
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయకుడు`(జన నాయగన్). ఆయన సీఎం కావడానికి ముందు ఈ మూవీలో నటించారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లారు. తమిళనాడుకు సీఎం అయ్యారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ ఇబ్బందులతో ఆగిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ గురువారం(జులై 23)న విడుదలైంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించింది. వీరితోపాటు బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇది తెలుగులో వచ్చిన బాలయ్య `భగవంత్ కేసరి` కి రీమేక్. మరి విజయ్ చివరి మూవీ ఎలా ఉంది? అభిమానులను ఆకట్టుకుందా? తెలుగు సినిమాకి మించి ఉందా? ఇందులో కాంట్రవర్సీ ఎలిమెంట్లు ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
దళపతి వెట్రి కొండన్(విజయ్) పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి. విలన్లు అతన్ని ఓ కేసులో ఇరికించి జైల్లో పెడతారు. జైల్లో జైలర్(గౌతమ్ మీనన్)కి దళపతి దగ్గరవుతాడు. అయితే దళపతిని వాళ్ల అమ్మ చివరి చూపుకు తీసుకెళ్లినందుకు జైలర్ సస్పెండ్ అవుతాడు. ఆయన వెళ్తూ వెళ్తూ దళపతి విడుదలయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ జైలర్ వద్దకే వెళ్తాడు దళపతి. ఆయనకు విజ్జి(మమితా బైజు) కూతురు ఉంటుంది. జైలర్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విజ్జి ఒంటరవుతుంది. ఆమె బాగోగులు దళపతి చూస్తాడు. ఆమెతోనే ఉంటాడు. వాళ్ల అమ్మ కోరిక మేరకు విజ్జిని ఆర్మీ ఆఫీసర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటాడు మరోవైపు దేశంలో, తమిళనాడు రాష్ట్రంలో అల్లకల్లోలానికి అంతర్జాతీయ క్రిమినల్ జాన్ హెమ్లర్(బాబీ డియోల్) ప్లాన్ చేస్తాడు. అందుకు స్థానిక రాజకీయ నాయకుడు రోజా రంగస్వామి సపోర్ట్ చేస్తుంటాడు. రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. మత ఘర్షణలకు ప్లాన్ చేస్తారు. మరి దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? తన జాబ్ పోవడానికి కారణం ఎవరు? డిప్యూటీ కమిషనర్ అయిన అమ్రిష్ పూజారి(బాబీ డియోల్) జాన్ హెమ్లర్‌లా ఎలా మారాడు? విజ్జి టాయ్‌ని చూసి ఎందుకు భయపడుతుంది? తన అమ్మ ఎలా చనిపోయింది? టాయ్స్ కి, గన్స్ స్మగ్లింగ్‌కి ఉన్న లింకేంటి? ఇందులో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి విజయ్ చూపించిన అంశాలేంటి? అనేది మిగిలిన కథ.
ఇది తెలుగులో వచ్చిన `భగవంత్ కేసరి`కి రీమేక్ అని సినిమా చూశాక స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సినిమాని కమర్షియల్ యాంగిల్‌లో నడిపించారు. పొలిటీషన్లని కార్పొరేట్ ఎలా నడిపిస్తున్నారనేది జనరల్ కమర్షియల్ యాంగిల్‌లో చూపించారు. కానీ `జన నాయగన్`లో మాత్రం తమిళనాడు రాజకీయాలను అద్దం పట్టేలా తెరకెక్కించారు. రాజకీయ నాయకులు చేసే స్కామ్‌లు, అక్కడి డర్టీ పాలిటిక్స్ ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. వారిపై విజయ్ విమర్శలు చేయడం, వారి ఆటకట్టడి చేసేలా కొన్ని సీన్లు పెట్టారు. బహుశా ఈ సినిమా సెన్సార్ కాకపోవడానికి అదే కారణమని అర్థమవుతుంది. అయితే సినిమా ఫస్టాఫ్ మొత్తం బాలయ్య సినిమానే తలపిస్తుంది. బాబీ డియోల్ పాత్ర బ్యాక్ డ్రాప్ మాత్రం కొత్తగా ఉంటుంది. అతన్ని అంతర్జాతీయ స్మగ్లర్‌గా చూపించారు. అదే ఇందులో కొత్తగా ఉంటుంది. విజయ్ పాత్ర, ఆయన జర్నీ మొత్తం తెలుగు మూవీని తలపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం మళ్లీ భగవంత్ కేసరినే చూసినట్టు ఉంటుంది. కాకపోతే విజయ్ మార్క్ తో సాగుతుంది. ఆయన స్టయిల్, ఎలివేషన్లతో రన్ అవుతుంది. జైల్లో ఫైట్, జైలర్ ఫ్యామిలీకి హీరో దగ్గరగా కావడం, ఆయన చనిపోవడం, చిన్నారి బాధ్యతలు తీసుకోవడం, ఆమెని ఆర్మీకి ట్రైన్ చేయడం వంటివి సేమ్ ఉంటాయి. అందులో కాజల్, ఇందులో పూజా హెగ్డే ఉంటుంది. ఆమె జర్నలిస్ట్ గా కనిపిస్తుంది. ఇందులో విలన్ బాబీ డియోల్‌ని ఓ పోలీస్ అధికారిగా చూపించి, అతనికి అవమానం జరగడంతో డిప్రెషనల్‌లోకి వెళ్లి, అనంతరం క్రిమినల్‌గా మారడం, అలా అంతర్జాతీయ క్రిమినల్‌గా ఎదగడం చూపించారు. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే పొలిటికల్ అంశాలను మాత్రం తమిళనాడు రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో జైల్ సీన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు దగ్గరగా ఉండటం విశేషం. ప్రజలకు సేవ చేయాలని వచ్చిన స్కామ్‌లు చేస్తున్నారని, జనాలను దోచుకుంటున్నారనేది విజయ్ ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. తన మార్క్ మొత్తం సెకండాఫ్‌లో ఉంటుంది. ఇక క్లైమాక్స్ ని మాత్రం వేరే లెవల్‌లో చూపించారు. రోబోలు, డ్రోన్లతో ఫైట్‌ని పెట్టి బాగా హడావుడి చేశారు.
సినిమాగా చూసినప్పుడు చాలా వరకు మన తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కదు. ఆల్‌రెడీ భగవంత్ కేసరి చూడటంతో ఈ మూవీలోని సీన్లు తేలిపోయినట్టు ఉంటాయి. బాలయ్య స్థానంలో విజయ్‌ని ఊహించుకోలేకపోతాం. తెలుగు సినిమానే బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ఫస్టాఫ్ అంతా సాగదీసినట్టుగా, అనిపిస్తుంది. కానీ విజయ్ అభిమానులకు మాత్రం ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు.ఆయన మార్క్ స్టయిల్, మ్యానరిజమ్స్ అన్నీ ఇందులో గట్టిగా పెట్టారు. ఎలివేషన్లు అదిరిపోయాయి. అవి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. విజయ్ మార్క్ డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మమితా బైజుతో వచ్చే ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. వీరి మధ్య బాండింగ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. చిన్నారి విషయంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా బాగుంది. సెకండాఫ్ లో మాత్రం విజయ్ అభిమానులే, ఆయన టీవీకే పార్టీ అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మన కంటే తమిళనాడు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కమర్షియల్ యాంగిల్‌లో కొంత ఫన్, కొంత ఎమోషన్స్, లవ్ ట్రాక్, పాటలు, డాన్సులు పెట్టారు. క్లైమాక్స్ ఫైట్‌ని భారీగా తీశారు. కాకపోతే అంత అవసరం లేదనిపిస్తుంది. విలన్ బ్యాక్ డ్రాప్ ట్రాక్ కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. సినిమాకి సెట్ కాలేదు. ఎండింగ్‌లో టైటిల్ కార్డ్స్ లో విజయ్ గత సినిమాలను గుర్తు చేస్తూ వేసిన వీడియో అభిమానులను ఎమోషనల్‌కి గుర్తు చేస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఇది విజయ్ అభిమానులకు ఒక సెలబ్రేషన్ ఫిల్మ్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇందులో విజయ్ తన పార్టీ పేరు వచ్చేలా `దళపతి వెట్రి కొండన్(టీవీకే) అని పేరు పెట్టుకోవడం విశేషం. పోలీస్ అధికారిగా, ఒక అమ్మాయికి ఫాదర్‌గా విజయ్ బాగా చేశాడు. తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌తో దుమ్మురేపారు. పాటలు, డాన్సులతో అభిమానుల చేత డాన్సులు చేయించారు. అదే సమయంలో మాస్ డైలాగ్‌లు, పొలిటికల్ డైలాగ్‌లతో వారికి ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఉన్నంతలో మెప్పించింది. కానీ తన పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. విజయ్ కూతురుగా మమితా బైజు కనిపిస్తుంది. తెలుగులో శ్రీలీల నటించింది. కాకపోతే శ్రీలీల ముందు మమితా తేలిపోయింది. జైలర్‌గా గౌతమ్ మీనన్ ఉన్న కాసేపు ఆకట్టుకున్నారు. విలన్ గా బాబీ డియోల్ ఇరగదీశాడు. ఆయనకు ఎలివేషన్లు అదిరిపోయాయి. ఓ దశలో హీరోకి మించిన ఎలివేషన్ ఉన్నట్టుగా ఉంటుంది. తనదైన విలనిజంతో మెప్పించాడు బాబీ డియోల్. రాజకీయ నాయకుడు రోజా రంగస్వామిగా ప్రకాష్ రాజ్ ఒదిగిపోయాడు. అంతే బాగా చేసి మెప్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రియమణి కనిపించింది. కనిపించిన కాసేపే అయినా ఆకట్టుకుంది. ఆమె పాత్రలోని ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. సునీల్ పాత్రలోని రెండు షేడ్స్ ఆకట్టుకుంటాయి. ఆయన కూడా మెప్పించారు. మిగిలిన పాత్రధారులు ఫర్వాలేదనిపించారని చెప్పొచ్చు.
సినిమాకి అనిరుథ్ సంగీతం అందించారు. పాటలు ఆకట్టుకున్నాయి. బీజీఎం కూడా బాగుంది. అభిమానులకు ఏం కావాలో, తన మ్యూజిక్ ద్వారా ఇచ్చాడు అనిరుథ్. అయితే పాటలు తెలుగు పాటలను బీట్ చేయలేకపోయాయి. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ కూడా నీట్‌గా ఉంది. పర్‌ఫెక్ట్ గా అన్ని అంశాలను జోడించారు. సినిమాని నీట్‌గా తీసుకెళ్లారు. కేవీన్ ప్రొడక్షన్ సినిమాని రాజీ లేకుండా నిర్మించారు. భారీగా ఖర్చు చేశారు. వారి ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అదే సమయలో నిర్మాత ప్యాషన్ కూడా కనిపిస్తుంది. విజయ్‌కి మంచి ట్రీట్‌లా ఉండేలా ఈ మూవీని ఆయన నిర్మించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలుస్తాయి. దర్శకుడు హెచ్ వినోద్.. ఈ సినిమాని విజయ్‌కి ఎలా కావాలో అలా రూపొందించారు. ఆయనకు పర్‌ఫెక్ట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. చాలా వరకు తెలుగు భగవంత్ కేసరినే ఫాలో అయినా, రాజకీయ అంశాల విషయంలో మాత్రం తమ మార్క్ కనిపిస్తుంది. అక్కడ తాను చేసిన మ్యాజిక్ కనిపిస్తుంది. ఆ విషయంలో వినోద్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అదే సమయంలో ఒక ప్యాక్డ్ కమర్షియల్ సినిమాని విజయ్ అభిమానులకు అందించారని చెప్పొచ్చు.
ఇది విజయ్ రాజకీయ ఎంట్రీకి పర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యేలా రూపొందించిన సినిమా. అదే సమయంలో అభిమానులకు మంచి ఫుల్‌మీల్స్ పెట్టే సినిమా అవుతుంది. వారికి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే సినిమా కూడా అవుతుంది. వారు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలుగు ఆడియెన్స్ కి మాత్రం అంతగా ఎక్కదు.
రేటింగ్ 2.5