`డీమాంటీ కాలనీ 2` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌

First Published | Aug 23, 2024, 10:02 AM IST

తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన `డీమాంటీ కాలనీ` సినిమా పెద్ద హిట్‌. దానికి సీక్వెల్‌గా `డీమాంటీ కాలనీ 2` వచ్చింది. తమిళంలో గత వారం విడుదలై ఆకట్టుకున్న ఈ మూవీ శుక్రవారం తెలుగులో విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్‌ చేసి హిట్‌ కొడుతున్నారు మేకర్స్. అలాంటి సినిమాలకు చాలా వరకు తెలుగులోనూ మంచి ఆదరణే దక్కుతుంది. ఆ కోవలోనే తమిళంలో హిట్ అయిన `డీమాంటీ కాలనీ 2` సినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్. అరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా అజయ్‌ ఆర్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన చిత్రమిది. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన `డీమాంటీ కాలనీ` పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు దాని సీక్వెల్‌ కూడా తమిళంలో గత వారం విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో ఈ శుక్రవారం తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. మరి తమిళంలో మాదిరిగానే తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
డెబీ(ప్రియా భవానీ శంకర్‌) తన భర్త చనిపోవడంతో బాగా కుంగిపోతుంది. ప్రాణంగా ప్రేమించిన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు సూసైడ్‌ చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఆరా తీయడం స్టార్ట్ చేస్తుంది. భర్త మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆసక్తికర విషయం తెలుస్తుంది. ఆరేళ్లకి ఒకసారి లైబ్రరీకి వెళ్లిన అందరు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలను ఆపేందుకు డెబీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటుంది. అందులో భాగంగానే కవల సోదరులు శ్రీనివాస్‌, రఘునందన్‌(అరుళ్‌ నిధి)ల గురించి తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలుసుకున్న డెబీ తన మామయ్య రిచర్డ్(అరుణ్‌ పాండియన్‌) సహాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాళ్లని నిజంగానే కాపాడిందా? వీరికి టిబెట్‌ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలాంటి సాయం చేశారు? కవల సోదరుడు శ్రీనివాస్‌ మరో సోదరుడు ఎందుకు చంపాలనుకున్నాడు? వాళ్ల గతం ఏంటి? తన భర్త కోరికని డెబీ నెరవేర్చిందా? అనంతరం కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా. 
 


విశ్లేషణః 
హర్రర్‌ సినిమాలకు ఎప్పుడూ లైఫ్‌ ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేదు. ట్రెండ్‌తో అస్సలు సంబంధం లేదు. ఏ ట్రెండ్‌ నడుస్తున్నా హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ దక్కుతుంది. భయపెట్టే సన్నివేశాలు, థ్రిల్‌ చేసే సీన్లు, సస్పెన్స్ క్రియేట్‌ చేసే కథనం ఉంటే చాలా వరకు ఆడియెన్స్ ఎగబడి చూస్తారు. హర్రర్‌ చిత్రాలను ఇష్టపడేవారు క్యూ కడుతుంటారు. ఇటీవల కాలంలో హర్రర్‌ సినిమాలు అడపాదడపా వస్తున్నాయి. కానీ ఒకటి అర తప్పితే పెద్దగా హిట్‌ అయిన చిత్రాలు లేవు. ఈక్రమంలో తమిళంలో ఆల్‌రెడీ హిట్‌ అయిన `డీమాంటీ కాలనీ 2` ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం విశేషం. టెక్నీకల్‌గా హై స్టాండర్డ్స్ లో ఉన్న హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతూ, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యింది. కథ నడిచే విధానం, ట్విస్ట్ లు ఈ సినిమాకి మెయిన్‌ హైలైట్‌. హర్రర్‌ సినిమాలకు అదే బలం. దీనికి తోడు బీజీఎం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే అదే సినిమాని నడిపిస్తుంది. ఇందులో దర్శకుడు జ్ఞానముత్తు సౌండ్‌పై బాగా ఫోకస్‌ చేశాడు. సౌండ్‌తోనే భయపెట్టాడు, థ్రిల్‌కి గురి చేశాడు, సస్పెన్స్ తో ఎంగేజ్‌ చేశాడు. దీనికితోడు స్క్రీన్‌ప్లేని చాలా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. నెక్ట్స్ ఏం జరగబోతుందో అనే సస్పెన్స్ ని క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. సాధారణంగా ఇలాంటి హర్రర్‌ సస్పెన్స్ థ్రిల్లర్.. నెక్ట్స్ ఏంటనేది ఊహించడం ఈజీనే, కానీ ఇందులో దానికి స్కోప్‌ లేకుండా చేశాడు. అదే ఈ సినిమా సక్సెస్‌కి మెయిన్‌ కారణం. సినిమా హర్రర్‌ మూవీ అయినా కామెడీ జోడించిన విధానం బాగుంది. అది బాగా ఎంటర్టైన్‌ చేస్తుంది. 
 

తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన `డీమాంటీ కాలనీ` సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ మూవీని చూస్తే సీక్వెల్‌ బాగా అర్థమవుతుంది. అయితే కొత్తగా చూసే ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా మొదట్లోనే రీక్యాప్‌ చేసి సీక్వెల్‌ని స్టార్ట్ చేయడం దర్శకుడు చేసిన తెలివైన పని. ఎలాంటి ఆడియెన్ కి అయినా అర్థమయ్యేలా చేయడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సినిమాని హైలీ ఇంటలీజెంట్ గా నడిపించాడు. అది మన తెలుగు ఆడియెన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. ఇటీవల `తంగలాన్‌` మూవీ విషయంలోనూ అదే జరిగింది. కంటెంట్‌ బాగున్నా, సింప్లిఫై చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీంతో పెద్దగా ఎక్కలేదు. `డీమాంటీ కాలనీ 2` విషయంలోనూ కొంత అదే జరిగింది. సినిమాలో కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో ఊహించేలా కథని నడిపించారు. వీఎఫ్‌ఎక్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అది మెయిన్‌ మైనస్‌గా నిలిచింది. దీనికితోడు క్లైమాక్స్ కూడా అంతగా కిక్‌ ఇచ్చేలా లేదు. ఓ రకంగా చెప్పాలంటే తేలిపోయింది. అయితే అంతిమంగా పార్ట్ 3 కోసం ఇచ్చిన హింట్‌ మాత్రం అదిరిపోయింది. నెక్ట్స్ పార్ట్ పై ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఈ సినిమాకి ప్లస్‌ అయ్యింది. సినిమాలో హర్రర్‌ ఎలిమెంట్లతోపాటు బ్రదర్స్ మధ్య గొడవలు, సవతి చెల్లెలలు కి సంబంధించిన ఎపిసోడ్, డీమాంటీ కాలనీ సీన్లు ఆద్యంతం కట్టిపడేస్తాయి. 
 

నటీనటులుః 
సినిమాకి మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ అనే చెప్పాలి. ఆమె పాత్ర ప్రధానంగానే సినిమా నడస్తుంది. నటిగా ఆమె ఇప్పటికే నిరూపించుకుంది. ఇందులో మరోసారి తానేంటో నిరూపించుకుంది. కొత్త లుక్‌లో ఆకట్టుకునేలా ఉంది. అద్భుతమైన నటనతో అదరగొట్టింది. ఇక అరుళ్‌ నిధి డ్యూయెల్‌ రోల్‌లో మెప్పించాడు. రెండు పాత్రల్లో రెండు వేరియేషన్స్ తో ఆకట్టుకున్నాడు. అరచ్చనా రవిచంద్రన్‌ పాత్ర కాసేపు మెరిసి నవ్వులు పూయించింది. ముత్తు కుమార్‌, అరుణ్‌ పాండియన్‌, సర్జనో ఖాలిద్‌ వంటి వారు తమదైన నటనతో మెప్పించారు. 
 

టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా సినిమా చాలా బాగుంది. సామ్‌సీఎస్ సంగీతం, సౌండ్‌ డిజైనింగ్‌ సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలిచింది. అదే సినిమాని నడిపించింది. బీజీఎం చాలా సీన్లని ఎలివేట్‌ చేసింది. సినిమా రేంజ్‌ని పెంచేసింది. హరీష్‌ కన్నన్‌ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డ్రోన్‌ షాట్స్, నైట్‌ షాట్స్ కొత్తగా ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్ విషయంలో మాత్రం తేలిపోయారు. భారీ సినిమాలను చూస్తున్న మన ఆడియెన్‌కి అవి పెద్దగా ఎక్కవు. ఎడిటింగ్‌ ఓకే, కొన్ని చోట్ల మరింత ట్రిప్‌ చేసే బాగుండనిపిస్తుంది. ఇక దర్శకుడు అజయ్‌ ఆర్ జ్ఞానముత్తు.. సీక్వెల్‌ని ఈ స్థాయిలో తీశాడంటే అభినందించాల్సిందే. జనరల్‌గా సీక్వెల్స్ పెద్దగా ఎక్కవు. మొదటి పార్ట్ ని మించి ఉండటమనేది చాలా అరుదు. కానీ దర్శకుడు సీక్వెల్‌ని మరింత గ్రిప్పింగ్‌గా తీసి సక్సెస్‌ అయ్యాడు. అయితే ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనే ప్రశ్న. కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. 

ఫైనల్‌గాః `డీమాంటీ కాలనీ 2` హర్రర్‌ థ్రిల్లర్ ఇష్టపడే వారికి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. 

రేటింగ్‌ః 3
 

Latest Videos

click me!