నిలువెత్తు జలపాతం ఈ కవితా మహాప్రస్థానం.

First Published | Aug 14, 2021, 5:51 PM IST

నాలుగు దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ పేరును పెట్టుకుని నేను అక్షర లక్షలు గడించాను అని చెప్పుకున్నారు ఈ శ్రీశ్రీ కవితాక్షరరూపశిల్పి విశ్వేశ్వర రావు. శ్రీ శ్రీ పేరు వాడుకున్నందుకు బాకీ చెల్లిస్తానని చెప్పి ఇదిగో ఈ అద్భుత గ్రంధం, గంధం అందించారు.

Sri Sri Maha Prasthanam

శ్రీశ్రీ విశ్వరూపాన్ని శ్రీశ్రీ ప్రెస్ విశ్వేశ్వరరావు చూపించాడు.  ఏ రంగూపూసుకోకుండా శబ్దరససౌందర్యాలతో చెలరేగిన శ్రీశ్రీ కవితా విస్ఫోటనానికి ఒక సువిశాలమైన రూపునిచ్చి చూపినాడు.  అరచేతికంప్యూటర్లలో మినీ దృశ్యాల మినీ మనీ మనసులతో సతమతమవుతున్న యువతరానికి ఒక విస్తారమైన కవితా సామ్రాజ్యం కన్నులనిండుగా ఎలా ఉంటుందో చూపి పుస్తక వైభవానుభూతుల రుచి చూపించారు. మహాప్రస్థానం రచన పుట్టిన చోటు, తొలిసారి చదివిన చోటు, ముద్రణలకు నోచుకున్న తీరు, పలుముద్రణల ముఖచిత్రాలు మనకోసం ఒకచోట సేకరించిన ఒక అపురూపమైన శ్రీ శ్రీ సంతకాల ఆల్బం ఇది. 

Sri Sri Maha Prasthanam

షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టుకుని ఎవరు ఏమి గడించారో తెలీదు గాని నాలుగు దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ పేరును పెట్టుకుని నేను అక్షర లక్షలు గడించాను అని చెప్పుకున్నారు ఈ శ్రీశ్రీ కవితాక్షరరూపశిల్పి విశ్వేశ్వర రావు. శ్రీ శ్రీ పేరు వాడుకున్నందుకు బాకీ చెల్లిస్తానని చెప్పి ఇదిగో ఈ అద్భుత గ్రంధం, గంధం అందించారు.

Latest Videos


Sri Sri Maha Prasthanam

శ్రీ శ్రీ మద్రాసు ఇల్లు తాకట్టులో ఉందని తెలిసి విడిపించడానికి అభిమానులు సిద్ధ పడ్డారట. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో బాలక్రిష్ణయ్యగారు ముందున్నారు. కామ్రేడ్ రత్నమాల తనచేతిగాజులు ఇచ్చేశారు. ఆరోజు అప్పడికప్పుడు ఎందరో ఇచ్చిన ఆభరణాలతో, డబ్బుతో తాకట్టు విడిపించడమే కాక మిగిలిన డబ్బు శ్రీ శ్రీ చేతిలో పెట్టారట. ఆ సభలో పాల్గొన్న విశ్వేశ్వరరావుగారు శ్రీశ్రీ కోరిక తీర్చాలని సంకల్సించారు. మహాప్రస్థానం ను నిలువుటద్దం పరిమాణంలో ప్రచురించాలని శ్రీశ్రీ కోరుకున్నారట.  నిలువుటద్దమంత కాకపోయినా చాలా భిన్నంగా అనితర సాధ్యంగా సాటిలేని రీతిలో, దాదాపుగా తెరిచిన రెండు పేజీల దినపత్రికంత పెద్దగా పుస్తకం ప్రచురించారు. ఇదే కాస్త చిన్నగా అడ్డంగా వచ్చి ఉంటే కాఫీ టేబుల్ బుక్ అనే వారేమో. కాని దీన్ని అట్లా అరువుతెచ్చుకున్న పేరుతో పిలవనక్కరలేదు.  నిలువుటద్దం ప్రచురణ అని గానీ శ్రీశ్రీ ప్రెస్ పుస్తకం అని గానీ పిలువబడే, ఈ తరహా పుస్తకాల వరవడికి తొలితరం హారతి గా మిగిలిపోతుంది. 

Sri Sri Maha Prasthanam

విశాలాంధ్ర ప్రచురణలు, విరసం ప్రచురణలతో విశ్వవిఖ్యాతమైన శ్రీశ్రీ మహాప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణతో విశిష్ట స్థానం పొందింది. శ్రీ శ్రీ చేతివ్రాతతో 1981లో ప్రచురించి దాంతోపాటు శ్రీశ్రీ స్వయంగా ఆలాపించిన స్వయం కవితాగీతాల క్యాసెట్ కూడా ఇచ్చి, ఆయన కలాన్ని గళాన్ని కూడా అజరామరం చేసిన లండన్ గూటాల కృష్ణమూర్తిగారి ప్రచురణ ఒక చరిత్ర సృష్టించింది. 2021లో, అంటే 40 ఏళ్ల తరువాత శ్రీ శ్రీ విశ్వేశ్వరరావు ప్రచురణ మరో చరిత్ర సృష్టించిందంటే అతిశయోక్తికాదు. శ్రీశ్రీ కవితా ప్రస్థానంతో దాని ప్రచురణ యజ్ఞంతో సంబంధం ఉన్న వ్యక్తుల చిత్రాలను, జ్ఞాపకాలను, ఆనాటి రూపాలను, శ్రీశ్రీ విభిన్న ఛాయా చిత్రాలను, కార్టూనిస్టులు చిత్రించిన అనేకానేక రేఖా చిత్రాలను కూడా జోడించి మహాప్రస్థానాన్ని మరోసారి మనముందు విశ్వరూపంలో ప్రత్యక్షర ప్రత్యక్షం చేసారు. మహాకవి పట్ల మహాభిమాని అభిమానపు విశ్వరూపం ఇదిగో ఇలా ఉంటుంది చూడండి అని మనముందుంచారు. శ్రీశ్రీ పుస్తకాన్ని మరోసారి మహాద్భుతంగా ఆవిష్కరించారు.

Sri Sri Maha Prasthanam

ప్రగతి వారపత్రికలో శ్రీశ్రీ ప్రజ (ప్రశ్నలు జవాబులు) నిర్వహించేవారు. అందులో పిచ్చిరెడ్డి అనే ఎం ఎ విద్యార్థి వేసిన ప్రశ్న. ‘‘యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం గీతాలు మరి చదవనక్కరలేదని నేనంటాను మీరే మంటారు’’ అని. దానికి శ్రీశ్రీ  జవాబు. ‘‘మీరు సార్థక నామధేయులంటాను’’. ఇటువంటి హాస్య గుళికలను ఈ పుస్తకంలో మనం చదువుకోవచ్చు. శ్రీశ్రీ కవితా నేపథ్యం, దానికి అనుబంధమైన అనేకానేక అంశాలను విశేషాలను ఇందులో గుదిగూర్చారు. అన్నిటికన్న ఉపయోగకరమైన అంశం ఏమంటే ఫుట్ నోట్స్. శ్రీశ్రీ వాడిన అనేకానేక శబ్దాలకు సందర్భోచితమైన వివరణలను సమకూర్చారు. విశ్వేశ్వరరావుగారు, ప్రచురణ కర్తే కాదు, ఈ నిలువెత్తు శ్రీశ్రీ దర్పణ గ్రంధానికి సంపాదకుడు కూడా.అందమైన అబద్ధాలలో కన్నా నిష్టురమైన నిజంలోనే మంచి కవిత్వం దర్శనీయమవుతుందని విశ్వసించాను. అని శ్రీశ్రీ 1980లో రాసిన ‘నామాట’ లో ఎంతో స్పష్టంగా చెప్పారు.

Sri Sri Maha Prasthanam

కొంపెల్ల జనార్దనరావుకు అంకిత గీతం కూడా చాలా కసిగా కోపంగా శ్రీశ్రీ ఝంఝామారుతంలా ఉంటుంది. ఈ గీతంతో జనార్దనరావుకు అమరత్వం సంపాదించి పెట్టాడు శ్రీశ్రీ. 

అడుగడుగున పొడచూపే
అనేకానేక శత్రువులతో
పొంచి చీకట్లో కరవజూచే
వంచకాల ఈ లోకంతో పొసగక
అంచితానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్ నేస్తం...
ఉపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి
మా కళ్లల్లో గంధక జ్వాలలు
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి

మాదారిలో ప్రశ్నార్థ చిహ్నాల
బ్రహ్మచెముడు డొంకలు కప్పి,
తలచుకున్నపుడల్లా
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝంఝాపవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను
ఎంత మోసగించిందయ్యా మమ్ము.

అంటూనే మరొకచోట 

మా బురఖా మేము తగిలించుకున్నాం!
మాకాళ్లకుమడెక్కలుమొలిచాయి.
మా నెత్తికి కొమ్ములలాగే!
మమ్మల్ని నువ్వుపోల్చుకోలేవు!
....  అంటాడు

...... కావున ఈ నిరాశామయలోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహన చేస్తున్నాను!
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీకోసం
ఇదే నా మహా ప్రస్థానం!

Sri Sri Maha Prasthanam

ఈ నిలువెత్తు దర్పణ పుస్తకం, పుస్తకం వలె లేదు. ఒక సప్తవర్ణ కళా ఖండం చూసినట్టనిపిస్తుంది. ఒక మంచి సినిమాను 70 ఎంఎం ధియేటర్ లో చూచినట్టవుతుంది.   విశాఖ సముద్రతీర వర్ణచిత్రంతో ఈ ప్రస్థానం మొదలవుతుంది. ఈ పుస్తకం, మస్తకాలలో దుమ్ముదులిపి, హృదయాలయాలలో ఈనాడు అత్యవసరమైన వైశాల్యాన్ని ఆవిష్కరిస్తుంది.  ఇరుకు సందుల మురికి భావాలనుంచి అనంతమైన గగనాలలోకి మనసును ప్రస్థానం చేయిస్తుంది. ఇదివరకే రసహృదయాలలో వ్యవస్థాపితమైన శ్రీశ్రీ పద భావ గంభీర వీరోచిత సాహిత్యానికి పునర్జన్మనిచ్చి కొత్తతరాలకు మహాకవి మహత్యాన్ని పరిచయం చేస్తుందీ పుస్తకం.  

అందమైన సంధ్యాసాయంత్రాలలో, అరుణారుణోదయాల్లో ఎర్రని సూర్యకాంతి ప్రభల నేపథ్యంలో తెలుపు రంగులో శ్రీశ్రీ గేయాలను నిలబెట్టి మరోప్రపంచపు అంచులు చూపినట్టనిపిస్తుంది.  ఒక వంద అడుగుల కాన్వాస్ పైన గీసిన అందమైన అక్షరవర్ణచిత్రాన్ని తలెత్తి సగర్వంగా చూసే అవకాశాన్నిఅనుభూతిని ఈ మహాప్రస్థాన సమస్తమైన పుస్తకం అందిస్తుంది.  మరో ప్రపంచం కదనకుతూహల కవితారాగానికి కృష్ణశాస్త్రి కాపీ రాగాల అపస్వరాల సంగతి కూడా వివరిస్తుంది ఒక చోట.

పెద్దవాళ్ల పుట్టినరోజులకు దీపాలార్పి కేకులు కోతలు కోసే బదులు, శ్రీశ్రీ నిరంతర జ్ఞాపకమయిన ఈ చైతన్యాక్షర సాహితీ స్రవంతి బహుమతిగా ఇస్తే ఒక కొత్త ప్రపంచం గురించి కొత్తవారికి తెలియజేసిన వాళ్లవుతారు. ఒక మధురానుభూతి శాశ్వతత్వం తరతరాలకు విశదమవుతుంది.

శ్రీశ్రీకి విశ్వేశ్వరరావు సమర్పించిన అక్షర నీరాజనం ఇది.

శ్రీశ్రీని సమర్చించిన సాహితీ సమారాధనం ఇది.

Sri Sri Maha Prasthanam

విషం క్రక్కే భుజంగాలో

కదం త్రొక్కే తురంగాలో
మదం పట్టిన మాతంగాలో
కవీ, నీ పాటల్
కవీ నీ గళగళన్మంగళ
కళాకాహళ హళాహళిలో
కలసిపోతిని! కరగి పోతిని!
కానరాకే కదలి పోతిని!

అన్నా

బలవంతులు దుర్బల జాతిని
బానిసల కావించారు:
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి

 

అన్నా

ఏశిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గులకీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

 

అన్నా

అది శ్రీశ్రీ స్వరం, శ్రీశ్రీ గళం, శ్రీశ్రీ ప్రెస్, శ్రీశ్రీ ఫాంట్, శ్రీశ్రీ యుగం, శ్రీశ్రీ నిలువెత్తు దర్ఫణ ప్రచురణం.  స్వాతంత్ర్యాన్ని ఎగరేసి గగనానికి చాటే నిలువెత్తు జెండా.

Sri Sri Maha Prasthanam

ఈనాడు శ్రీధర్ శ్రీశ్రీ భువినుంచి దివికి మహాప్రస్థానం చేసిన వేళ గీతలతో ఘటించిన రేఖాంజలి చివరి అట్టపేజీలో వేసి ఈ మహాప్రస్థానాన్ని అద్భుతంగా ముగించారు.

-మాడభూషి శ్రీధర్

click me!