
తరుణ్ భాస్కర్ దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు హీరోగానూ బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన హీరోగా `ఓం శాంతి శాంతి శాంతిః` చిత్రంలో నటించారు. ఇందులో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించడం విశేషం. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని, అనుప చంద్రశేఖరన్, సాధిక షేక్, నవీన్ శనివారపు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు శుక్రవారం(జనవరి 30న) ఈ మూవీ విడుదలైంది. మలయాళంలో వచ్చిన `జయ జయ జయహే` అనే చిత్రానికిది రీమేక్. రీమేక్‌లు వర్కౌట్ కానీ ఈ రోజుల్లో తరుణ్ భాస్కర్ టీమ్ రిస్క్ చేసింది. మరి ఆ రిస్క్ సక్సెస్ అయ్యిందా? సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) గోదావరి జిల్లాల్లో పేరున్న చేపల వ్యాపారి. ఆయనకు కోపం ఎక్కువ. ఇక ప్రశాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పట్నుంచి స్వేచ్ఛకి, సమానత్వానికి, స్వతంత్య్రానికి దూరంగా పెరుగుతుంది. తన ఇష్టాలకు ఇంట్లో ప్రయారిటీ ఉండదు. దీంతో బాధపడుతూ ఉంటుంది. కాలేజీలో లెక్చరర్ చెప్పిన మాటలు నచ్చి ఆయన్ని ఇష్టపడుతుంది. కానీ చివరికి అతను కూడా తన స్వేచ్ఛకి ప్రయారిటీ ఇవ్వడు. ప్రశాంతి కాలేజీలో లెక్చరర్‌ని ఇష్టపడుతుందని తెలిసి ఆమెని ఓంకార్ నాయుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి కూడా బలవంతంగానే జరుగుతుంది. భర్త తనని ఏమాత్రం అర్థం చేసుకోడు, ప్రేమగా మాట్లాడడు. దీంతో పెళ్లి అయినా ఫస్ట్ నైట్‌కి దూరంగానే ఉంటారు. ఓంకార్ నాయుడిది డామినేటింగ్ మనస్తత్వం. ఇంట్లో ఏదైనా తనకు నచ్చినట్టుగానే జరగాలి, లేదంటే కోపం వస్తుంది. ప్రశాంతి తన ఇంట్లోకి వచ్చాక రోజు రోజుకి అన్నీ మార్చేస్తుంది. ఇది తట్టుకోలేకపోతాడు. కొన్ని రోజుల తర్వాత కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ప్రతిదానికి కొడుతూనే ఉంటాడు. ఈ విషయం అమ్మగారింట్లో చెబితే భర్తతో ఇలాంటివి మామూలే సర్దుకొని పోవాలని చెబుతారు. ఇలా లాభం లేదని చెప్పి కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని భర్తని చితకబాదుతుంది ప్రశాంతి. ఫిజికల్‌గా భార్యని ఏం చేయలేనని తెలిసి ఆమెని తల్లిని చేస్తే ఇంట్లో పడి ఉంటుంది, అప్పుడు చెప్పినట్టు వింటుందని తన మామ(బ్రహ్మాజీ) సలహా మేరకు ఆ ప్లాన్ చేస్తాడు నాయుడు. మరి ఆ ప్లాన్ ఫలించిందా? ఇది ప్రేమ కాదు, ప్రతీకారం అని తెలిసి ప్రశాంతి ఎలా రియాక్ట్ అయ్యింది? వీరిద్దరు కోర్ట్ మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఓంకార్ నాయుడికి ప్రశాంతి ఎలా చుక్కలు చూపించింది? అనేది మిగిలిన కథ.
`ఓ శాంతి శాంతి శాంతిః` ఆద్యంతం ఫన్నీగా సాగుతూనే మహిళా స్వేచ్ఛ, సమానత్వాన్ని చర్చించే మూవీ. సినిమా మొత్తం హ్యూమర్‌తో సాగుతుంది. మహిళలకు సంబంధించిన సందేశం అంతర్లీనంగా ఉంటుంది. మెయిన్‌గా కామెడీని నమ్ముకొని సినిమా తీశారు. ఆ కామెడీని వర్కౌట్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ యాసతో, తెలంగాణ నేపథ్యంలో సినిమాలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కోస్తా ప్రాంతం బ్యాక్ డ్రాప్ కావడంతో డిఫరెంట్ ఫీలింగ్‌ని ఇస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చాలా నేచురల్‌గా సాగుతుంది. అక్కడ పల్లె పరిస్థితులను ఆవిష్కరిస్తూ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. హీరోహీరోయిన్ల వ్యక్తిత్వాలను ఆవిష్కరించారు. హీరోయిన్ ఫ్యామిలీ నేపథ్యాన్ని, పెరిగిన తీరుని ఆవిష్కరించారు. అడగడుగునా అమ్మాయిల విషయంలో ఫ్యామిలీ ఎలాంటి నిబంధనలు పెడతారు? అనేది ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. అయితే దాన్ని ఒక ఫన్నీ వేలోనే చూపించడం విశేషం. గోదావరి నేపథ్యం సినిమాకి అసెట్‌గా చెప్పొచ్చు. అక్కడి వాతావరణం, మనుషుల తీరు, చేపల వ్యాపారం వంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసి సహజత్వాన్ని తీసుకొచ్చారు. విజువల్‌గా హాయి ఫీలింగ్‌ని తెప్పిస్తారు. అదే సమయంలో సగడు మధ్య తరగతి కుటుంబంలో ఉండే పరిస్థితులను కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించారు. మనుషులు ఎంత మొరటుగా, డామినేటింగ్‌గా ఉంటారనేది, అదే సమయంలో అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి? ఎలా పెరగాలనే కుటుంబ సభ్యులు పెట్టే రిస్టిక్షన్స్ ని బాగా చూపించారు. ఫస్టాఫ్ అంతా సరదాగా తీసుకెళ్లారు. హీరోహీరోయిన్ల మధ్య పెళ్లి చూపులు, పెళ్లి తర్వాత భార్య ఇష్టాలకు భర్త ప్రయారిటీ ఇవ్వకపోవడం, కొట్టడం వంటి సంఘటనలతో సాగుతుంది. అవి ప్రతి ఒక్కరి లైఫ్‌ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ లో చిన్న ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని హీరోని చితకబాదటం, ఈ క్రమంలో హీరో పడే స్ట్రగుల్స్, బయటకు చెప్పుకోలేక, ఆ పెయిన్ భరించలేక ఆయన పడే బాధలు నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత పిల్లలు కనే ప్రయత్నం, భార్యని దగ్గర చేసుకునే ప్రయత్నం వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి. మహిళా తలుచుకుంటే ఏదైనా సాధించగలదనేది క్లైమాక్స్ చూపించిన తీరు బాగుంది.
సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య వచ్చే సన్నివేశాలు కొంత వరకు నవ్వులు పూయించాయి. హీరో చెల్లి, అమ్మ చెప్పే డైలాగ్‌లు కామెడీగా ఉంటాయి. దీంతోపాటు ఈషాని తరుణ్ కొట్టడం, మూర్ణంగా వ్యవహరించడం కొంత వరకు ఎంగేజింగ్‌గా ఉన్నాయి. బ్రహ్మాజీ ఉన్న సీన్లు నవ్వించేలా ఉంటాయి. తరుణ్‌ని ఈషా కొట్టే సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. కానీ సినిమా ఆద్యంతం ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యింది. కొన్ని చోట్ల మాత్రమే కామెడీ వర్కౌట్ కానీ సినిమా ఆసాంతం నవ్వులు పూయించడంలో విఫలమయ్యింది. చాలా బలవంతపు కామెడీగా ఉంటుంది. చాలా చోట్ల హ్యూమర్‌కి, ఫన్‌కి ఆస్కార్ ఉన్నా, వర్కౌట్ కాలేదు. ఆ రియాలిటీ మిస్ అయ్యింది. సినిమా చాలా సాగదీసినట్టుగా ఉంటుంది. స్లోగా సాగుతుంది. రిపీటేషన్ ఎక్కువైపోయింది. భార్యాభర్తలు కొట్టుకునే సీన్లలోనూ కొంత వరకే కామెడీ పండింది. కోస్తాంధ్ర యాస బలవంతంగానే పెట్టినట్టు ఉంటుంది. దీనికితోడు క్లైమాక్స్ కూడా అర్థాంతరంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎంట్రీ స్పెషల్ ఎట్రాక్షన్. సినిమా ప్రారంభం నుంచి ఎమోషన్, ఫీల్ అనేది మిస్ అయ్యింది. సినిమాతో ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఆయా సీన్లని ఎంజాయ్ చేస్తారు,ఆస్వాధిస్తారు. కనెక్ట్ కాలేకపోతే, తెరపై జీవం లేని సీన్లే కనిపిస్తాయి. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. 70శాతం మూవీ జీవం లేనట్టుగానే సాగిపోతుంది. అందుకే ఆడియెన్స్ అంతగా కనెక్ట్ కాలేకపోతారు. క్లైమాక్స్ లో అయినా ఇంకా బెటర్‌గా ప్లాన్ చేయాల్సింది. కామెడీ వర్కౌట్ అయితే మిగిలినవి ఎవరూ పట్టించుకోరు, అది పండకపోతే ఏం చేసినా తేలిపోతుంది. ఇందులో కథా బలం కంటే నటీనటులు సినిమాని కొంత వరకు నిలబెట్టారని చెప్పొచ్చు.
ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ అదరగొట్టాడు. కోస్తాంధ్ర యాసలో ఇరగదీశాడు. యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ పరంగా అచ్చు దించేశాడు. రియల్ లైఫ్ పాత్రని చూస్తున్నట్టుగా ఉంది. తాను బాధపడుతూ, నవ్వులు పూయించే విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ప్రశాంతిగా ఈషా రెబ్బా ఇరగదీసింది. ఈ మూవీకి ఈషానే హీరో అనేలా ఆమె పాత్ర సాగింది. సినిమా మొత్తం చాలా సెటిల్డ్ గా చేసింది. ఎక్స్ ప్రెషన్స్ తోనే మెప్పించింది. యాక్షన్ పరంగానూ అదరగొట్టింది. చాలా వరకు పరిణతితో కూడిన నటన ప్రదర్శించింది. ఆమెకిది యాక్టింగ్ పరంగా బెస్ట్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. బ్రహ్మాజీ కామెడీ ఫర్వాలేదు. తనదైన స్టయిల్‌లో ఇరగదీశాడు. ఇక మిగిలిన పాత్రలు మెప్పించాయి. నవ్వించాయి. అలరించాయి. కొన్ని చిరాకు తెప్పించాయి. ఉన్నంతలో ఆర్టిస్ట్ లే ఈ మూవీని కొంత వరకు నిలబెట్టారని చెప్పొచ్చు.
జయ్ క్రిష్ణ మ్యూజిక్ ఫర్వాలేదు. పాటలు ఓకేలా ఉన్నాయి. బీజీఎం బాగుంది. దీపక్ యరగీర కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. రియల్ లొకేషన్లని చూసినట్టుగా ఉంది. సహజత్వంగా పిక్చరైజ్ చేశారు. ఎడిటింగ్ పరంగా మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొంత ట్రిమ్ చేయోచ్చు. దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకుడిగా సినిమాని బాగానే డీల్ చేశాడు. కానీ కామెడీని వర్కౌట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. సినిమా మొత్తాన్ని లైటర్ వేలో తీసుకెళ్లారు. ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు, హీరోయిన్ పెయిన్ తెరపై హైలైట్ కాలేదు. ఫన్ చాలా చోట్ల తేలిపోయింది. కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయ్యింది. అయితే అమ్మాయిల విషయంలో తాను చెప్పాలనుకున్న సందేశం బాగుంది. దాన్ని మరింత ఎఫెక్టీవ్‌గా, ఎమోషనల్‌గా చెబితే బాగా కనెక్ట్ అయ్యేది. నిర్మాణ విలువలకు కొదవ లేదు.
మహిళల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వానికి సంబంధించిన సందేశం విషయంలో సక్సెస్ అయిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయడంలో, నవ్వించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
రేటింగ్- 2.5