మీ ఫోన్ పోయిందా? సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే

First Published | Nov 25, 2024, 2:32 PM IST

ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో సెల్ ఫోన్ ఓ భాగమయ్యింది. ఆర్థిక లావాదేవీలో కాదు మన వ్యక్తిగత సమాచారమంతా అందులో వుంటుంది. మరి అలాంటి సెల్ ఫోన్ మిస్ అయినా, చోరీకి గురయినా ముందుగా ఏం చేయాలంటే...

Mobile

హైదరాబాద్ : కూడు,గూడు,గుడ్డ... ఒకప్పటి మనిషికి కనీస అవసరాలు. కానీ ఇప్పుడు ఈ జాబితాలోని సెల్ ఫోన్ వచ్చిచేరింది. చిన్నదో పెద్దదో మొబైల్ ఫోన్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అభం శుభం తెలియని చిన్నారుల నుండి జీవితం మొత్తాన్ని అనుభవించిన పండు ముసలి వరకు మొబైల్ ఉపయోగిస్తున్నారు... ఇంకా చెప్పాలంటే ఆధార్ కార్డ్ మాదిరిగానే ఫోన్ నంబర్ కూడా ఓ మనిషి ఐడెంటిటీగా మారింది.

యావత్ ప్రపంచాన్నే ఓ కుగ్రామంగా మార్చేసిన ఘనత మొబైల్. చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే చాలు... ఆర్థిక వ్యవహారాల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు, షాపింగ్ కోసం మాల్ కు, ఫుడ్ కోసం హోటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదు... అన్నీ కూర్చున్నచోటికే వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఫోన్ లేకుండా మనం ఏ పనీ చేయలేని పరిస్థితి వచ్చింది... మన సమస్త సమాచారం అందులోనే వుంటుంది. ఇలా ఎంతో కీలకమైన ఫోన్ మిస్ అయితే ఏం చేయాలో చాలామందికి తోచదు. అలాంటివారు ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 
 

Mobile

ఫోన్ పోగానే ముందుగా ఏం చేయాలి? 

ఫోన్ చోరీకి గురయినా, ఎక్కడైనా మిస్ అయినా  ఎవరైనా ముందుగా చేసేది పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం. అయితే ఇలాంటివి రోజుకు కొన్ని వేల కేసులు పోలీసులకు వస్తుంటాయి... కాబట్టి వారు మన కేసును పరిశీలించడం, ప్రత్యేకంగా మన ఫోన్ ను వెతికే అవకాశం వుండదు. అందువల్ల పోలీసులపైనే భారం వేసి ఊరుకోకుండా మనం కూడా ఫోన్ ను వెతికేందుకు  ప్రయత్నించవచ్చు. ఇందుకోసం సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) ని ఆశ్రయించవచ్చు. 

అ సీఈఐఆర్ వైబ్ సైట్ లోకి వెళ్లగానే Block Stolen/Lost Mobile (దొంగిలించబడిన లేదా మిస్ అయిన) ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే మన ఫోన్ కు సంబంధించిన వివరాలను అడుగుతుంది... మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, ఫోన్ మోడల్,  కొనుగోలుకు సంబంధించిన రసీదులు ఏవైనా వుంటే అందియ్యాలి. అలాగే ఫోన్ ఎక్కడ మిస్సయ్యింది, పోలీస్ కంప్లైంట్ నంబర్ వంటి వివరాలను కూడా అందియ్యాలి. మన వ్యక్తిగత వివరాలను కూడా పొందుపర్చి సబ్ మిట్ చేయాలి. ఇలా ఫిర్యాదుచేసిన 24 గంటల్లోనే ఫోన్ బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు. 

ఇలా బ్లాక్ చేసిన ఫోన్ లో సిమ్ కార్డు వేయగానే సిఈఐఆర్ కు, పోలీసులకు అలర్ట్ మెసేజ్ వెళుతుంది. దీంతో ఆ ఫోన్ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. ఇలా పోయిన  ఫోన్ ను ఈజీగా కనుక్కోవచ్చు. మన చేతికి ఫోన్ వచ్చాక తిరిగి ఇదే సిఈఐఆర్ వైబ్ సైట్ ను ఉపయోగించిన ఫోన్ ను అన్ బ్లాక్ చేసుకోవచ్చు. 

ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చోరికి గురయిన లేదా మిస్ అయిన 24,20,359 సెల్ ఫోన్లను సిఈఐఆర్ బ్లాక్ చేసింది. వీటిలో 14,47,253 ఫోన్లను ట్రేస్ చేసారు... వాటిలో 2,77,692 మాత్రమే రికవరీ అయ్యాయి. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ లో 77,292 ఫోన్లు బ్లాక్ చేయగా 46,934 ట్రేస్ అయ్యాయి... వీటిలో 15,763 ఫోన్లు రికవరీ అయ్యాయి. ఇక తెలంగాణలో 2,57,790 ఫోన్లను బ్లాక్ చేసి  1,41,819 ట్రేస్ చేసారు.వీటిలో 53,993 రికవరీ అయ్యాయి. 
 

Latest Videos


Mobile

సెకండ్ హ్యాండ్ కొంటుంటే పాటించాల్సిన జాగ్రత్తలు : 

తక్కువ ధరకు మంచి మోడల్ వస్తుందని ముందూ వెనక ఆలోచించకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటే చిక్కుల్లో పడాల్సి  వస్తుంది. ఇలా తక్కువధరకు ఫోన్ అమ్ముతున్నారంటే ఎక్కువశాతం అవి దొంగిలించినవో లేక ఎక్కడైన దొరికినవో అయివుంటాయి. కాబట్టి అప్పటికే సిఈఐఆర్ పోర్టల్, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు నమోదయి వుంటుంది. అలాంటి ఫోన్ కొనడం వల్ల మనం ఇబ్బందిపడాల్సి వస్తుంది. 

అయితే ఎలాంటి సమస్య లేకుండా వాడినఫోన్ కొనాలంటే ముందుగా దాని ఐఎంఈఐ నంబర్ బ్లాక్ లిస్ట్ లో వుందేమో తెలుసుకోవాలి. ఇందుకోసం మొబైల్ నుండి KYM అని టైప్ చేసి 15 అంకెల ఐఎంఈఐ జతచేసి 14422కు ఎస్ఎంఎస్ పంపించాలి. దీనివల్ల ఫోన్ ఐఎంఈఎం నంబర్ బ్లాక్ లో వుందో లేదో తెలుసుకోవచ్చు... ఒకవేళ బ్లాక్ లో లేకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదు. 

click me!