`రేవు` మూవీ రివ్యూ, రేటింగ్..

First Published | Aug 24, 2024, 9:07 PM IST

రా అండ్‌ రస్టిక్‌ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుంది. ఈ  క్రమంలో మరో రస్టిక్‌ మూవీ `రేవు` ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

ప్రస్తుతం చిన్న సినిమాల జోరు నడుస్తుంది. కంటెంట్‌ ప్రధానంగా వచ్చిన మూవీస్‌ మంచి ఆదరణ పొందుతున్నాయి. `కమిటీ కుర్రోళ్లు`, `ఆయ్‌` వంటి చిత్రాలు ఆ కోవకి చెందినవే. ఈ క్రమంలో ఇప్పుడు `రేవు` అనే మరో మూవీ కంటెంట్‌ ప్రధానంగా రూపొందింది. హరినాథ్‌ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు పర్యవేక్షణలో, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్ గా పనిచేయడం విశేషం. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో `రేవు` సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
కోస్తా తీర ప్రాంతంలోని రేవు ప్రధానంగా సాగే చిత్రమిది. పాలరేవు అనే గ్రామంలో అంకులు(వంశీరామ్‌ పెండ్యాల), గంగయ్య(అజయ్‌) వరుసకి బావాబామ్మర్దులు. చిన్నపడవలతో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటారు. చేపలు పట్టడంలో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఈక్రమంలో వీళ్లకి పోటీగా నాగేశు(యేపూరి హరి) పెద్ద బోటుతో రంగంలోకి దిగుతాడు. ఆయన కాస్త డబ్బు పరంగా బలిసిన బ్యాచ్. బావాబామ్మర్దులను దెబ్బకొట్టేలా ఆయన తన బోటుతో సముద్రం లోపలకి వెళ్లి చేపలు పడతాడు. కంపెనీలకు అమ్ముతూ వ్యాపారం చేస్తుంటాడు. ఇది అంకులు, గంగయ్యలకు పెద్ద దెబ్బగా మారుతుంది. అయితే తమ వద్ద ఉన్న పాత బోటుని నాగేశు తమ్ముడి కొడుకు సాయంతో బాగా చేసుకుని వీళ్లు కూడా చేపల వ్యాపారం పెంచుతారు. ఇది తట్టుకోలేని నాగేశు ప్రత్యర్థులకు సాయం చేశాడనే కోపంతో తమ్ముడి కొడుకునే చంపేస్తాడు. ఇంతటి దారుణానికి తెగబడ్డ నాగేశుని కూడా అంకులు, గంగయ్య కలిసి చంపుతారు. దీంతో నాగేశు కొడుకులు రంగంలోకి దిగుతారు. అసలు ఫైట్‌ అప్పుడే ప్రారంభమవుతుంది. మరి ఈ హత్యలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ఎవరు ఎవరిని చంపారు? గంగయ్య, అంకుల జీవితాల్లో చోటు చేసుకున్న పరినామాలేంటి? ఫైనల్‌గా ఎవరు మిగిలారు? ఎవరికి రేవు సొంతమైందనేది మిగిలిన కథ.    


విశ్లేషణః 
రా అండ్‌ రస్టిక్‌ చిత్రాలకు ఇప్పుడు జనం బ్రహ్మరథం పడుతున్నారు. `రంగస్థలం` నుంచి ఈ తరహా చిత్రాల జోరు పెరిగింది. `పుష్ప` ఎలా దుమ్ములేపిందో తెలిసిందే. కంటెంట్‌ ఉండి, స్క్రీన్‌ప్లే బాగా రాసుకుని, ఎంగేజ్‌ చేసేలా, క్వాలిటీగా సినిమాని తీస్తే పెద్ద హిట్‌ చేస్తున్నారు ఆడియెన్స్. ఇంకా చెప్పాలంటే అలాంటి కంటెంట్‌నే కోరుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ లో భాగంగానే `రేవు` సినిమాని మలిచారు మేకర్స్. రా అండ్‌ రస్టిక్‌ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే మత్స్యకారుల జీవితాలను ప్రధానంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. తెలుగు సినిమాలో ఇలా మత్య్సకారుల లైఫ్‌ని ఆవిష్కరించే సినిమాలు పెద్దగా రాలేదు. ఏదో సన్నివేశాల్లో చూపించారు తప్పితే, అదే మెయిన్‌ స్టోరీగా సినిమా రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో `రేవు` మేకర్స్ ఆ సాహసం చేశారు. గంగపుత్రుల జీవితాలను ఆవిష్కరించారు. వారి జీవన పోరాటాన్ని, వాళ్లలో ఉండే గొడవలు, మనుగడ కోసం చేసే పోరాటాన్ని అంతే సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. 
 

అయితే సినిమాలో మొదటి భాగంలో చాలా వరకు పాత్రలను పరిచయం చేయడం, వాటిని ఎస్టాబ్లిష్‌ చేయడానికే ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. ఫస్టాఫ్‌ అంతా దానిచుట్టూనే సాగుతుంది. అది కొంత లెంన్తీగా అనిపిస్తుంది. మత్స్యకారుల ఇబ్బందులు, వాళ్ల మధ్య ఉండే ఫైట్ ని కళ్లకి కట్టినట్టు చూపించాడు. డిటెయిలింగ్‌లోకి వెళ్లే క్రమంలో కొంత సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథలోని, పాత్రల ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇవ్వడం ఇందులో మెయిన్‌ హైలైట్‌. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, పక్కొడు వచ్చినప్పుడు ఎదురించి నిలబడతారనేది, నిలబడాలనేది చెప్పిన తీరు బాగుంది. అయితే అదేదో సందేశం లా కాకుండా సన్నివేశాల రూపంలో చెప్పకనే చెప్పాడు దర్శకుడు. మరోవైపు ఈగో స్నేహాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇందులో చూపించారు. ఓ వైపు స్నేహం, మరోవైపు ఈగో, ఇంకోవైపు ప్రతీకారం, దీనికితోడు మత్యకారుల లైఫ్‌ ఇలా అనేక లేయర్లని జోడిస్తూ నడిపించిన తీరు బాగుంది. సెకండాఫ్‌లో పూర్తిగా కథపై ఫోకస్‌ పెట్టిన దర్శకుడు ఆద్యంతం ఎంగేజింగ్‌గా తీసుకెళ్లాడు. రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాతో నడిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీనికితోడు ప్రతీకారం కుటుంబాలను ఎలా దెబ్బతీస్తుంది. ఇంట్లో వాళ్లు ఎలా స్ట్రగుల్‌ అవుతారు, అవి ఎంతటి విషాదాన్ని మిగుల్చుతాయనేది కళ్లకి కట్టినట్టు చూపించారు. అయితే సినిమాలో కంటెంట్‌ ఉన్నంత క్వాలిటీ మేకింగ్‌లో తగ్గింది. లొకేషన్లు సింపుల్‌గా అనిపించాయి. మేకింగ్‌ పరమైన క్వాలిటీ అవసరం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్లు తక్కువగా ఉండటం కొంత లోటు అనిపిస్తుంది. యాక్షన్‌ మూవీస్, రివేంజ్‌ డ్రామాలను, రస్టిక్‌ మూవీస్‌ని ఇష్టపడేవారికి బాగా నచ్చే చిత్రమవుతుంది. 
 

నటీనటులుః 
సినిమాలో వంశీ రామ్‌ పెండ్యాల మత్య్సకారుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఇంకా చెప్పాలంటే జీవించాడు. మంచి నటనతోపాటు ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిజానికి పోకుండా నటనతో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. హేమంత్‌, అజయ్‌ తమ పాత్రలో ఆకట్టుకున్నారు. సహజంగా చేసేప్రయత్నం చేశారు. హీరోయిన్‌గా నటించిన స్వాతి నటన ఫర్వాలేదనిపిస్తుంది. మిగిలిన పాత్రధారులు పాత్ర పరిధి మేరకు నటించారు. 

టెక్నీషియన్ల పనితీరుః 
సినిమాకి సంగీతం మెయిన్‌. బీజీఎం బాగుంది. పాటలు మామూలుగా ఉన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు జాన్‌ కె జోసెఫ్‌ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. రేవంత్‌ సాగర్‌ కెమెరా వర్క్ సైతం బాగుంది. ఎడిటర్‌ మరింత ట్రిమ్‌ చేయాల్సింది. సీన్ల సింకుల విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఇంకా బాగా చేయాల్సింది. ఇక దర్శకుడు హరినాథ్‌ పులి ఎంచుకున్న కథ బాగుంది. రివేంజ్‌ డ్రామాని మలిచిని తీరు బాగుంది. ఆర్టిస్టుల నుంచి రస్టిక్‌ పర్‌ఫెర్మెన్స్ ని అంతే బాగా తీసుకున్నారు. అయితే క్వాలిటీ పరంగా మరింత కేర్‌ తీసుకోవాల్సింది. దర్శకుడిగా అనుభవ లేమి కూడా కొంత కనిపిస్తుంది. ఎమోషన్స్ విషయంలో మరింత కేర్‌ తీసుకుంటే సినిమా మరింత బాగా ఉండేది. 

ఫైనల్‌గాః మత్య్సకారుల జీవితాలను ఆవిష్కరించే `రేవు`. 

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!