Interesting Facts: షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, హోటల్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా మనం లిఫ్ట్ లను వాడుతూనే ఉంటాం. అయితే లిఫ్ట్‌లోకి అడుగుపెట్టగానే మన ముందు అద్దం కనిపిస్తుంటుంది. అసలు లిఫ్ట్ లో అద్దం ఎందుకు పెడతారు? వాటి వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం.
నేటి ఆధునిక ప్రపంచంలో పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, హోటళ్లు, ఆఫీసులు ఇలా ప్రతి చోట లిఫ్ట్‌లు తప్పనిసరి అయిపోయాయ. అయితే లిఫ్ట్‌లోకి అడుగుపెట్టిన వెంటనే మనకు కనిపించే ముఖ్యమైన అంశం అద్దం. చాలామంది ఈ అద్దాలను కేవలం అందం కోసం లేదా ముఖం చూసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేశారని అనుకుంటారు. కానీ లిఫ్ట్‌లో అద్దాలు అమర్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
25
ఇరుకు భావం తగ్గించడం
లిఫ్ట్‌లో అద్దాలు పెట్టడానికి ప్రధాన కారణం ఇరుకుగా ఉందనే భావాన్ని తగ్గించడం. చాలా లిఫ్ట్‌లు చిన్న పరిమాణంలో ఉంటాయి. వాటిలో కొందరికి ఊపిరి ఆడనట్లుగా లేదా బంధించినట్లుగా అనిపిస్తుంది. అద్దం ఉండటం వల్ల లిఫ్ట్‌లోని స్థలం నిజానికి ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఈ దృశ్య ప్రభావం వల్ల లిఫ్ట్ లో ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
35
దృష్టిని మరల్చడం
సాధారణంగా లిఫ్ట్ ప్రయాణం కొన్ని సెకన్ల నుంచి ఒకటి, రెండు నిమిషాల వరకు ఉంటుంది. అప్పుడు టైం నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపించవచ్చు. అద్దం ఉండటం వల్ల చాలామంది తమ ముఖం, దుస్తులు లేదా జుట్టును సరిచేసుకుంటారు. దీంతో వారి దృష్టి సమయంపైన కాకుండా ఇతర విషయాల వైపు మళ్లుతుంది. ఫలితంగా లిఫ్ట్ ప్రయాణం త్వరగా ముగిసినట్లు అనిపిస్తుంది.
లిఫ్ట్‌లో ఒకరికొకరు నేరుగా చూడకుండా అద్దం ద్వారా చుట్టుపక్కల ఉన్న వారిని గమనించవచ్చు. దీనివల్ల లిఫ్ట్ లో ఉన్నవారికి భద్రతా భావం పెరుగుతుంది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు లేదా పిల్లలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారేమో అద్దం ద్వారా సులభంగా గమనించవచ్చు.
వీల్‌చైర్ వాడే వ్యక్తులకు అద్దాలు ఎంతో ఉపయోగపడతాయి. చిన్న లిఫ్ట్‌లలో వీల్‌చెయర్‌ను పూర్తిగా తిప్పడం చాలా కష్టం. బయటకు వెళ్లే సమయంలో వెనుక భాగం కనిపించకపోవచ్చు. అద్దం సాయంతో వెనుక పరిస్థితిని చూసుకుంటూ సులభంగా బయటకు రావచ్చు. అలాగే భారీ సామాన్లు తీసుకెళ్లే వారు కూడా అద్దం ద్వారా వెనుక వైపు చూసుకుంటూ జాగ్రత్తగా కదలవచ్చు.
55
ఆకర్షణీయంగా కనిపించడం కోసం
లిఫ్ట్‌ల రూపకల్పనలో అందానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అద్దాలు ఉండటం వల్ల లిఫ్ట్ లోపలి భాగం ప్రకాశవంతంగా, శుభ్రంగా, విశాలంగా కనిపిస్తుంది. కాంతి ప్రతిబింబించడం వల్ల వెలుతురు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందువల్ల లిఫ్ట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హోటళ్లు, షాపింగ్ మాల్స్, కార్పొరేట్ కార్యాలయాల్లో ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
నిపుణుల ప్రకారం, మనిషి తన ప్రతిబింబాన్ని చూడటం ద్వారా తనపై దృష్టి కేంద్రీకరిస్తాడు. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి కొంతవరకు తగ్గుతాయి. ప్రత్యేకంగా లిఫ్ట్‌లంటే భయం ఉన్నవారికి అద్దం ఒక చిన్న మానసిక ఉపశమనంలా పనిచేస్తుంది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో నిర్మించే ఆధునిక లిఫ్ట్‌లలో అద్దాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.