
Reliance Foundation Scholarships 2024-25 : అపర కుభేరుడైనప్పటికీ ముఖేష్ అంబానీ పేదల బాధలు ఎలా వుంటాయో తెలిసినట్లుంది. అందుకోసమే తనవంతుగా నిరుపేదలకు అండగా నిలిచేలా రిలయన్స్ ఫౌండేషన్ ను ఏర్పాటుచేసారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తన సంపాదనలో కొంతభాగాన్ని కేటాయించి ఈ ఫౌండేషన్ ను నడుపుతున్నారు... 2010 లో స్థాపించిన ఈ సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగమే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రోగ్రాం.
చదువుకోవాలని ఆశ వున్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నతవిద్య కొనసాగించలేకపోతున్న విద్యార్థులకు ప్రతిఏటా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ అందించేందుకు సిద్దమైంది. ఇలా రాబోయే కొన్నేళ్లుగా వేలాదిమంది యువతకోసం వందలకోట్లు ఖర్చుచేయనున్నారు. ఇలా ఈ సంవత్సరం పేద విద్యార్థులకు అండగా నిలిచేలా స్కాలర్ షిప్స్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే రిలయన్స్ ఫౌండేషన్ 2024-25 సంవత్సరానికి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తుంది రిలయన్స్ ఫౌండేషన్. అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ...కుటుంబ ఆదాయం తక్కువగా వుండే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. ఇలా చదువుకునేందుకు ఆర్థిక సాయం అవసరమున్న 5100 మందికి స్కాలర్ షిప్స్ అందించేందకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.
దేశ అభివృద్దిలో విద్యావంతులైన యువతను భాగస్వామ్యం చేయాలనేదే రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే చదివే ఆసక్తి వున్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తోంది. రెగ్యులర్ పద్దతిలో డిగ్రీ, పిజి చేసే విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లోంచి 5,100 మందిని ఎంపికచేసి సాయం అందిస్తుంది రిలయన్స్ ఫౌండేషన్.
అయితే రెండు రకాల స్కాలర్ షిప్స్ ను రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తుంది. మంచి ప్రతిభ కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల ఆర్థిక కష్టాలను ఈ ఫౌండేషన్ తొలగించనుంది. స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో వందమందిన ఎంపికచేసి ఆర్థిక సాయం చేస్తారు. ఒక్కో పిజి విద్యార్థికి రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది రిలయన్స్ ఫౌండేషన్.
ఇక గ్రాడ్యుయేషన్ చదివే వేలాదిమందికి కూడా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ అందిస్తుంది. ఐదువేల మంది డిగ్రీ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ కోసం ఎంపికచేస్తారు. ఇలా ఎంపికైనవారిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు సాయం చేయనున్నారు. ఇలా కేవలం స్కాలర్ షిప్స్ మాత్రమే కాదు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తోంది రిలయన్స్ ఫౌండేషన్.
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది రిలయన్స్ ఫౌండేషన్. వచ్చే పదేళ్లలో 50వేల మందికి ఆర్థిక సాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తెలిపారు. ఇలా దేశంలోనే అత్యధిక స్కాలర్ షిప్స్ అందిస్తున్న ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది 5100 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ఇలాగే స్కాలర్ షిప్స్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.
స్కాలర్ షిప్ కోసం ఇలా దరఖాస్తు చేసుకొండి :
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ను పొందేందుకు విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ www.scholarships.reliancefoundation.org ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అందిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మంచి టాలెంట్ కలిగి ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులను గుర్తించి స్కాలర్ షిప్స్ అందిస్తారు.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ అక్టోబర్ 6,2024 వరకు స్వీకరిస్తుంది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ నిలిపేసి వచ్చినవాటిని పరిశీస్తారు...అనంతరం స్కాలర్ షిప్ కు అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. కాబట్టి ఆర్థిక కష్టాలతో చదువు సాగించలేకపోతున్న విద్యార్థులు ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోండి... ఉన్నత చదువులను ఎలాంటి ఇబ్బందిలేకుండా కొనసాగించండి.