సంతోష్ శోభన్ 'కళ్యాణం కమనీయం' రివ్యూ

First Published Jan 14, 2023, 3:28 PM IST

 సంతోష్ శోభన్ కు ఒక ఓటీటీ హిట్ తప్ప.. థియేట్రికల్ సక్సెస్ లేదు. మొన్నీమధ్య వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ పెద్ద ప్లాప్ అయ్యింది. అందులోనూ పెద్ద సినిమాలు ‘వీర సింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు కనుక చూసేస్తే ఆడియన్స్ కి ‘వారసుడు’ ‘తెగింపు’ వంటి డబ్బింగ్ సినిమాలు చూసే ఆప్షన్ ఉంది. మధ్యలో ఈ సినిమా నిలబడుతుందా

Kalyanam Kamaneeyam Review


ఓటీటీలు వచ్చాక చిన్న కాన్సెప్టులకు ఆదరణ బాగా పెరిగింది. సినిమా బాగుంటే అది చిన్నదా, పెద్దదా అని చూడటం లేదు. బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇది సంక్రాంతి సీజన్. ఇక్కడ పెద్ద హీరోలు ఇద్దరు బరిలోకి దిగి పోటీ పడుతున్నారు. వీళ్ల మధ్యలోకి ఓ చిన్న సినిమా వస్తోందనగానే అందరూ ఆసక్తిగా చూసారు. మొదట బ్యానర్ యువి క్రియేషన్స్ కావటం , రెండోది ఎంత ధైర్యం ఉంటే ..ఈ పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడతారు అనే ఆలోచన. ఈ సినిమాపై హోప్స్ కలిగించింది. మరి ఆ ఎక్సపెక్టేషన్స్ ని ఈ చిత్రం రీచ్ అయ్యిందా...అసలు ఈ చిత్రం కథేంటి..వర్కవుట్ అయ్యే కాన్సెప్టేనా?

కథాంశం:
 శ్రుతి (ప్రియా భవానీ శంకర్) ,  శివ (సంతోష్ శోభన్) ఇద్దరూ కాలేజ్ రోజల నుంచి రిలేషన్ లో ఉంటారు. అయితే శివ కు సంపాదన లేదు. అయినా ధైర్యం చేసి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆమె సంపాదనతో లైఫ్ మొదలవుతుంది. ఉద్యోగం వచ్చే దాకా తనదే భాధ్యత అని , డబ్బులు ఎవరినీ అడగొద్దని మాట తీసుకుని ముందుకు వెళ్తుంది. అలా మొదట కొంతకాలం ఆనందమైన జీవితం గడుస్తుంది. అయితే ఓ టైమ్ లో శృతి ...శివను జాబ్ చూసుకోమని ఒత్తిడి చేయటం మొదలెడుతుంది. అంతేకాకుండా ప్రతీ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ కోప్పడుతుంది. ఇవన్నీ తట్టుకోలేక..శివ ఓ కాబ్ డ్రైవర్ గా లైఫ్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆమె కు మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని అబద్దం ఆడతాడు. ఆ చిన్న అబద్దం వాళ్ల కాపురంలో పెద్ద అల్లకల్లోలం రేపుతుంది. అదేమిటి... శివ, శృతి ల మధ్య అసలు గొడవలకు కారణం ఏమిటి..ఎవరు..చివరకు వీరి సంసారం నిలిచిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ కథ నిజానికి ఓ షార్ట్ ఫిల్మ్ కు తగ్గ కథాంశంతో తయారైంది. ఓ సక్సెస్ ఫుల్ భార్య,ఉద్యోగం సద్యోగం లేని భర్త మధ్య జరిగే కథ. అప్పట్లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం అనే చిత్రం ఒకటి వచ్చింది. చంద్రమోహన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఉద్యోగం లేని ఓ భర్త కు భార్యకు మధ్య జరిగే కథతో అప్పట్లో అలరించింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా దాదాపు అలాంటి విషయాన్నే స్పృశించింది. , భార్య జాబ్ చేస్తూ అతనికి డబ్బులు ఇవ్వడం, ఆ ఎపిసోడ్ 'జెర్సీ'లో ఎపిసోడ్‌కు కొంత దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ప్రక్కన పెడితే..  మోడ్రన్ భార్యాభర్తలు, ఇగో క్లాషెష్ చుట్టూ కథను తిప్పారు. ప్రారంభంలో కథ వీటి చుట్టూనే తిప్పారు. అయితే కథలో అసలైన మలుపు తీసుకోవాల్సిన వీరిద్దిరి మధ్యన కాంప్లిక్ట్స్ మాత్రం సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. హైలెట్ కాలేదు. ఇంట్లో ట్యాప్ రిపేర్ చేయించకపోవటం, మొక్కలకు నీళ్లు పెట్టకపోవటం వంటి వాటి మధ్య చిన్నగా గొడవలు స్టార్ట్ అవుతాయి. 


ఇలాంటి నిత్య జీవితం అబ్జర్వేషన్స్ బాగున్నాయి. కానీ డ్రామా క్రియేట్ కాలేదు. కాంప్లిక్ట్స్ బలంగా లేకపోవటంతో ఎంత సహజమైన సీన్స్ రాసుకున్నా కలిసి రాలేదు.  హీరో ఉద్యోగ విషయంలో అబద్దం ఆడి క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నప్పుడు పుట్టే ఫన్ కూడా అంతలా లేదు. అలాగే ఆడవాళ్లు ఆఫీస్ లో సమస్యలు ఎదుర్కోవటం, భార్యను ఇంప్రెస్ చేయటానికి భర్త పడే తిప్పలు హైలెట్ చేసారు. అవి బాగున్నాయి. అలాగే కథలో చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమీ లేవు. సీన్స్  చాలా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిన్నాయి. కామెడీ ని హైలెట్ చేయలేదు. కథను  ఇప్పటి  స్పీడు లైఫ్, ఇగో క్లాషెష్ తో వస్తున్న దాంపత్య సమస్యలు మీద కాన్సర్టేట్ చేసి ఉంటే బాగుండేది. ఏదైమైనా స్క్రిప్టు పకడ్బందీగా ఉండాల్సింది.

నటీనటుల విషయానికి వస్తే... 

సంతోష్ శోభన్  కు నటుడుగా తన సత్తా చూపించే పాత్ర. చిన్న చిన్న ఎక్సప్రెషన్స్ తో చక్కగా ముందుకు వెళ్లాడు. తన పాత్రలో వచ్చిన మార్పుని చాలా సహజంగా చూపించాడు. తన భార్య తనను అవమాన పరిచినప్పుడు ఇచ్చే ఎమోషనల్ ఎక్సప్రెషన్ కూడా గురించి హైలెట్ అని చెప్పాలి.  అలాగే ప్రియ భవాని శంకర్ ...తెలివైన భార్యగా బాగా చేసింది. క్యూట్ గా వుంది. ఆమె పాత్రను బాగా డిజైన్ చేసారు.  మేనేజర్ గా ఉంటూ హీరోయిన్ ని హెరాస్ చేసే పాత్రలో సత్యం రాజేష్ ...జీవించాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగా చేసారు.
 

Kalyanam Kamaneeyam

టెక్నికల్ గా ...

స్క్రిప్టు వైపు నుంచి తప్పిస్తే మిగతా విభాగాలు అన్నీ బాగా చేసాయి. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ ఓ మ్యాజిక్ లా సినిమాని పట్టుకుంది. ఆ కలర్ ఫుల్ విజువల్స్ కు తగ్గట్లే శర్వన్ భరద్వాజ ...డెప్త్ గా మ్యూజిక్ ఇచ్చాడు. డైలాగుల్లో చాలా వరకూ అర్దవంతంగా ఉన్నాయి.  నిర్మాణ విలువలు ప్రత్యేకంగా చెప్పేదేముంది. బాగా ఖర్చుపెట్టారు. డైరక్టర్ లో సెన్స్,సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కానీ...అతన్ని సపోర్ట్ చేసే స్టోరీ లైన్ లేకపోవటంతో ఎలివేట్ కాలేదు.

Kalyanam Kamaneeyam


ఫైనల్ థాట్

  ఓటిటిలో చూడదగ్గ సినిమాగా అనిపిస్తుంది. థియేటర్ కు సరపడ సరకు లేదనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి పోటీలో నిలబడే సత్తా మాత్రం లేదు.
Rating:2
  

Kalyanam Kamaneeyam


నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు
 సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని, 
ఎడిటర్ – సత్య జి, 
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, 
సాహిత్యం – కృష్ణ కాంత్, 
కొరియోగ్రాఫర్స్ – యష్, విజయ్ పోలంకి, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు, ప్రొడక్షన్
డిజైనర్ – రవీందర్,
 లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్, 
సహ నిర్మాత – అజయ్ కుమార్ రాజు
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, 
రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.
రన్ టైమ్ :  గంట 46 నిమిషాలు
విడుదల తేదీ : 14 జనవరి 2023

click me!