Raja Vaaru Rani Gaaru : రాజావారు రాణిగారు మూవీ రివ్యూ

First Published Nov 29, 2019, 11:03 AM IST

ప్రేమకథతో సినిమాలంటే అన్నీ ఒకే మాదిరి ఉంటాయి. ఇద్దరు ప్రేమించుకోవడం, వారి ప్రేమని గెలిపించుకోవడం వంటి పాయింట్స్ తో సినిమాలను తీస్తుంటారు.

ప్రేమకథతో సినిమాలంటే అన్నీ ఒకే మాదిరి ఉంటాయి. ఇద్దరు ప్రేమించుకోవడం, వారి ప్రేమని గెలిపించుకోవడం వంటి పాయింట్స్ తో సినిమాలను తీస్తుంటారు. అయితే కథనం ఎంత కొత్తగా ఉంటే ప్రేక్షకులు సినిమాని అంతబాగా ఆడరిస్తుంటారు. నూతన దర్శకుడు రవికిరణ్ కోలా కూడా ఓ ప్రేమ కథను తెరకెక్కించి 'రాజావారు రాణిగారు' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ కథ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
undefined
కథ : శ్రీరామపురం అనే పల్లెటూర్లో రాజా(కిరణ్), రాణి(రహస్య గోరక్) అనే అమ్మాయి, అబ్బాయి ఉంటారు. చిన్నప్పటి నుండి రాజా.. రాణిని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకి చెప్పలేకపోతాడు. ఇంతలో ఇద్దరూ ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో రాణి పై చదువుల కోసం మరో ఊరుకి వెళ్తుంది. ఆమె వెళ్లే సమయంలో రాజాని చూసి టాటా అంటూ చెయ్యి ఊపడంతో ఆమె తనని ప్రేమిస్తుందని అనుకుంటాడు రాజా.
undefined
ఆమెని తలచుకుంటూ బ్రతుకుతుంటాడు. కానీ రాణి మూడేళ్లు అయినా ఊరికి మాత్రం తిరిగిరాదు. దీంతో రాజా స్నేహితులు ఆమెని రప్పించడం కోసం ఓ ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లుగానే రాణి ఊళ్లో అడుగుపెడుతుంది. అలా వచ్చిన రాణికి రాజా తన ప్రేమ విషయాన్ని చెప్పాడా..? దానికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందనే విషయాలు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
undefined
కథనం: తన ప్రేమ విషయాన్ని ప్రేయసికి చెప్పలేని ఓ కుర్రాడి కథే ఈ సినిమా. ఓ చిన్న లైన్ ని తీసుకొని రెండు గంటల పాటు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా సినిమా తీయడంలో కొత్త దర్శకుడు రవికిరణ్ కోలా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సింపుల్ లవ్ స్టోరీకి కామెడీ, ఎమోషన్స్ జోడించి అందంగా తెరపై మలిచాడు. ఒక్కో పాత్రని తీర్చిదిద్దిన తీరు, దాన్ని తెరపై నడిపించిన తీరు ఆకట్టుకుంటాయి.
undefined
కథలో ఎలాంటి మలుపులు ఉండవు, కథ మొత్తం ఒక చోటే నడుస్తూ ఉంటుంది.. అయినప్పటికీ చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. పల్లెటూరిలో కొన్ని పాత్రలు, వారి మధ్య నడిచే సంభాషణలు, పచ్చటి వాతావరణం వెండితెరపై చూడటం కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే కామెడీ సెకండ్ హాఫ్ లో కనిపించదు.
undefined
ఒకటే పాయింట్ చుట్టూ సినిమా నడవడం కొంత అసహనానికి గురి చేస్తుంది. సన్నివేశాలు స్లోగా నడుస్తుంటాయి. కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ సన్నివేశాల్లోకి ఎంటర్ అవుతామో.. కథ మళ్లీ ఊపండుకుంటుంది. ఓ మంచి ఫీల్ గుడ్ ఎమోషన్ తో సినిమాని ముగించారు. సినిమాలో తెలిసిన మొహాలు పెద్దగా లేకపోయినా కథ, కథనాలు నమ్ముకొని సినిమా నడిపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు రవికిరణ్.
undefined
ఎవరెలా చేశారంటే.. దర్శకుడు ఎంపిక చేసుకున్న నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం తన పాత్రలో ఇమిడిపోయాడు. తన ప్రేమని బయటకి చెప్పలేక, లోపల దాచుకోలేక మధన పడే పాత్రలో చక్కటి నటన కనబరిచాడు. రహస్య తన పాత్రలో ఓకే అనిపిస్తుంది. హీరోయిన్ లో గ్లామర్ చూపించడం కంటే, పల్లెటూరి స్వచ్చత చూపించడానికే దర్శకుడు ప్రాధన్యమిచ్చాడు. ఇక సినిమాకి రెండు పాత్రలో హైలైట్ గా నిలిచాయి. వారే హీరో స్నేహితులు నాయుడు, చౌదరిలు.
undefined
ఈ రెండు పాత్రలతో తెరపై పండించిన కామెడీకి పడి పడి నవ్వుకుంటాం. నాయుడు పాత్రలో నటించిన యజుర్వేద్ గుర్రం, చౌదరి పాత్రలో జీవించిన రాజ్ కుమార్ కసిరెడ్డి ఆ పాత్రలను గుర్తుండిపోయేలా నటించారు. ఇద్దరికీ మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్నవారిలా నటించారు. సినిమాలో మిగిలిన పాత్రల కోసం కూడా అందరూ కొత్త వారినే తీసుకున్నారు. డాక్టర్ అల్లుడు, హీరో, హీరోయిన్ తండ్రి పాత్రలు ఇలా ప్రతీ పాత్ర సినిమాకి న్యాయం చేసింది.
undefined
టెక్నికల్ గా.. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ టెక్నీషియన్ ని మెచ్చుకొని తీరాల్సిందే. దర్శకుడి కథను నమ్మి దానికి తెరపై ప్రాణం పోసింది టెక్నికల్ టీమ్. సంగీతం దర్శకుడు జై క్రిష్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం మంచి అనుభూతి కలిగిస్తుంది. నేపధ్య సంగీతం సింపుల్ గా ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ అయ్యేలా చేసింది. సినిమాలో ప్రతీ పాట వినసొంపుగా ఉన్నాయి.
undefined
విద్యా సాగర్ చింతా, అమర్ దీప్ గుత్తుల ఛాయాగ్రహణం సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్. పల్లెటూరి అందాలను కెమెరాలో బంధించిన తీరు ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అవుట్ పుట్ ని అందించడంలో సక్సెస్ అయ్యారు. టీమ్ అంతా కొత్త వారైనప్పటికీ వాళ్లని నమ్మి మనో వికాస్ పెట్టుబడి పెట్టడం అభినందించాల్సిన విషయం. వీరికి సురేష్ ప్రొడక్షన్స్ చేయూత కలిసొచ్చింది. దర్శకుడు అనుకున్న కథను సైడ్ ట్రాక్ లు పట్టించకుండా అందంగా రూపొందించాడు.
undefined
ఓవరాల్ గా.. మొత్తంగా చూసుకుంటే చాలా రోజుల తరువాత పల్లెటూరి నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా చక్కటి అనుభూతిని కలిగించింది. అక్కడక్కడా స్లోగా అనిపించినప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగించడంలో చిత్రబృందం విజయాన్ని అందుకుంది.
undefined
రేటింగ్ : 35
undefined
click me!