నాగచైతన్య, సాయి పల్లవి కలిసి ఇప్పటికే `లవ్ స్టోరీ`లో నటించారు. ఈ ఇద్దరి జోడీకి మంచి పేరొచ్చింది. అక్కినేని అభిమానులు కూడా ఈ పెయిర్‌పై ప్రశంసలు కురిపించారు. అంతగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో `తండేల్` మూవీ రూపొందుతుంది. చందూమొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో ఈ మూవీ భారీ స్కేల్‌లో తెరకెక్కుతుంది. ఓ రకంగా భారీ బడ్జెట్‌తోపాటు పాన్ ఇండియన్ మూవీగా రూపొందిస్తున్నారు. `కార్తికేయ2` తర్వాత చందూ మొండేటి నుంచి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.
మత్య్సకారుల జీవితాల ప్రధానంగా కోస్టల్ ఏరియా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో చేపలు పట్టే కుటుంబానికి చెందిన వ్యక్తిగా నాగచైతన్య కనిపించబోతున్నారు. ఆయనకు ప్రేమికురాలిగా సాయిపల్లవి నటిస్తుంది.
సినిమా ప్రధానంగా వారి మధ్య లవ్ స్టోరీని హైలైట్‌గా చూపించబోతున్నారట. దాని చుట్టూ చోటు చేసుకున్న సంఘర్షణ, వారి లైఫ్ స్టయిల్, స్ట్రగుల్స్ ని చాలా ఎమోషనల్‌గా, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. సినిమా ప్రారంభం తర్వాత వెంటనే ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతంలోని ఓ విలేజ్‌లో చిత్రీకరణ చేశారు. కంటిన్యూగా ఈ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. తాజాగా అది పూర్తయ్యిందట.
ఈ సందర్భంగా ఓడరేపు ప్రాంతంలో వేసిన సినిమా సెట్ లోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సెట్‌లో సహజమైన ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సాయిపల్లవి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె నేచురల్ లుక్‌లో కనిపిస్తుంది.
మరోవైపు నాగచైతన్య డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తున్నారు. మత్య్సకారుడిగా ఆయన దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో ఓ స్టార్ డైరెక్టర్ మెరవడం విశేషం. ఆయనే నీలకంఠ. పలు అద్భుతమైన సినిమాలతో మెప్పించిన ఆయన ఈ మూవీకి వర్క్ చేయడం ఆశ్చర్యంగా మారింది. ఆయన `వెన్నెల`, `ప్రస్థానం`, `ఆటోనగర్ సూర్య`, `రిపబ్లిక్` వంటి చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా టీమ్ చెబుతూ, `తండేల్` టీమ్ అందమైన సుందరమైన గ్రామంలో షెడ్యూల్‌ని ముగించాం. ప్రధాన కాస్టింగ్ అంతా ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ కీలక సన్నివేశాలను ఓడరేవు, విలేజ్‌లో చిత్రీకరించాం. త్వరలో మరిన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, అప్‌డేట్స్ తో మీ ముందుకు వస్తాం` అని తెలిపింది టీమ్. త్వరలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్ వదిలే అవకాశం ఉందని తెలుస్తుంది.