
తమిళ ఇండస్ట్రీలో ఎన్నో జంటలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, సూర్య-త్రిష లాంటి కొన్ని జోడీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన 'మౌనం పేసియదే' రిలీజై రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పుడు ఆ సినిమా రీ-రిలీజ్‌కు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ జంటే. తాజాగా త్రిష రిలీజ్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో, కేవలం సినిమా ప్రమోషన్ లా కాకుండా, సూర్యతో తనకున్న 'పవర్‌ఫుల్' సెంటిమెంట్‌ను మరోసారి బయటపెట్టింది.
మిస్ చెన్నై టైటిల్ గెలిచి, 'జోడి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన త్రిషను, తమిళ సినిమాకు కలల రాణిగా మార్చింది 'మౌనం పేసియదే'లోని సంధ్య పాత్రే. 'ఈ సినిమాతోనే నాకంతా మొదలైంది' అని త్రిష చెప్పడం వెనుక పెద్ద కృతజ్ఞతాభావం ఉంది. డైరెక్టర్ అమీర్ సెట్‌లో ఓ కొత్త నటిగా అడుగుపెట్టినప్పుడు, తనకు దొరికిన ఆ భద్రత, ప్రోత్సాహమే.. ఈ రోజు ఆమె ' స్టార్'గా ఎదగడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ షూటింగ్ సెట్ ఒక సెట్‌లా కాకుండా, సొంత ఇల్లులా అనిపించిందని త్రిష చెప్పడం ఆ టీమ్ మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న రీ-రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం సూర్య, త్రిష, లైలా ముగ్గురూ వీడియోలు రిలీజ్ చేసి అభిమానులను రెడీ చేశారు. ముఖ్యంగా త్రిష, 'తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి' అని చెప్పడం, కేవలం పాత జ్ఞాపకాలను (Nostalgia) గుర్తుచేసుకోవడమే కాదు, ఓ మంచి సినిమాను మళ్లీ సెలబ్రేట్ చేసుకోమని పిలుపునిచ్చినట్టుగా ఉంది. లైలాతో స్నేహం, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.. అన్నీ కలిసి ఈ వీకెండ్‌లో థియేటర్లను ఓ ప్రేమ పండగలా మార్చేయడం ఖాయం.
ముఖ్యంగా, 'మౌనం పేసియదే' సినిమా తర్వాత 'ఆరు' సినిమాలో ఈ జంట పండించిన కెమిస్ట్రీ ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీన్నిబట్టి త్రిష చెప్పిన ఆ 'సూర్య సెంటిమెంట్' ఎంత పవర్‌ఫుల్ అనేది అర్థమవుతోంది.