సందీప్ కిషన్ కు సరైన హిట్..వెంకటాద్రి ఎక్సప్రెస్ తర్వత తగలనేలేదు. అయినా అతని ప్రయాణం ఎక్కడా బ్రేక్ పడలేదు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా చేసాడు. మేకింగ్ ఓ రేంజిలో ఉండటం... విజయ్ సేతుపతి వంటి వెర్శటైల్ ఆర్టిస్ట్ కూడా కలవటంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆ క్రేజ్ ని ఈ సినిమా క్యాష్ చేసుకోగలిగిందా...సినిమా కథేంటి...సందీప్ కిషన్ కెరీర్ కు ఈ సినిమా ఏ మేరకు ప్లస్ అవుతుంది ..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
కథ 1990 లలో జరుగుతుంది. గురు అలియాస్ గురునాథ్ (గౌతమ్ మీనన్) ఓ పెద్ద మాఫియా డాన్. సెటిల్మెంట్స్ ,దందాలులతో దూసుకుడుగా నేరసామ్రాజ్యాన్ని ఏలుతున్న గురు..పై ఓసారి కోర్టులో ఎటాక్ జరిగితే మైఖేల్ అనే అనే పిల్లాడు కాపాడతాడు. దాంతో గురుకు వాడంటే అభిమానం ఏర్పడుతుంది. వాడు పెరిగి పెద్దయ్యాక మరోసారి గురుని రైవల్స్ ఎటాక్ చేస్తే ప్రాణాలకు తెగించి కాపాడతాడు. దాంతో గురుకు అతనికి తన సామ్రాజ్యంలో చోటిస్తాడు. అయితే మైఖేల్ ఇలా ఎదగటం గురు కొడుకైన అమర్ నాథ్ (వరుణ్ సందేశ్)కు నచ్చదు. అతన్ని ప్రక్కన పెడుతున్నారని పదే పదే ఫీలవుతూంటాడు. ఇక గురు ఓ రోజు మైఖెల్ ని పిలిచి ఓ టాస్క్ అప్పచెప్తాడు. తనని రెండోసారి చంపటానికి ఆరుగురు వ్యక్తులు ప్లాన్ చేశారని తెలుసుకున్న గురునాథ్.. ఐదుగురిని పట్టుకుంటాడు.
తన హత్యకు ప్లాన్ చేసిన ఆరో వ్యక్తి డిల్లీలో ఉండే రత్నాకర్ ( అనీష్ కురివిల్లా) అని, అతన్ని చంపాలని మైఖేల్‌కి చెప్తాడు. అలాగే ఢిల్లీలో ఉండే రత్నాకర్ ఓ కూతురు ఉందని, తనను కూడా చంపేయమని పురమాయిస్తాడు. ఆ అమ్మాయి తీర (దివ్యాంశ కౌశిక్). చంపటానికి వెళ్లిన మైఖేల్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అప్పుడు మైఖేల్ ఏం చేసాడు. అసలు గురుని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు... ఆ ఆరుగురికి ... చంపమని సుపారీ ఇచ్చిందెవరు... అసలు మైకేల్ మనస్సులో ఏముంది...తీరతో ...మైకేల్ లవ్ స్టోరీ చివరకు ఏ తీరం చేరింది, ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ పాత్రలు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూడగానే ఇది ఒక స్టైలిష్ యాక్షన్ చిత్రం అనే క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే మేకింగ్ చాలా బాగుంటుంది అనే విషయం స్పష్టం అవుతుంది. అయితే సాధారణంగా సినిమాలో ఓ కథ...అక్కడక్కడా యాక్షన్‌ని చూస్తుంటాం. కానీ ఈ సినిమా చూస్తే యాక్షన్ సీన్స్ మధ్య ఓ కథని ఇరికించినట్టు ఉంటుంది. ఇంటర్వెల్ ఓ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ ఓ ట్విస్ట్ అనుకుని అందుకు తగ్గ యాక్షన్ సీన్స్ కలుపుకుంటూ వెళ్లిపోయారు. దాంతో అసలు స్టోరీ పాయింట్ ఏమిటి..హీరో చేసేదంతా ఎవరి కోసం ఎందుకు చేస్తున్నాడు అనేది తెలుసునేసరికి ప్రీ క్లైమాక్స్ వస్తుంది. దాంతో ఏ సీన్ కా సీన్ కావాలని పేర్చినట్టే అనిపిస్తుంది. దాంతో కథ ఎమోషనల్‌గా ప్రేక్షకుడికి కనెక్ట్ అవటం కష్టమనిపిస్తుంది. ఉన్నంతలో హీరో బాల్యం, ఏ పరిస్థితుల్లో అతను కుటుంబానికి దూరమయ్యి అనాధగా మారాడో ఆ సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్నప్పటికీ అది జరగలేదు.
Michael
మేకింగ్ లో కొట్టుకుపోతుంది తప్ప ఆగి ఎమోషన్ ని ఫీల్ అయ్యేలా ఉండదు. ఇక సెకండ్‌హాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి. కానీ వీటన్నిటినీ ఫెరఫెక్ట్ గా కనెక్ట్ చేసినట్లు అనిపించదు. యాక్షన్ సీన్స్ కొత్తగా చేస్తున్నామా లేదా అనేది చూసుకుంటూ వెళ్లిపోయారు. కొన్ని ఫైట్ సీన్స్ ఏ దశలోనూ మెప్పించకపోగా, సుదీర్ఘంగా సాగి అయ్యిపోతే బాగుండును అనిపిస్తాయి. మాఫియా డ్రామా పీరియడ్ కావటంతో ఒకింత కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ పంజా, రంగస్దలం, మణిరత్నం నవాబు ఇలా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి.ఓపినింగ్ సీక్వెన్స్, వెనకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...కేజీఎఫ్ ని గుర్తు చేస్తూంటాయి. ఇవి చాలదన్నట్లు డైరక్టర్ చివర్లో తాను ఇన్సైరైన సినిమాలు అంటూ పెద్ద లిస్టే ఇచ్చాడు. ఇక ఇంటర్వెల్ సీన్ ..ఏదో స్టేజి డ్రామా చూస్తున్నట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ షరా మామూలే. ఉన్నంతలో బాగున్నది విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ ట్రాక్ మాత్రమే.
బాగున్నవి
విజయ్ సేతుపతి సీన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫి
యాక్షన్ సీన్స్
బాగోలేనివి
స్లో నేరేషన్
ఎమోషన్ లేని యాక్షన్ సీన్స్
ఎవరెలా చేసారు..
సందీప్ కిషన్ ... స్టైలిష్ అవతారంతో మెప్పిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో అతని కష్టం కనిపిస్తుంది. గౌతమ్ మీనన్ సన్నివేశాల్లో సహజంగా కనిపించే ప్రయత్నం చేశారు. గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన దివ్యాంశ కౌశిక్ నటన యాంగిల్ ఓపెన్ అయ్యింది. వరలక్ష్మీ పాత్ర పెద్దగా లేకపోయినా ఆమె వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనసూయ పాత్ర...పుష్పలో క్యారక్టర్ ని గుర్తు చేసింది. వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత తెరపై కనిపించారు. కొత్తగా ఉన్నారు. ఇండస్ట్రీ అతన్ని వేరే కీ పాత్రలకు కూడా ఉపయోగించుకోవచ్చు అని క్లూ ఇచ్చినట్లు ఉంది.
టెక్నికల్ గా ...
కెమెరాకి ఎక్కువ మార్కులు పడతాయి. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. మేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంది. దర్శకుడు రంజిత్ రచనలో చాలా లోపాలు కనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, అక్కడక్కడా థ్రిల్స్ కోసం మినహా కొత్తదనం లేని సినిమా ఇది. సందీప్ కిషన్ అభిమానుల్ని మాత్రం ఆయన కొత్త లుక్ రఫ్ గా నచ్చుతుంది.
ఫైనల్ థాట్
మేకింగ్ మీద దృష్టి పెట్టి కథను వదిలేస్తే...ప్రేక్షకులు.... ప్రారంభమైన కాసేపటికే సినిమాని వదిలేస్తారు.
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
నటీనటులు : సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనీష్ కురువిల్లా తదితరులు
మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి
ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్
సంగీతం : సామ్ సిఎస్
నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
కథ, కథనం, దర్శకత్వం : రంజిత్ జయకొడి
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023