#KrishnaVrindaVihari: నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’రివ్యూ

First Published | Sep 23, 2022, 1:34 PM IST

ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన  లేటెస్ట్ చిత్రాల్లో డ్ హీరో నాగ శౌర్య హీరోగా మరో యంగ్ బ్యూటీ షిర్లే షెటియా హీరోయిన్ గా నటించిన యూత్ ఫుల్ రొమాంటివ్ ఎంటర్టైనర్ చిత్రం “కృష్ణ వ్రింద విహారి” కూడా ఒకటి. 

Krishna Vrinda Vihari Telugu Movie Review


ఏ టైప్ సినిమాలు చేయాలి..ఏవి తన నుంచి జనం ఏమి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. జనం మూడ్ ఎలా ఉంది... ఏ సినిమాలు ఆడుతున్నాయి... రొమాంటిక్ కామెడీ చేద్దామా, క్రైమ్ థ్రిల్లర్ చేద్దామా వేరే కొత్త జానర్ ట్రై చేద్దామా...అనేది ఖచ్చితంగా ఏ హీరోకైనా ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు వచ్చే సందేహమే. అలాంటప్పుడు సేఫ్ సైడ్ కే టర్న్ తీసుకుంటారు. బడ్జెట్ కంట్రోలులో ఉండి కాలక్షేపంగా నడిచే మినిమం గ్యారెంటీ సబ్జెక్టుని ఎత్తుకుంటారు. అయితే రాజీ ఎప్పుడైతే పడ్డారో అప్పుడే అన్నీ వెనక్కి వెళ్లిపోతాయి. ‘లక్ష్య’ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకున్న నేపధ్యంలో  సొంత బేనర్లో చేసిన ‘కృష్ణ వ్రింద విహారి’ మీదే నాగశౌర్య ఆశలన్నీ నిలిచాయి. ‘అలా ఎలా’ ఫేమ్ అనిల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అందమైన ప్రోమోలతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా  ఎలా ఉందో చూద్దాం. 

కథాంశం:

 కృష్ణాచారి (నాగశౌర్య) సినిమాల్లో కనిపించే సనాతన సంప్రదాయాలు పాటించే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబ కుర్రాడు. అమ్మ అమృతవల్లి (రాధికా శరత్ కుమార్)మాట అతనికి అమృతతుల్యం, ఊళ్లో వాళ్లకి వేదవాక్కు. పశ్చిమగోదావరి జిల్లా గోపవరం అగ్రహారంలో పుట్టి పెరిగిన ఈ బ్రాహ్మణ బిడ్డ...తల్లి చాటు నుంచి హైదరాబాద్‌కు షిప్ట్ అవుతాడు. మడి,ఆచారాలు...బాగా సంప్రదాయాలు వంటపట్టించుకున్న  కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు అన్నారు కదా.. ఏ గుళ్లోనో జాబ్ కు వెళ్తున్నాడు అనుకునేరు..అలాంటిదేమీ లేదు... ఈకాలం మిగతా కులాల కుర్రాళ్లలాగే చక్కగా  ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్ గా సాఫ్ట్ వేర్ జాబ్ కు వెళ్తాడు. అక్కడ ప్రాజెక్టు లీడర్ గా చేస్తున్న నార్త్ అమ్మాయి  వ్రింద శర్మ (షిర్లే సేతియా)తో ప్రేమలో పడి పులిహార కలపటం మొదలెడతాడు. ఆమెకు ఓ సమస్య ఉంటుంది. అదేమిటంటే..ఆమెకు పిల్లలు పుట్టరు. ఆమె పాపం నిజాయితీగా..ఆ విషయం చెప్పి..మీ ఇంట్లో చెప్పు...వాళ్లు ఓకే అంటే అప్పుడు ఒకటి అవుదాం అంటుంది. 



అయితే ఆ విషయం ఇంట్లో చెప్తే పెంట అయ్యిపోతుందని , తన ప్రేమను ప్రక్కన పెట్టేస్తారని భావించి, ఊహించి, వేరే అబద్దం ఆడాలని ప్లాన్ చేస్తాడు. తన ఇంట్లో ఏర్పడిన ఒక అనుకోని ఇబ్బందితో తనకు పిల్లలు పుట్టరు, క్రికెట్ ఆడుతున్నప్పుడు తన మగతనం కోల్పోయానని తన బంధువైన డాక్టర్(వెన్నెల కిషోర్)తో అబద్ధం చెప్పిస్తాడు. పెళ్లి అయ్యిన తర్వాత అంతా సెట్ అయ్యిపోయింది బాగుంది అనుకున్న సమయంలో హైదరాబాద్ వస్తుంది కృష్ణాచారి తల్లి అమృతవల్లి. అక్కడ నుంచి కథ మలుపు తిరిగుతుంది.  ఆమె వచ్చిన తర్వాత అసలైన  అత్తాకోడళ్ల  గొడవలు ప్రారంభమవుతాయి.  
 


ఆ ఇంటికి కోడలుగా వచ్చిన వ్రింద కు  సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆమె తన కొలిగ్స్ తో సోషల్ గా ఉండటం ....మన హీరో తల్లికి నచ్చదు...అలాంటివి ఈ మోడ్రన్ అమ్మాయి..ట్రెడిషనల్ ఫ్యామిలీ మధ్య సమస్యలు మొదలవుతాయి. ఈ క్రమంలో కృష్ణాచారి ఏం చేసాడు. తమ ఆచారాలను మంటకలుపుతోందని మండిపడుతున్న తల్లికి సర్ది చెప్పాడా..అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియురాలికు సర్ది చెప్పుకున్నాడా...ఆఖరుకి తను దాచిన నిజం...తను ఆడిన అబద్దం....ఆమెకు పిల్లలు పుట్టరనే విషయం ఇంట్లో తెలిసాక ఏ సమస్యలు వచ్చాయి. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే...:

ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని  ఇంట్లో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఇరుక్కుపోవటం అనే కాన్సెప్టుతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి..భవిష్యత్ లోనూ వస్తాయి. అయితే ఎంత గొప్పగా,కొత్తగా...మోడ్రన్ గా ..ఈ పాయింట్ ని డీల్ చేసామనేదే ఎప్పుడూ ఇంపార్టెంట్. ఆ విషయంలో ఈ సినిమా పూర్తి స్దాయిలో సక్సెస్ కాలేదు. కొంతవరకూ తన టార్గెట్ ని పూర్తి చేసుకుంది.  రీసెంట్ గా నాని చేసిన అంటే సుందరానికి చూసిన వాళ్లకి ఈ సినిమా కథ కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటిదే అని అర్దమవుతుంది. నావెల్టీ లేదు..ఫార్ములాగా ఉందని చెప్పేస్తారు.  అది ప్రక్కన పెడితే... కథలో కాంప్లిక్ట్స్ బలంగా లేదు. ఈ కాలంలో ఇలాంటివి జరగవా ...జరుగుతున్నాయి. కానీ కుటుంబాల వారు లైట్ తీసుకుంటున్నారు. సమాజంలో వస్తున్న ఆ మార్పులను ఈ సినిమా ప్రతిబింబిచలేకపోయింది. అలాగే కాంప్లిక్ట్స్ సరిగ్గా లేకపోవటంతో...ఎక్కడా అటెన్షన్ మనకు కలగదు. చాలా చోట్ల సీన్స్   తేలిపోయినట్లు అనిపించాయి. 


అలాగే చాలా చిన్న స్టోరీ లైన్ ని..సాగతీసిన ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు మొత్తం కథనం ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది. ఎక్కడా అరే..భలే ఉందే అనిపించే క్షణాలు కనపడవు. కామెడీ కూడా తెగ నవ్వుకునేలా అనిపించదు. అక్కడక్కడా నవ్వించినా ఎక్కువ శాతం ఏమీ లేకుండానే సీన్స్  పర్పస్ లేకుండా నడిచిపోయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే విషయంలో  అస్సలు ఆకట్టుకోలేదు. తల్లా..పెళ్లామా అంటూ వాళ్ల మధ్య హీరో నలిగే సీన్స్ కొన్ని బాగున్నాయి. ఫస్టాఫ్ అంతా ఐటీ ఆఫీస్ సెటప్, అక్కడ కొన్ని పాత్రలతో కొంత ఫన్ జనరేట్ చేసారు.


 సెకండాఫ్ నుంచి కథ కాస్త ఊపందుకుంది. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి మళ్లీ రొటీన్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు.ఇక ఫన్ ని ఎలివేట్ చేసే ప్రాసెస్ లో ఇలాంటి కథలకు అవసరమైన ఎమోషన్స్ ని సైడ్ లైన్ చేసేసారు.  అక్కడక్కడా ఎమోషన్స్ ని గుర్తు పెట్టుకుని ఆ సీన్స్ పెట్టారు కానీ కానీ వర్కవుట్ కాలేదు. ఎమోషన్ ఏంగిల్ మీద కూడా దృష్టి పెట్టి ఉండే బాగుండేది. అయితే నాని  'అంటే సుందరానికీ' విడుదల అయ్యాక...  ఈ 'కృష్ణ వ్రింద విహారి' కథ లో మార్పులు,రీషూట్స్  చేసినట్లున్నారనిపిస్తుంది.
 

టెక్నికల్ గా ...
 
స్క్రిప్టు వైజ్   సినిమా ఫెరఫెక్ట్ గా లేకపోవటంతో డైరక్టర్  తనను తానే దెబ్బ కొట్టినట్లు అయ్యింది.  ఇలాంటి సినిమాలకు అవసరమైన మ్యూజిక్  సైతం సెట్ కాలేదు. సంగీతం యావరేజ్ గా ఉంది. కానీ పిక్చరైజేషన్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్  బాగుంది. సినిమాటోగ్రపీ అద్బుతం కాదు కానీ బాగుంది. డైలాగ్స్  సోసోగా ఉన్నాయి. పైగా కొన్ని సీన్స్ లో కావాలని డైలాగ్స్ రాసినట్లు ఉన్నాయి కానీ సింక్ అయినట్లుగా అనిపించలేదు. ఎడిటింగ్‌ బాగుంది చాలా చోట్ల ఫాస్ట్ గా సినిమా పరుగెత్తించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.   కొన్ని చోట్ల CG వర్క్ తేలిపోయింది.  
 

నటీనటుల్లో : 

నాగశౌర్య ఇలాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌కు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. యాక్షన్ సీన్స్ లో  సిక్స్ ప్యాక్ బాడీ కూడా చూపించారు. హీరోయిన్  షిర్లే సేతియా జస్ట్ ఓకే.  'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ ఫన్ ఎపిసోడ్స్ బాగా పండాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ నటన నాగశౌర్య తల్లి పాత్రలో రాధిక శరత్ కుమార్  ది. ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది.   సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ స్త్రీ ఇలానే ఉంటుందా అనిపించే విధంగా ఆమె నటన సినిమా మొత్తాన్ని నడిపించింది. జయ ప్రకాష్, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, హిమజ, అన్నపూర్ణమ్మ వంటి వారు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.


ప్లస్ పాయింట్స్ :
రన్ టైమ్ తక్కువ ఉండటం
సెకండ్‌ హాఫ్‌ లో కొన్ని సీన్స్
కామెడీ ట్రాక్‌
క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం

మైనస్ పాయింట్స్ :

సరైన పాటలు లేకపోవటం
సింగిల్ లైన్ కథ,స్క్రీన్ ప్లే
 బలమైన కాంప్లిక్ట్స్, క్యారక్టరైజేషన్స్ లేకపోవటం


ఫైనల్ థాట్ :  

హీరో క్యారక్టరే కాదు..హోల్ సేల్ గా కథ,స్క్రీన్ ప్లే సైతం బ్రాహ్మణత్వం ఆపాదించుకున్నట్లున్నాయి. ఎక్కడా చెప్పుకోదగ్గ రైజ్,ఫాల్ కనపడవు..సాఫ్ట్ గా సోసోగా నడిచిపోతుంది. అసభ్యత, హింస లేవు కాబట్టి ఫ్యామిలీలతో ఓ లుక్కేయచ్చు.  

---సూర్య ప్రకాష్ జోశ్యుల 
Rating:2.5


నటీనటులు : నాగశౌర్య, షిర్లే సేతియా, రాధికా శరత్ కుమార్, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, 'స్వామి రారా' సత్య, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
సంగీతం: మహతి స్వరసాగర్
సమర్పణ : శంకర్ ప్రసాద్ మూల్పూరి 
నిర్మాత : ఉషా మూల్పూరి 
దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ 
Run Time:2h 19m
 విడుదల తేదీ: సెప్టెంబర్ 23, 2022

Latest Videos

click me!