకోవచ్చునని కూడా అనుకుంటుండవచ్చు.
undefined