
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వలేదు.. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను కూడా ఇచ్చిన మూవీస్ ఉన్నాయి. చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచి, ఒక కొత్త జానర్‌కు నాంది పలుకిన సినిమాలెన్నో అందులో ఉన్నాయి. అలాంటి చిత్రాలలో గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమా గూఢచారి 116.
1966లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు స్పై థ్రిల్లర్ అనే కొత్త అనుభూతిని పరిచయం చేసింది. అంతేకాదు, ఈ సినిమా ద్వారా కృష్ణ హీరోగా టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయనకు “ఆంధ్రా జేమ్స్ బాండ్” అనే బిరుదు కూడా ఈ సినిమాతోనే వచ్చింది.
మల్లికార్జున రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను సుందర్‌లాల్ తో కలిసి దూండి నిర్మించారు. కథలో ప్రధాన పాత్రలో కృష్ణ నటించగా, హీరోయిన్‌గా జయలలిత, ముఖ్యమైన పాత్రలో శోభన్ బాబు, అలాగే విలన్ పాత్రలో రాజనాల, కీలక పాత్రలో మక్కమాల కనిపించారు.ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. తెలుగు సినిమా ప్రపంచంలో స్పై థ్రిల్లర్ జానర్‌కు బాటలు వేసిన క్లాసిక్ మూవీగా గుర్తింపు పొందింది.
గూడాచారి 116 కథలో ప్రధాన పాత్ర గోపి(కృష్ణ). అతడు సీక్రెట్ ఏజెంట్ 116గా పనిచేస్తుంటాడు. అతని సహచర గూఢచారి ఏజెంట్ 303( శోభన్ బాబు) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. ఈ కేసును విచారించేందుకు CID చీఫ్ గోపికి బాధ్యతలు అప్పగిస్తాడు. 303 హత్య వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునే క్రమంలో గోపి అనేక ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాడు.
ఈ దర్యాప్తు సమయంలో అతడు ఒక విమాన ప్రయాణంలో రాధ( జయలలిత) అనే యువతిని కలుస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో 303 హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు గోపిని మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడతాయి. 303 సోదరి కమల తన సోదరుడిని హత్య చేసిన వ్యక్తిని వెతుకుతుండగా, గోపి దర్యాప్తు కొనసాగిస్తాడు.
దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో రాధ తండ్రి దామోదరం(మక్కమాల) ఒక గ్యాంగ్‌స్టర్ అని గోపికి తెలుస్తుంది. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక పెద్ద కుట్ర వెనుక అతని పాత్ర ఉందని గోపి అనుమానిస్తాడు. కథ ముందుకు సాగేకొద్దీ విదేశీ కుట్ర, దేశద్రోహులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరుగుతున్న పెద్ద ఆటను బయటపెట్టేందుకు గోపి చేసే ప్రయత్నాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి.
రాధకు కూడా తన తండ్రి గ్యాంగ్‌స్టర్ అని తెలుసుకుంటుంది. ఈ కుట్ర వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ ముఠా ఉందని తెలుస్తుంది. ఆ ముఠాకు నాయకత్వం వహించే వ్యక్తి సుప్రీమో( రాజనాల) అనే విలన్. అతడు విదేశీ శక్తులతో కలిసి భారత్‌ను అస్థిరపరచాలని కుట్ర పన్నుతాడు.మిగిలిన కథలో ఏజెంట్ 116 ఆ కుట్రను ఎలా బయటపెట్టాడు? దేశాన్ని ఎలా రక్షించాడు? రాధతో అతని ప్రేమకు ఏమైంది? అనే అంశాలపై ఉత్కంఠభరితంగా సాగుతుంది.
1960లలో ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తున్న సమయంలోనే ఈ చిత్ర ఆలోచన వచ్చింది. నిర్మాతలు తెలుగు ప్రేక్షకులకు కూడా అలాంటి స్పై థ్రిల్లర్ అందించాలని భావించారు. రచయిత ఆరుద్ర కథను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ స్పై సినిమాల శైలిని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలిచారు.
ప్రత్యేకంగా Dr No వంటి జేమ్స్ బాండ్ చిత్రాల ప్రభావం ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఫ్రెంచ్ స్పై సినిమా Banco à Bangkok pour OSS 117 నుంచి కూడా కొన్ని అంశాలు ప్రేరణగా తీసుకున్నట్లు చెప్పబడుతుంది. అయితే ఈ కథను పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించారు.
ఈ సినిమాలో హీరోగా కృష్ణ నటన ప్రత్యేకంగా నిలిచింది. అప్పటికి ఆయన హీరోగా కొత్తగా పరిచయం అవుతున్న సమయంలో ఇలాంటి యాక్షన్ పాత్రలో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గూఢచారి పాత్రలో ఆయన చూపించిన ధైర్యం, స్టైల్, యాక్షన్ సన్నివేశాల్లో చేసిన స్టంట్లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఇక హీరోయిన్‌గా జయలలిత నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆమె గ్లామర్ కు యాక్టింగ్ తోడై.. సినిమా సక్సెస్ లో భాగం అయ్యింది. అంతే కాదు ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. రాధగా ఆమె అందం, నటన సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి.
విలన్ పాత్రలో రాజనాల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలన్ పాత్రలో రాజనాల నటన కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చూపించిన గంభీరత సినిమాకు బలాన్ని ఇచ్చింది. అలాగే ముక్కామల, రేలంగి, రమణా రెడ్డి, రాజబాబు వంటి ప్రముఖ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్రత్యేకంగా శోభన్ బాబు ఏజెంట్ 303 పాత్రలో కనిపించడం కూడా ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించింది. శోభన్ బాబు పాత్ర తక్కువగా ఉన్నా.. సినిమాపై ఎక్కువ ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మల్లికార్జున రావు కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు, దర్యాప్తు భాగాలు, సస్పెన్స్ ను క్రియేట్ చేసేలా.. ఆ కాలంలోనే అద్భుతమైన స్క్రీన్ ప్లేను ఆయన అందించారు. సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ చేసిన కెమెరా పనితనం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అప్పట్లో స్పై సినిమాలకు అవసరమైన యాక్షన్ స్టైల్, ఛేజ్ సన్నివేశాలను ఆయన బాగా చిత్రీకరించారు. ఇక సంగీత దర్శకుడు తాతినేని చలపతి రావు అందించిన సంగీతం కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథకు అనుగుణంగా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
1966 ఆగస్టు 11న విడుదలైన గూడాచారి 116 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అదే సమయంలో విడుదలైన ఎన్టీఆర్ శ్రీకృష్ణతులాభారం వంటి భారీ పౌరాణిక చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ, దాన్ని తట్టుకుని నిలబడి..సూపర్ హిట్ అయ్యి చూపించింది. ఈ సినిమా విజయం కృష్ణ కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. విడుదలైన కొద్ది కాలంలోనే ఆయనకు వరుసగా అనేక సినిమా అవకాశాలు వచ్చాయి.
దీంతో ఆయన టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగే మార్గం సుగమమైంది. అంతే కాదు ఈ సినిమా విజయం కృష్ణ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. విడుదలైన కొద్ది కాలంలోనే ఆయనకు వరుసగా 20 సినిమాల అవకాశాలు వచ్చాయి. కృష్ణకు వచ్చిన “ఆంధ్రా జేమ్స్ బాండ్” బిరుదు కూడా వచ్చింది.
గూడాచారి 116 విజయంతో తెలుగు సినిమాల్లో స్పై థ్రిల్లర్ జానర్‌కు కొత్త దారి తెరుచుకుంది. తరువాత కృష్ణ నటించిన జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గుడాచారి వంటి సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. తెలుగు సినిమాకు కొత్త జానర్‌ను పరిచయం చేసిన చిత్రం కూడా. కృష్ణను స్టార్ హీరోగా మార్చిన సినిమా కూడా ఇదే. గూడాచారి 116 తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి.
కొత్త కథాంశం, యాక్షన్ సన్నివేశాలు, ఆసక్తికరమైన కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌కు ఇది బలమైన పునాది వేసిన సినిమా. ఇప్పటికీ స్పై థ్రిల్లర్‌ల గురించి మాట్లాడినప్పుడు ఈ సినిమా పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. ఇక ఈమూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.