విక్టరీ వెంకటేష్ అంటే విజయాలకు మారుపేరు. అందుకే ఆయనకు విక్టరీ అనే ట్యాగ్ ఇచ్చారు అభిమానులు. చాలా వరకు రీమేక్ సినిమాలతో విజయాలు అందుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్‌లో టాప్ 4 హీరోల్లో ఒకరిగా రాణించారు. ఇప్పటికీ అదే ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. అయితే ఇటీవల నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను సాధించడం లేదు. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ అయినవే ఎక్కువగా ఉంటున్నాయి.
తాజాగా ఆయన `సైంధవ్` చిత్రంతో వచ్చాడు. సంక్రాంతి ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలని వచ్చారు. కానీ ఇందులో తన బలం అయిన ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఎమోషన్స్, సెంటిమెంట్ వంటి అంశాలు లేకుండా వచ్చాడు. యాక్షన్, కూతురు సెంటిమెంట్‌తో సినిమా చేశాడు. ఈ మూవీ తాజాగా విడుదలై నెగటివ్ టాక్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే సింపుల్‌గా దీనికి డిజాస్టర్ టాక్ వస్తుంది. సంక్రాంతి పోటీలో తొలి రోజే డీలా పడిపోయిందని కామెంట్ చేస్తున్నారు ఆడియెన్స్.
మరి ఈ మూవీ డిజప్పాయింట్ చేయడానికి కారణలేంటనేది చూస్తే.. ప్రధానంగా ఇలాంటి యాక్షన్ సినిమాలు సంక్రాంతి వంటి పండక్కి రావడం రాంగ్ ఛాయిస్. సంక్రాంతి అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా, సందడిగా, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉండాలి. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ ఉండాలి. కానీ ఇందులో అవి మిస్ అయ్యాయి. పైగా ఇటీవల వస్తోన్న యాక్షన్ మూవీలా కూడా ఇది లేకపోవడం పెద్ద మైనస్.
సినిమాలో ఒక ప్రాపర్ కథ లేదు. రెండు ట్రాకులుగా ఉంటుంది. ఒకటి కూతురు ప్రాణాలు కాపాడుకోవడం, రెండు డ్రగ్స్, మాఫియాని అంతం చేయడం. ఈ రెండింటికి సంబంధం లేదు. సంబంధాన్ని సరిగా డిజైన్ చేయలేకపోయాడు. కూతురు అనారోగ్యానికి, విలన్లని ఎదుర్కోవడానికి కారణం సింక్ కాలేదు. రెండూ వేర్వేరు అంశాలు. అలా కథ డీవియేట్ అయిపోయింది. దీనికితోడు సైంధవ్ సైకోగా ఎందుకు మారాడో చెప్పలేదు. చివర్లో సింపుల్‌గా ఒక డైలాగ్ చెప్పాడు.
తనకు పెళ్లి, కూతురు విషయాలకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చూపించలేదు. సైకో అని హంగామా చేశారు, మరి సైకోగా ఆయన చేసిన విధ్వంసం ఏంటో చూపించలేదు. వెంకీని చూసి విలన్లు భయపడే సీన్లలో ఫీల్ లేదు, సహజత్వం లేదు. రేర్ డిజీస్‌తో బాధపడుతున్నట్టుగా పిల్లలను చూపించారు, వారి పెయిన్‌ని చూపించలేదు, దాని వల్ల సఫర్ అయ్యే అంశాలను చూపించలేదు. కథ ప్రారంభానికి ముగింపుకి పొంతలేదు. అనేక లాజిక్స్ వదిలేశారు. పాత్రలతోపాటు కథనం సైతం అతుకుల బొంతలా ఉంటుంది. ఏ పాత్రకి జస్టిఫికేషన్ లేదు.
పాటలు పెద్ద మైనస్. కూతురుపై వచ్చే సాడ్ సాంగ్ ఓకే అనిపించింది. మిగిలిన ఏ పాట ఆకట్టుకోలేదు. బీజీఎం అయితే ఏమాత్రం పండలేదు. అసలు ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉందా అనే డౌట్ వస్తుంది. సినిమాలు ట్విస్ట్ లు చాలా ఫ్లాట్‌గా ఉంటాయి. ఏదీ వర్కౌట్ కాలేదు. అసలు అది ఒక ట్విస్ట్ అనేలానే లేదు. దీంతో సినిమా మొత్తం నీరసంగా సాగుతుంది.
మరోవైపు ఇందులో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ని గెటప్ శ్రీనుకి భార్యగా చూపించారు. ఆయన చిత్ర హింసలు పెట్టడం వల్ల దూరంగా ఉంటుంది. వెంకీకి దగ్గరవుతుంది. ఆయన కూతురుని చూసుకుంటుంది. ఎప్పుడూ వెంకీతోపాటు, ఆయన ఇంట్లోనే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య లవ్ కూడా ఉంటుంది. కానీ అందులో ఫీల్ లేదు. ఈ ఇద్దరు ఎందుకు కలిశారో కూడా చెప్పలేదు. దీంతోపాటు తండ్రి కూతుళ్ల మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఎమోషన్స్ పండలేదు. చివర్లో క్లైమాక్స్ లో కూతురు సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ అయ్యింది. అది కూడా ఓవర్ డ్రామాగా మారింది.
అసలు ఈ కథని వెంకీ ఎలా ఒప్పుకున్నాడనేది పెద్ద ప్రశ్న. వెనుకా ముందు చూసుకోవాలి కదా అని ఫ్యాన్స్ నుంచి వినిపించే మాట. తన బలాలను వదిలేసి సంక్రాంతి పూట ఈ ప్రయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారంతా తీవ్రంగా డిజప్పాయింట్ అవుతున్నారు. కథలో ఎంపికలో వెంకీ జడ్జ్ మెంట్ మిస్ అవుతుందనే కామెంట్ వినిపిస్తుంది. `దృశ్యం` తర్వాత ఇటీవల కాలంలో వెంకీ చేసిన `ఎఫ్ 2` మూవీ తప్ప ఏదీ పెద్దగా ఆడింది లేదు. దీంతో వెంకీ జడ్జ్ మెంట్ మిస్ ఫైర్ అవుతున్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి వెంకీ మామ ఎలా ఓవర్‌కమ్ చేస్తారో చూడాలి.