Venu Thottempudi: టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తన వ్యక్తిగత జీవిత రహస్యాలను పంచుకున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, వెండితెరపైనే తన ముద్ర వేశారు. తండ్రి నుంచి ఎదురైన ఆంక్షలు, జగపతిబాబుతో ఉన్న స్నేహం..
టాలీవుడ్‌లో ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి క్లాసిక్ హిట్స్ అందుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. పెద్దగా హడావుడి లేకుండా, వివాదాలకు దూరంగా ఉండే వేణుకు అత్యంత బలమైన రాజకీయ నేపథ్యం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఆయన తన బాల్యం, కుటుంబం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
25
తమిళనాడులో బాల్యం.. తండ్రి బెల్టు దెబ్బలు
వేణు కాకినాడలో జన్మించినప్పటికీ, తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై, మధురైలలో పెరిగారు. పాఠశాల విద్య నుంచే తమిళ భాషపై పట్టు సాధించారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ప్రాణం ఉన్నప్పటికీ, ఆయన తండ్రికి మాత్రం సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. "సినిమాలు మెదడును ఉత్తేజపరుస్తాయి తప్ప మరేం చేయవు" అని తండ్రి నమ్మేవారని వేణు గుర్తుచేసుకున్నారు. ఒకసారి తండ్రికి తెలియకుండా సినిమాకు వెళ్లి దొరికిపోవడంతో బెల్టుతో దెబ్బలు తిన్నానని, ఆ తర్వాత నెలకు ఒక సినిమాకు తండ్రి అనుమతి ఇచ్చారని నవ్వుతూ పంచుకున్నారు.
35
రాజకీయాల మధ్య సినీ ప్రయాణం
వేణు తొట్టెంపూడి కుటుంబానికి రాజకీయాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన మేనమామ మాగంటి అంకినీడు మచిలీపట్నం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. బాబాయ్ కావూరు సాంబశివరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు వేణుకు బావమరిది. ఇంతటి రాజకీయ బలం ఉన్నప్పటికీ, వేణుకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కేవలం కుటుంబ బాధ్యతగా తన బావమరిది తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, ప్రజల జీవనశైలిని తెలుసుకోవడానికి అది ఒక మంచి అనుభవమని ఆయన తెలిపారు.
తన తోటి నటుడు జగపతిబాబుతో వేణుకు మంచి అనుబంధం ఉంది. ‘హనుమాన్ జంక్షన్’ సమయంలో జగపతిబాబు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని, వేణుపై మరిన్ని సీన్లు, పాటలు ఉండేలా దర్శకులకు చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా విడుదలయ్యాక నిర్మాత ఎం.ఎస్. రాజు సరదాగా తనను ఆటపట్టించేవారని వేణు తెలిపారు. విభిన్న నటీనటులతో కలిసి పనిచేయడం, వారి నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం తనకు ఇష్టమైన వ్యాపకమని ఆయన చెప్పారు.
55
భార్య అనుపమ మద్థతు.. హోమ్ మేకర్‌పై గౌరవం
వేణు భార్య పేరు అనుపమ. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తన సినీ వృత్తికి భార్య 100 శాతం మద్థతు ఇస్తుందని, పిల్లల బాధ్యతలను ఆమె చూసుకోవడం వల్లే తాను కెరీర్‌పై దృష్టి పెట్టగలిగానని ప్రశంసించారు. "ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఉద్యోగం హోమ్ మేకర్‌గా ఉండటం. దానికి అపారమైన సహనం కావాలి" అని వేణు తన భార్యపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.