
Premistava Movie Review: స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ `నెసిప్పాయా`.ఈ మూవీ ద్వారా ఆకాష్ మురళీ(నటుడు మురళీ కొడుకు, అథర్వ మురళీ తమ్ముడు) హీరోగా పరిచయం అవుతున్నారు. కల్కి కొల్చిన్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి విష్ణు వర్థన్ దర్శకత్వం వహించారు.
డాక్టర్ ఎస్ జ్ఞావియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలైన ఈ మూవీని తెలుగులో `ప్రేమిస్తావా` పేరుతో గురువారం(జనవరి 30న) విడుదల చేశారు. మైత్రీ మూవీమేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
దియా(అదితి శంకర్) డాన్స్ చేస్తుండగా తొలి చూపులోనే పడిపోతాడు అర్జున్(ఆకాష్ మురళీ). కట్ చేస్తే ఆమె కాలేజీలోనే చేరతాడు. ఆమె వెంటపడుతుంటాడు. లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు. మొదట్లో తిరస్కరిస్తుంది దియా. తనకు ఇవన్నీ సెట్ కావని, ఆ తర్వాత తనకు ఆల్‌రెడీ ఎంగేజ్‌మెంట్ అయ్యిందని చెబుతుంది. అయినా వెంటపడుతూనే ఉంటాడు.
కానీ ఆమెకి ఎంగేజ్‌మెంట్ కాలేదని, వాళ్ల అమ్మద్వారా తెలుసుకుంటాడు. ఆ తర్వాత అర్జున్ ని చూడకుండా దియా ఉండలేదు. ఇద్దరు కలుసుకుంటారు. తనకు గతంలోనూ బ్రేకప్ అయ్యిందని, ఈ రిలేషన్‌పై నమ్మకం లేదని చెబుతుంది. అయినా లివింగ్ రిలేషన్‌కి ఒప్పుకుంటుంది. ఇద్దరూ సిటీలో జాబ్ చేస్తుంటారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసి తిరుగుతారు. ఘాటుగా ప్రేమించుకుంటారు.
అయితే జాబ్ విషయంలో తన కంపెనీ నుంచి ఫోర్చుగల్ వెళ్లే అవకాశం దియాకి వస్తుంది. దీంతో తాను వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే తాను కూడా వస్తానని ఫోర్స్ చేస్తాడు అర్జున్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థాలు పెరుగుతాయి. బ్రేకప్ చెబుతారు. దియా పోర్చుగల్ వెళ్లిపోతుంది. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత ఓ హత్య కేసులో దియా అరెస్ట్ అవుతుంది.
ఇది చూసి అర్జున్ తట్టుకోలేకపోతాడు. ఆమె కోసం ఫోర్చుగల్ వెళ్తాడు అర్జున్. దియాని కలిసే ప్రయత్నం చేస్తాడు. ఆమెని ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి మళ్లీ దియాని అర్జున్ కలిశాడా? ఆమెని బయటకు తీసుకువచ్చాడా? దియా ఎందుకు హత్య చేసింది? హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఆయనకు శరత్ కుమార్, ఖుష్బూలకు ఉన్న సంబంధమేంటి? దియా, అర్జున్ మళ్లీ ఒక్కటయ్యారా? అసలేం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`ప్రేమిస్తావా` మూవీ తమిళంలో `నెసిప్పయా`( Nesippaya)గా ఈ సంక్రాంతికి విడుదలైంది. అక్కడ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అయితే ఇందులోని కంటెంట్ యూనివర్సల్. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యువత ఇలానే ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి.
అందుకే తెలుగులోకి తీసుకొచ్చింది టీమ్. సిటి కల్చర్‌ని తలపించేలా హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, వారి జర్నీ ఉంటుంది. సినిమా ప్రజెంట్ నుంచి పాస్ట్ కి వెళ్తుంది. బ్రేకప్ చెప్పుకున్నాక ఎవరి లైఫ్ వాళ్లు జీవిస్తుంటారు. అర్జున్ తన కంపెనీలో బిజీగా ఉంటాడు. ఇంతలోనే దియా అరెస్ట్ అయినట్టు చూస్తాడు.
దీంతో ఆమె కోసం పోర్చుగల్ వెళ్లిపోతాడు. ఈ ఎలిమెంట్లు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. వీరి మధ్య ఏం జరిగిందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీంతో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తారు. దియా, అర్జున్ ఎలా కలిశారు? ఎలా ప్రపోజ్ చేసుకున్నారు? ఎలా ప్రేమించుకున్నారు? అనేది కాస్త రొమాంటిక్ వేలో, ట్రెండీగా చూపించారు. ఆయా ఎలిమెంట్లు ఈ జనరేషన్ యూత్‌ని ఆకట్టుకునే ఉంటాయి.
సెకండాఫ్‌లో కూడా వారి మధ్య ఘర్షణ, విడిపోవడం, ఆ తర్వాత అరెస్ట్ అయిన దియాని విడిపించేందుకు అర్జున్ ప్రయత్నించడం వంటి సీన్లతో సాగుతుంది.సెకండాఫ్ మొత్తం ఫోర్చుగల్‌లోనే సినిమా సాగుతుంది. దియా కోసం అర్జున్ పడే బాధ, తపన, స్ట్రగుల్ హృదయాన్ని హత్తుకుంటాయి. ప్రేమికులను కట్టిపడేస్తాయి. యువతని ఎంగేజ్ చేస్తాయి.
ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మరింత ఆకట్టుకునే ఎలిమెంట్. సినిమాకి హైలైట్. అయితే సినిమా ఫస్టాఫ్ నుంచి ఎండింగ్ వరకు స్లోగా సాగడమే మైనస్‌గా చెప్పొచ్చు. ఫీల్ కోసం, ఆ ప్రేమికుల మధ్య ఇంటెన్సిటీ ఆడియెన్స్ కి అర్థమవడం కోసం స్లోనెరేషన్ ఎంచుకున్నారు. కానీ సినిమాకి అది మైనస్‌గా మారింది. మరోవైపు లవ్ లోనూ ఫీల్ తగ్గింది. ఆ రొమాంటిక్ ఫీల్ ఆడియెన్స్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. ఎమోషన్స్ విషయంలో కూడా ఇంకా బాగా వర్క్ చేయాల్సింది.
ప్రధానంగా రొటీన్ స్టోరీతో సినిమాని నడిపించారు. కథ విషయంలో కొత్తగా చేయాల్సింది. కానీ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. ట్విస్ట్ లతో మరింత రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అదే సినిమాకి రిలీఫ్‌నిచ్చే పాయింట్.
ఆర్టిస్టులుః
అర్జున్ పాత్రలో ఆకాష్ మురళీ బాగా చేశారు. హీరోగా తొలి చిత్రం అయినా, అనుభవం ఉన్న నటుడిగా మెప్పించారు. లవర్ బాయ్‌గా సహజంగా చేసి మెప్పించాడు. చాలా సన్నివేశాల్లో చాలా హుందాగానూ కనిపించి మెప్పించాడు. హీరోగా కంటే నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పొచ్చు. నటుడిగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక దియా పాత్రలో అదితి శంకర్ ఒదిగిపోయింది. మెస్మరైజ్ చేసింది. విభిన్న భావోద్వేగాలతో ఆకట్టుకుంది. పాత్రలో జీవించింది.
కీలక పాత్రలో కల్కి కొచ్లిన్‌కి మంచి పాత్ర దక్కింది. ఆమె అంతే బాగా చేసింది. దగ్గుబాటి రాజా ఓ కొత్త షేడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. శరత్ కుమార్, ఖుష్బులు తమదైన యాక్టింగ్‌తో మెప్పించారు. క్లైమాక్స్ లో అదరగొట్టారు. గెస్ట్ రోల్‌లో ప్రభు కాసేపు మెరిశారు. మిగిలిన ఆర్టిస్టులు ఓకే అనిపించారు. కానీ సినిమా మొత్తం ఆకాష్, అదితి పాత్రల మీదనే తిరుగుతుంది. వారి నటనే సినిమాకి ప్రాణం.
టెక్నీషియన్లుః
దర్శకుడు విష్ణు వర్థన్ ఎంచుకున్న కథ కొత్తగా లేదు. పైగా స్లోగా సినిమాని నడిపించారు. చాలా ల్యాగ్ అనిపిస్తుంది. లవ్‌లో ఎమోషన్స్ ని, ఫీల్‌ని పట్టుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. కానీ కొన్ని ఎలిమెంట్లు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్ ఎలిమెంట్లు, డైలాగులు బాగున్నాయి. క్లైమాక్స్ ఫినిషింగ్ బాగుంది. ట్విస్టులు ఆకట్టుకున్నాయి.
కెమెరా వర్క్ చాలా గ్రాండియర్‌గా ఉంది. మ్యూజిక్ వినసొంపుగా ఉంది. బీజీఎం సైతం బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమా చిన్నదే అయినా రాజీపడకుండా నిర్మించారు. బాగా ఖర్చు పెట్టారు. ఆ విషయం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది.
ఫైనల్‌గాః యూత్‌ని నచ్చే మూవీ.
రేటింగ్‌ః 2.5