రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీ.. సెఫ్టీ విభాగంలోనే 1.7 లక్షల ఖాళీలు..!

First Published | Jun 29, 2023, 9:59 AM IST

భారతీయ రైల్వేలో 2023 జూన్ నాటికి దాదాపు 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సెఫ్టీ కేటగిరిలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెల్లడైంది. 

భారతీయ రైల్వేలో 2023 జూన్ నాటికి దాదాపు 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సెఫ్టీ కేటగిరిలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెల్లడైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ప్రశ్నకు సమాధానంగా.. గ్రూప్ సిలో లెవెల్ 1తో(ఎంట్రీ లెవల్) సహా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది.
 

ఇటీవల రైలు ప్రమాదాల పెరుగుదల భారతీయ రైల్వేలను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కేటగిరిలో ఖాళీల సంఖ్యకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. సేఫ్టీ కేటగిరీలో 9.82 లక్షలకు పైగా పోస్టులు ఉన్నాయని.. వాటిలో 8.04 లక్షలకుపైగా భర్తీ చేసినట్లు తెలిపింది. ఇక, సేఫ్టీ కేటగిరీలో మొత్తం 1,77,924 ఖాళీలు ఉన్నాయని రైల్వే పేర్కొంది.


‘‘ఈ కార్యాలయంలో 01.06.2023 నాటికి (ప్రొవిజనల్) అందుబాటులో ఉన్న విధంగా భారతీయ రైల్వేలో గ్రూప్-సీ (లెవల్-1తో సహా) ఖాళీగా ఉన్న మొత్తం నాన్-గెజిటెడ్ పోస్టుల సంఖ్య- 2,74,580’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 

‘‘ఈ కార్యాలయంలో 01.06.2023 నాటికి (ప్రొవిజనల్) అందుబాటులో ఉన్నట్లుగా.. భారతీయ రైల్వేలో గ్రూప్-సీ (లెవల్-1తో సహా) భద్రతా కేటగిరీలో మొత్తం మంజూరైన పోస్టుల సంఖ్య 9,82,037గా ఉంటే.. భర్తీ చేసిన వాటి సంఖ్య 8,04,113, ఖాళీల సంఖ్య 1,77,924గా ఉంది’’ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ తెలిపింది. 

సెఫ్టీ కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్‌ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్‌ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, టికెట్‌ కలెక్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. 
 

ఇక, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, త్వరితగతిన పదోన్నతులు, నాన్-కోర్ సిబ్బందిని శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు తరలించడం ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్లు రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. ఇదిలా ఉంటే.. రైల్వేలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2022 డిసెంబర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు.

Latest Videos

click me!