నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ రివ్యూ

First Published | Aug 9, 2024, 11:58 AM IST

మెగా డాటర్ నిహారిక ఇప్పటి వరకు నటిగా రాణిస్తూ వచ్చారు. తొలిసారి ఆమె నిర్మాతగా అవతారం ఎత్తారు. నిహారిక నిర్మాతగా చేసిన తొలి చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'.నిహారిక నిర్మాతగా, యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. 

మెగా డాటర్ నిహారిక ఇప్పటి వరకు నటిగా రాణిస్తూ వచ్చారు. తొలిసారి ఆమె నిర్మాతగా అవతారం ఎత్తారు. నిహారిక నిర్మాతగా చేసిన తొలి చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ చిత్రంకోసం నిహారిక చాలా గ్రాండ్ గా ప్రమోషన్స్ నిర్వహించింది. బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిహారిక నిర్మాతగా, యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. 

కథ : 

కమిటీ కుర్రోళ్ళు చిత్ర కథ విలేజ్ నేపథ్యంలో సాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పురుషోత్తపల్లి అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 12 ఏళ్ళకి ఒకసారి జాతర జరగడం సాంప్రదాయం. ఆ ఊర్లో శివ( సందీప్ సరోజ్), సూర్య( యాశ్వంత్ పెండ్యాల),సుబ్బు ( త్రినాథ్ వర్మ) , విలియమ్ (ఈశ్వర్ రాచిరాజు), పెద్దోడు( ప్రసాద్ బెహరా) మంచి స్నేహితులుగా ఉంటారు. జాతరలో ఆత్రం అనే యువకుడు మరణిస్తాడు. దీనితో ఊర్లో ఒక్కసారిగా ఘర్షణలు మొదలవుతాయి. 


ప్రాణ మిత్రులుగా ఉన్న వీరి మధ్య ఈ సంఘటనతో ఒక్కసారిగా దూరం పెరుగుతుంది. ఈ ఊర్లో సాయి కుమార్ చాలా ఏళ్లుగా సర్పంచ్ గా ఉంటారు. ఈ ఘటనలతో ఊర్లో రాజకీయ రగడ కూడా మొదలవుతుంది. కులాల మధ్య చిచ్చు మొదలవుతుంది. అసలు ఈ గొడవలు జరగడానికి కారణం ఎవరు ? స్నేహితులు ఎందుకు విడిపోయారు ? స్నేహితులుగా ఉన్న వీరికి కులాలు, రాజకీయాలు రంగు ఎలా పులుముకుంది ? ఇందులో సాయి కుమార్ పాత్ర ఎంత వరకు ఉంది ? స్నేహితులు తిరిగి మళ్ళీ ఒక్కటవుతారా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ : 

80, 90 దశకం నాటి కథలకు ఇప్పుడు మాంచి డిమాండ్ ఉంది. విలేజ్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, కథనంతో ఆకట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనిని అర్థం చేసుకున్న దర్శకుడు యదు వంశీ 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రాన్ని ప్లాన్ చేసుకుని చక్కగా ప్రజెంట్ చేశాడు. మొబైల్ ఫోన్లు లేని కాలంలో స్నేహితుల మధ్య జరిగే సంభాషణలు.. పల్లెటూరు వాతావరణం లాంటి అంశాలని చూపిస్తూ మంచి కథని అందించడంలో మార్కులు కొట్టేశారు. 

జాతరలో కుర్రాళ్ళు చేసే అల్లరి నవ్విస్తుంది. అదే విధంగా స్నేహం కోసం వీళ్ళు ఎంతదూరమైనా వెళతారు అనే సన్నివేశాలని కూడా దర్శకుడు హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. అప్పట్లో పల్లెటూర్లలో కల్మషం లేని మనుషులే కనిపిస్తారు. కానీ కులాల పేరుతో జరిగిన రాజకీయ సంఘటనలని చాలా సార్లు విన్నాం. అదే తరహాలో స్నేహితుల మధ్య చిచ్చు రగిల్చే అంశాలు ఉత్కంఠ భరింతంగా ఉంటాయి. 

డైరెక్టర్ ని మరో విషయంలో కూడా అభినందించవచ్చు. ఇలాంటి విలేజ్ డ్రామా నడిపిస్తూనే లోలోపల చక్కటి సందేశాన్ని ఇచ్చారు. రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేశారు. ప్రతిభ ఉన్నా చదువుకోలేని స్థితిలో కొందరు కుర్రాళ్ళు, పిల్లలు ఉన్నారనే అంశాన్ని చూపించారు. ఈ చిత్రంలో పల్లెటూరు నేపథ్యంలో వచ్చే రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరమైన డైలాగులు ఉంటాయి. ఆ డైలాగులు వింటే ఇప్పటి రాజకీయ నాయకులు, పరిస్థితులు తప్పకుండా గుర్తుకు వస్తాయి. 

ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయంతో, పల్లెటూరి సన్నివేశాలతో చాలా బాగా సాగిపోతుంది. కథలో సంఘర్షణ మొదలైనప్పుడు ఉత్కంఠ భరింతంగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ ని మంచి ట్విస్ట్ తో ఎండ్ చేయడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ అక్కడక్కడా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ కి కాస్త పని పెట్టి ఉంటే ఈ లోపం కూడా ఉండేది కాదు. 

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

ఈ చిత్రంలో అంతా కొత్త కుర్రాళ్ళు నటించారు. పల్లెటూరి కుర్రాళ్ళుగా ఎవరి పాత్రల్లో వాళ్ళు ఒదిగిపోయారు. ఈ కథలో మొత్తం 11 మంది కుర్రాళ్ళు కీలకంగా ఉంటారు. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు అన్నట్లుగా నటించారు. సాయి కుమార్ తన అనుభవంతో సర్పంచ్ పాత్రలో అదరగొట్టారు. సందీప్ సరోజ్, యాశ్వంత్, త్రినాథ్, ఈశ్వర్ ల పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. 

టెక్నికల్ గా : 

కమిటీ కుర్రోళ్ళు చిత్రం విషయంలో ముందుగా మార్కులు వేయాల్సింది దర్శకుడు యదు వంశీకే. ఆయన సిద్ధం చేసుకున్న కథ, డైలాగులు, విలేజ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుకోవడం ప్రతి అంశం వర్కౌట్ అయింది. కథలో హ్యూమర్ ని, భావోద్వేగాల్ని, రాజకీయ అంశాలని, స్నేహాన్ని, సందేశాన్ని, రిజర్వేషన్స్ అంశాన్ని మిక్స్ చేయడం చాలా బావుంది. దీపక్ దేవ్ అందించిన సంగీతం కూడా బావుంది. ఇక కెమెరా మెన్ గోదావరి అందాలు చూపిస్తూ మంచి విజువల్స్ రాబట్టారు. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఒక్కటే మైనస్. 

ఓవరాల్ గా :

'కమిటీ కుర్రోళ్ళు' నవ్విస్తూనే బలమైన భావోద్వేగాలతో కట్టిపడేసారు. ఆకట్టుకునే విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిస్ కావద్దు. 

రేటింగ్ : 3/5 

నటీనటులు:

సందీప్ సరోజ్, ఈశ్వర్ రచిరాజు, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా,సాయికుమార్, మణికంఠ పరశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరణ్, అక్షయ్ శ్రీనివాస్, తేజస్వీ రావు, షణ్ముకి, రాధ్య, విశిక, తదితరులు. 

Latest Videos

click me!