Motivational Song : మీ జీవితాన్నే మార్చేసే గొప్ప సాంగ్.. ఒక్కసారి వింటే IAS, IPS కావాలన్నంత కసి పెరగడం ఖాయం..!

Published : May 18, 2026, 01:36 PM IST

సినిమా పాాటలకు మనిషి జీవితాన్ని మార్చేంత బలం ఉంటుందా..? అంటే కొన్ని సాంగ్స్ అవుననే సమాధానం చెబుతాయి. అలాంటిదే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట. ఇది వింటే మీకు గూస్ బంప్స్ ఖాయం… అర్ధం తెెలిస్తే వెంటనే మీలో ఏదైనా సాధించాలన్న కసి పెరుగుతుంది.

PREV
14
నేటి యువతరంలో స్పూర్తి నింపే సాంగ్..

Inspirational Song : సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు... ఇది నిజమో కాదో తెలియదుగానీ కొన్ని పాటలు మన మనసులు కరిగిస్తాయి. ఇలాంటి పాటలు నేటి సమాజానికి చాలా అవసరం. చిన్నచిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవడం, క్షణికావేశంలో నేరాల బాట పట్టడం ఈ కలికాలంలో ఎక్కువయ్యాయి... ముఖ్యంగా యువతలో నిరాశ, నిరుత్సాహం పెరిగిపోతున్నాయి. ఫెయిల్యూర్స్ కి బయపడటం కాదు... వాటిని మెట్లుగా మార్చుకుని విజయానికి బాటలు వేసుకోవాలని స్పూర్తినింపే పాటలు చాలా ఉన్నాయి.

జీవితంలో నిత్యం ఘర్షణలు ఉంటాయి.. వాటితో పోరాడి గెలవాలి అంటూ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట మనల్ని తట్టి లేపుతుంది. ఇది ఓ సినిమా పాట... అయితే ఆ మూవీ కమర్షియల్ పెద్ద హిట్ కాకపోవడంతో స్పూర్తిధాయకమైన ఈ పాట కూడా మరుగునపడింది. కానీ ఈ పాట ఒక్కసారి వింటే విద్యార్థుల్లో ఐఎఎస్, ఐపిఎస్ కావాలన్నంత... వ్యాపారుల్లో అంబానీ, అదానీ అయిపోవాలన్నంత... ఉద్యోగుల్లో ఏ గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవో అవ్వాలన్నంత కసి పెరుగుతుంది.

24
సిరివెన్నెల రాసిన అద్భుతమైన లిరిక్స్ ఇవే..

పల్లవి...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...

ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి...

విశ్రమించవద్దు ఏ క్షణం... విస్మరించవద్దు నిర్ణయం...

అప్పుడే నీ జయం నిశ్చయమ్మురా....

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...

చరణం 1...

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా....

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా...

పశ్చిమాన పొంచిఉండి రవినిమింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా...

గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా...

నిశావిలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా...

రగులుతున్న గుండెకూడా అగ్నిగోళమంటిదేనురా...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...

చరణం 2...

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగుఅడుగునా..

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీదికాదు బ్రతుకు అంటె నిత్యఘర్షణా...

దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటె సైన్యముండునా...

ఆశ నీకు అస్త్రమౌను.. శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవునురా..

నిరంతరం ప్రయత్నమున్నదా.. నిరాశకే నిరాశపుట్టదా...

ఆయువంటు ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవముపైనె గెలుపుచాటురా …

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

34
ఈ పాటలో ఎంత అర్థముందంటే..

''అసలు ఓటమినే ఒప్పుకోకుండా పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదు... విజయం నీ సొంతం కావడం ఖాయం. విశాలమైన ఆకాశాన్ని కూడా చిన్న గువ్వపిల్ల చిన్నదిగా భావిస్తుంది... దాని రెక్కల ముందు ఇది చిన్నబోతుంది. సముద్రం ఎంత పెద్దదైనా చేపపిల్ల ముందు చిన్నదే'' అంటే సీతారామశాస్త్రి అద్భుతంగా రాశారు.

''ప్రతిరోజు పశ్చిమాన సూర్యున్ని అస్తమిస్తాడు... దీంతో సాయంత్రం తానే గెలిచానని భావిస్తుంది. కానీ తర్వాతిరోజు అగ్ని ఉండ సముద్రంలోని బయటకు వస్తున్నట్లు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఇలా రాత్రి గెలుపు కొంతసేపే. సూర్యోదయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలాగే నీ గుండె కూడా రగులుతున్న సూర్యుడి లాంటిది. ఓటమిని అంగీకరించకుండా ప్రయత్నిస్తే చీకట్లు చీల్చుకుని విజయం సాధిస్తావు..'' అంటూ ప్రతిఒక్కరిని తట్టిలేపేలా మొదటి చరణం ఉంటుంది.

''జీవితంలో అసలు నొప్పిలేని నిమిషం ఏదైనా ఉంటుందా... పుట్టుకా, చావు రెండూ నొప్పే కదా.. దీనికి భయపడి నీరసంతో ఆగిపోతే ఏదీ సాధ్యం కాదు... బ్రతుకుతో నిత్యం ఘర్షణ పడాలి. అదిలేదు, ఇదిలేదు అని బాధపడకూడదు. నీకు దేహం, ప్రాణం, నెత్తురు, సత్తువ ఉన్నాయి... ఇంతకంటే ఏం కావాలి. ఆశే ఆయుధంగా, శ్వాసే ఆలోచనగా... నీ ఆశయమే సారథి గా మార్చుకుని నిరంతరం ప్రయత్నించు. ఎలా అంటే నిరాశకే నిరాశ పుట్టేలా'' అంటూ చాలా పదునైన మాటలు ఉపయోగించారు సీతారామశాస్త్రి.

44
''శవముపైనె గెలుపు చాటరా..''

ఈ పాటలో చివరి లైన్ సినిమాలో ఉండదు... కానీ ఇదే తనకు ఎంతో ఇష్టమైందని రచయిన సీతారామశాస్త్రి పలు సందర్భాల్లో తెలిపారు. ''ఆయువంటు ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవముపైనె గెలుపుచాటురా …'' అంటే నీకు బ్రతికున్నంతకాలం చావుపై గెలిచినట్లే... మరి చావంటే భయమెందుకు అనేది ఈ మాటల్లో అంతరార్థంగా ఆయన పేర్కొన్నారు. ''మన పుట్టుకను, చావును అనుభవించలేం... చచ్చిపోతే ఆ సంగతి మనకు తెలియదు.. మరి దానికి ఎందుకు భయం'' అంటూ జీవిత సత్యాన్ని బోధించారు సీతారామశాస్త్రి. ఈ మాటలు జీవించడం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతాయి... చావుపై భయాన్ని తగ్గిస్తాయి.

ఓటమి అనేది అంతం కాదు, విజయానికి మొదటి మెట్టు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఓటమికి తలవంచకుండా పట్టుదలతో ముందుకు సాగడమే నిజమైన విజయం అని ఈ పాట సూచిస్తుంది. సుమన్ హీరోగా నటించిన ‘’పట్టుదల'' సినిమాలో ఈ పాట ఉంది... అయితే ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోవడంతో ఈ పాట మరుగునపడిందని సీతారామశాస్త్రి బాధపడిన సందర్భాలున్నాయి. 

అయితే ఈ పాట పట్ల తనకు అమితమైన మక్కువ ఉందని.. మనిషిలో ఉండాల్సిన పాజిటివ్ దృక్పథాన్ని తట్టి లేపుతుందని సీతారామశాస్త్రి చాలాసార్లు చెప్పేవారు. ఓటమిని అంగీకరించకు...తిరిగి ప్రారంభించు... ఊపిరి పీల్చుకోడానికి కూడా ఓ ప్రయత్నం కావాలి... ప్రయత్నం లేనిదే ఏదీ జరగదని ఈ అద్భుతమైన పాట ద్వారా తెలిపారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

Read more Photos on
click me!

Recommended Stories