
ఇంకొక రోజులో నూతన సంవత్సరం రానుంది. నూతన సంవత్సరం అంటే కొత్త విషయాలే గుర్తుకు వస్తాయి. కొత్త తీర్మానాలు, కొత్త అలవాట్లు, ఇలా జీవితాన్ని మార్చుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి నూతన సంవత్సరం మంచి అవకాశం. సానుకూల విషయాలు చేయడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు చూడవచ్చు. కొత్త విషయాలు ప్రారంభించడానికి అనువైన నూతన సంవత్సరంలో ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నూతన సంవత్సరంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవచ్చు. ఏ అలవాట్లను ఎలా పాటిస్తే జీవితంలో మార్పులు తీసుకురావచ్చో ఇక్కడ చూద్దాం.
స్క్రీన్ టైమ్ నిర్వహణ:
మీరు మొబైల్, కంప్యూటర్ వంటివి ఎక్కువ సమయం వినోదం కోసం ఉపయోగిస్తుంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. స్క్రీన్ టైమ్ ఎక్కువైతే ఉపయోగకరమైన పనులకు సమయం దొరకదు. రాత్రి పడుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సమయం గడపడాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. దృష్టి చెదరదు. గాఢ నిద్ర పడుతుంది.
ఆహారపు అలవాట్లు:
మీరు బయట తినేవారైతే ఇంట్లో వండిన ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మంచి ఆహారపు అలవాట్లు మీ శరీరం, మనసుని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆరోగ్యవంతులు సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రాసెస్డ్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి.
ఒత్తిడి తగ్గించుకోవడానికి!
ఒత్తిడి లేని జీవితం గడపడం చాలా ముఖ్యం. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొత్త అలవాట్లు అలవర్చుకోండి. మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయండి. మీ జీవితం గురించి కృతజ్ఞతతో ఉండటానికి ప్రతిరోజూ డైరీ రాసే అలవాటు చేసుకోండి.
స్నేహితులతో కలవడం:
మీ మంచి కోరే స్నేహితులను మీ చుట్టూ ఉంచుకోండి. సంవత్సరానికి ఒకసారి స్నేహితులను కలిసే బదులు తరచుగా కలిసి మాట్లాడటం అలవాటు చేసుకోండి.
పూర్తి నిద్ర:
మంచి నిద్ర మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాగా నిద్రపోయేవారికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వారు సంతోషంగా ఉంటారు. ఉత్సాహంగా ఉండటానికి రాత్రి బాగా నిద్రపోవడం అవసరం. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించి త్వరగా పడుకోవడం మంచిది. ఈ అలవాటుని నూతన సంవత్సరం నుండి అలవర్చుకోండి.